టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్
న్యూఢిల్లీ: భారతదేశ భవిష్యత్తుకు సెమీకండక్టర్లు కీలకంగా ఉంటాయని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ చెప్పారు. అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థలో ముఖ్య పాత్ర పోషించేందుకు సర్వసన్నద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన ప్రతిభావంతుల లభ్యత, దేశీయంగా అతి పెద్ద మార్కెట్, అంతర్జాతీయంగా భాగస్వామ్యాలు కుదుర్చుకునే సత్తాలాంటి అంశాలు దేశానికి సానుకూలంగా ఉన్నాయని వివరించారు. 2026 బ్లూమ్‌బర్గ్ న్యూ ఎకానమీ ఫోరం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు.
దేశీయ వినియోగ అవసరాలను తీర్చే ముఖ్యమైన పరిశ్రమలో అగ్రగామిగా నిల్చేందుకు 160 ఏళ్ల టాటా గ్రూప్ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చంద్రశేఖరన్ చెప్పారు. సెమీకండక్టర్ల వ్యవస్థను నిర్మించడంలో భాగస్వామ్యాలు చాలా ప్రధాన పాత్ర పోషించనున్నందున.. టెక్నాలజీల కోసం గ్లోబల్ దిగ్గజాలతో భారత్ చేతులు కలపాల్సి ఉంటుందని ఆయన వివరించారు. అదే సమయంలో విద్యుత్ అవసరాలపై కూడా ఒక కన్నేసి ఉంచాలని పేర్కొన్నారు.
టాటా గ్రూప్‌లో భాగమైన టాటా ఎలక్ట్రానిక్స్ సంస్థ రూ. 91,000 కోట్ల పెట్టుబడులతో గుజరాత్‌లోని ధొలెరాలో సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం తైవాన్‌కి చెందిన పవర్‌చిప్ సెమీకండక్టర్ మాన్యుఫాక్చరింగ్ కార్పొరేషన్ (పీఎస్‌ఎంసీ)తో జట్టు కట్టింది. వాహనాలు, మొబైల్ పరికరాలు, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ మొదలైన వాటిలో ఉపయోగించే చిప్‌లను ఈ ప్లాంటులో తయారు చేయనున్నారు. టాటా గ్రూప్ అటు అస్సాంలో రూ. 27,000 కోట్లతో సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్ట్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తోంది.


