డెట్, విదేశీ సెక్యూరిటీల్లో పెట్టుబడులకూ ఓకే..
నిబంధనల్లో సెబీ కీలక మార్పులు
ముంబై: పోర్టుఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీసుల (పీఎంఎస్)కు సంబంధించిన నిబంధనల్లో స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ సమగ్ర మార్పులకు తెరతీసింది. పోర్టుఫోలియో మేనేజర్లు ఇకపై ఐపీఓలు, ప్రైమరీ మార్కెట్ బాండ్ ఇష్యూలతో పాటు వివిధ రకాల విదేశీ సెక్యూరిటీల్లో పెట్టుబడి పెట్టేందుకు అనుమతించేలా గురువారం జరిగిన బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది.
నిబంధనలను సరళతరం చేయడంతో పాటు పీఎంఎస్ క్లయింట్లకు మరింత విస్తృత పెట్టుబడి అవకాశాలు కల్పించేలా సెబీ (ఫోర్టుఫోలియో మేజర్స్) నిబంధనలు, 2026కు ఆమోదం తెలిపింది.
కొత్త ఫ్రేమ్‌వర్క్ ప్రకారం... క్లయింట్లకు సంబంధించిన నిర్వహణ ఆస్తుల (ఏయూఎం)లో 10 శాతం వరకు పెట్టుబడి గ్రేడ్, అన్‌లిస్టెడ్ నాన్–కన్వర్టబుల్ డెట్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. అయితే, ఇందుకు ఆయా క్లయింట్ల నుంచి అనుమతి తప్పనిసరి. నాన్–డిస్క్రేషనరీ పోర్టుఫోలియో మేనేజ్‌మెంట్, అడ్వయిజరీ సర్వీసులు క్లయింట్ల ఏయూఎంలో 25% వరకు అన్‌లిస్టెడ్ సెక్యూరిటీల్లో పెట్టుబడిగా పెట్టేందుకు వీలవుతుంది.
అదేవిధంగా పోర్టుఫోలియో మేనేజర్లు తమ క్లయింట్ల నిధులను లిస్టెడ్ ఈక్విటీ, డెట్, రీట్స్, విదేశీ మ్యూచువల్ ఫండ్స్, ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌లు), ఇండెక్స్ ఫండ్స్, విదేశీ ప్రభుత్వ సెక్యూరిటీలు సహా విదేశీ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేసేందుకు కూడా సెబీ అనుమతించింది. మరోపక్క, పోర్టుఫోలియో మేనేజర్ రూట్ ద్వారా మ్యూచువల్ ఫండ్ యూనిట్ల (పీఆర్‌ఐఎం)లో పెట్టుబడి పెట్టేందుకూ అవకాశం లభిస్తుంది.
రిజిస్టర్డ్ పోర్టుఫోలియో మేనేజర్ల భాగస్వామ్యంతో క్లయింట్ పోర్టుఫోలియోలను నిర్వహించేందుకు ఇండిపెండెంట్ ఫండ్ మేనేజర్ల (ఐఎఫ్‌ఎం)లకు అవకాశం ఇచ్చే కొత్త కాన్సెప్టును కూడా సెబీ అమల్లోకి తెస్తోంది. సెబీ గణాంకాల ప్రకారం పీఎంఎస్ పరిశ్రమ ఏయూఎం ఈ ఏడాది మే నాటికి రూ.42.61 లక్షల కోట్లకు ఎగబాకింది. 2019 ఏప్రిల్‌లో ఇది కేలం రూ.18.07 లక్షల కోట్లు మాత్రమే. అలాగే, క్లయింట్ల సంఖ్య 1.5 లక్షల నుంచి 2.19 లక్షలకు చేరగా... పోర్టుఫోలియో మేనేజర్ల సంఖ్య 515 నుంచి 216కు పెరిగింది.


