మార్కెట్‌కు ‘బీమా’ షాక్..
రూ. 4 లక్షల కోట్లు హుష్!
ఐఆర్‌డీఏఐ ప్రతిపాదనలతో బ్యాంకులు, ఫైనాన్స్ షేర్లు క్రాష్
108 డాలర్లకు ఎగసిన బ్రెంట్ క్రూడ్
19 ఏళ్ల గరిష్టానికి అమెరికా బాండ్ ఈల్డ్స్
మళ్లీ తెరపైకి యూఎస్ వడ్డీ రేట్ల పెంపు
1,247 పాయింట్లు క్షీణించి, మూడు నెలల కనిష్టానికి సెన్సెక్స్
అయిదు నెలల కనిష్టానికి నిఫ్టీ... 383 పాయింట్ల పతనం
ముంబై: బీమా రంగానికి సంబంధించిన విధివిధానాల్లో మార్పులకు బీమా నియంత్రణ సంస్థ ‘ఐఆర్‌డీఏఐ’ చేసిన ప్రతిపాదనలతో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. అలాగే, అమెరికా బాండ్లపై రాబడులు(ఈల్డ్స్) పెరగడం, క్రూడాయిల్ ధరలు పుంజుకోవడం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు అంచనాలు తెరపైకి రావడం సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫలితంగా గురువారం సెన్సెక్స్ 1,248 పాయింట్లు కుప్పకూలి 73,579 వద్ద స్థిరపడింది.
గడచిన మూడు నెలల్లో ఈ సూచీకిదే అత్యంత కనిష్ట ముగింపు. నిఫ్టీ 384 పాయింట్లు క్షీణించి ఐదు నెలల కనిష్టం 23,063 వద్ద నిలిచింది. సూచీలు ఒకటిన్నర శాతం పతనంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 4 లక్షల కోట్లు హరించుకుపోయి రూ.480 లక్షల కోట్లకు దిగొచ్చింది. పశ్చిమాసియాలో మళ్లీ తలెత్తిన ఉద్రిక్తతలతో బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర ఏకంగా 5% ఎగసి 108 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
రోజంతా విక్రయాలు: ప్రపంచ ప్రతికూలతలు, ఎన్‌ఎస్‌ఈ లిస్టింగ్‌ల నేపథ్యంలో ఉదయమే సూచీలు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ‘ఐఆర్‌డీఏఐ’ ప్రతిపాదనలు వెల్లడి తర్వాత అన్ని రంగాల షేర్లలో ముఖ్యంగా ‘బ్యాంకులు, ఫైనాన్స్’ షేర్లలో భారీగా లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ట్రేడింగ్ గడిచేకొద్దీ అమ్మకాల తీవ్రత మరింత పెరిగాయి. ఒకానొక దశలో సెన్సెక్స్ 1,264 పాయింట్లు క్షీణించి 73,564 వద్ద, నిఫ్టీ 401 పాయింట్లు పడి 23,046 వద్ద కనిష్టాలకు దిగొచ్చాయి.
అన్ని రంగాలూ డీలా: బీఎస్‌ఈలో అన్ని రంగాల ఇండెక్సులన్నీ డీలా పడ్డాయి. అత్యధికంగా ప్రైవేట్ రంగ బ్యాంక్స్ 3%, హౌసింగ్ ఫైనాన్స్ 2.56%, ఫైనాన్స్ సర్వీసెస్ 2.32%, ఇన్సూరెన్స్ 2.20%, మెటల్ 1.65% క్షీణించాయి. మిడ్‌క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్ 3.12%, స్మాల్‌క్యాప్ సెలెక్స్ సూచీ 1.19 శాతం నష్టపోయాయి.
సెన్సెక్స్‌లో ఒక షేరుకే లాభాలు: సెన్సెక్స్ సూచీలోని 30 షేర్లలో ఎన్‌టీపీసీ షేరు మాత్రమే ఎలాంటి లాభ, నష్టాలను లోనవకుండా యథాతథంగా క్రితం ముగింపు (రూ.326) వద్దే ముగిసింది. మిగిలిన 29 షేర్లూ నష్టాలు చవిచూశాయి. బజాజ్ ఫైనాన్స్ (–5.74%), యాక్సిస్ బ్యాంక్ (–4.67%), బజాజ్ ఫిన్‌సర్వ్ (–4.06%), ఇండిగో (–2.78%), ట్రెంట్ (–2.75%) అత్యధికంగా పతనమయ్యాయి.
బీమా, ఫిన్‌టెక్ షేర్లు డౌన్..!
నియంత్రణ సంస్థ ‘ఐఆర్‌డీఏఐ’ ప్రతిపాదించిన కొత్త విధివిధానాలతో దలాల్ స్ట్రీట్‌లోని బీమా, ఫిన్‌టెక్ షేర్లు బెంబేలెత్తాయి. నిర్వహణ వ్యయాల పరిమితిని తగ్గించడంతో పాటు ఏజెంట్లు, మధ్యవర్తుల కమీషన్లపై కఠిన నిబంధనలను విధించేందుకు ‘ఐఆర్‌డీఏఐ’ సిద్ధమైంది. బ్యాంకులు, డిస్ట్రిబ్యూషన్ ప్లాట్‌ఫామ్‌లకు వచ్చే ‘బ్యాంకస్యూరెన్స్ ఆదాయం’ తగ్గి లాభాల మార్జిన్లు దెబ్బతింటాయనే ఆందోళనలు వెల్లువెత్తాయి.
పీబీ ఫిన్‌టెక్ (పాలసీ బజార్) అత్యధికంగా 35.98% క్షీణించింది. టర్టిల్‌మింట్ 20% పతనమవ్వగా.. మాక్స్ ఫైనాన్షియల్ (9.8%), హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ (6.1%), న్యూ ఇండియా అస్యూరెన్స్ (5.4%), నివా బూపా (5%), మెడి అసిస్ట్ (4.8%), ఐసీఐసీఐ ప్రు (4.23%) షేర్లు తీవ్రంగా నష్టపోయాయి. ఇక బీమా లో కీలక భాగస్వాములుగా ఉన్న యాక్సిస్ బ్యాంక్ (4.67%), ఇండస్‌ఇండ్ (4.15%), బజాజ్ ఫై నాన్స్ (5.47%) పడ్డాయి.


