ఐపీవో ద్వారా 6.3 శాతం ఆఫర్
ఐపీవోకు ఎస్‌బీఐ గ్రీన్ సిగ్నల్
అనుబంధ సంస్థ ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్(ఎస్‌బీఐఎఫ్‌ఎంఎల్)లో 6 శాతం వాటా విక్రయించనున్నట్లు బ్యాంకింగ్ రంగ పీఎస్‌యూ దిగ్గజం స్టేట్‌బ్యాంక్(ఎస్‌బీఐ) పేర్కొంది. ఇందుకు బ్యాంక్ కేంద్ర బోర్డు తాజాగా అనుమతించినట్లు వెల్లడించింది. ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ స్పాన్సర్‌లలో ఒకటైన కంపెనీ.. ఎస్‌బీఐ కార్డ్స్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ తదుపరి ఎస్‌బీఐకు మూడో అనుబంధ సంస్థగా వ్యవహరిస్తోంది.
ఐపీవో ద్వారా ఎస్‌బీఐ ఫండ్స్‌లో 6.3 శాతం వాటాకు సమానమైన 3,20,60,000 ఈక్విటీ షేర్లను ఆఫ్‌లోడ్ చేయనున్నట్లు ఎస్‌బీఐ తెలియజేసింది. అయితే ఎస్‌బీఐ ఫండ్స్‌కు మరో ప్రమోటర్ అయిన అముండి ఇండియా హోల్డింగ్ సైతం 3.7 శాతం వాటాకు సమానమైన 1,88,30,000 ఈక్విటీ షేర్లను ఆఫర్ చేయనున్నట్లు ఎస్‌బీఐ వెల్లడించింది. వెరసి ఐపీవో ద్వారా ఎస్‌బీఐ ఫండ్స్‌లో 10 శాతం వాటాను విక్రయానికి ఉంచనున్నట్లు వివరించింది. ప్రమోటర్ సంస్థలు సంయుక్తంగా ఐపీవో సన్నాహాలు ప్రారంభించినట్లు తెలియజేసింది. 2026లో పూర్తయ్యే వీలున్నట్లు అంచనా వేసింది. ప్రస్తుతం ఎస్‌బీఐ ఫండ్స్‌లో ఎస్‌బీఐకు 61.91 శాతం, అముండి ఇండియాకు 36.36 శాతం చొప్పున వాటా ఉంది.
నాన్‌యూటీఐ ఫండ్..
ఎస్‌బీఐ ఆధ్వర్యంలో 1987లో దేశీయంగా తొలి నాన్‌యూటీఐ మ్యూచువల్ ఫండ్‌గా ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ ఏర్పాటైంది. 1992లో ఎస్‌బీఐకు సొంత అనుబంధ సంస్థగా ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ ఆవిర్భవించింది. తద్వారా ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్స్‌కు ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్‌గా వ్యవహరిస్తోంది. విభిన్న అసెట్ క్లాసెస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ సొల్యూషన్స్ అందిస్తోంది. ఎస్‌బీఐ ఫండ్స్ దేశీయంగా 15.55 శాతం మార్కెట్ వాటాతో అతిపెద్ద అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీగా నిలుస్తోంది. 2025 సెప్టెంబర్ 30కల్లా ఆల్టర్నేట్ ఫండ్స్ ద్వారా రూ. 16.32 లక్షల కోట్ల నిర్వహణలోని ఆస్తులను కలిగి ఉంది.
ఇదీ చదవండి: జేబుకు తెలియకుండానే కన్నం వేస్తున్నారా?


