జీతాలు.. పన్ను భారం.. జాగ్రత్తగా లెక్కించాలి | Salary income and tax liability | Sakshi
Sakshi News home page

జీతాలు.. పన్ను భారం.. జాగ్రత్తగా లెక్కించాలి

May 12 2025 8:29 AM | Updated on May 12 2025 8:38 AM

Salary income and tax liability

మొత్తం ఆదాయలన్నింటిని 5 శీర్షికలుగా విభజించారు. అందులో మొదటిది జీతాలు. ఈ వారం జీతాలకు సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం. జీతం అనే ఆదాయాన్ని పొందే వ్యక్తులను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు.  
🔸    ప్రభుత్వ ఉద్యోగులు 
🔸    ప్రైవేటు సెక్టార్‌ ఉద్యోగులు 
🔸    క్యాజువల్‌ లేబర్‌  

ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, ప్రభుత్వ అనుబంధ సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థలు ఇలా.. పెద్ద జాబితా తయారవుతుంది. ప్రైవేటు సెక్టార్‌ పరిధిలో కంపెనీలు, సంస్థలు .... ఇదొక జాబితా. ఈ రెండూ కాకుండా క్యాజువల్‌గా పనిచేసే కార్మికులు, పనివారు. ఉద్యోగులు .. అంటే ప్రస్తుతం పని చేసేవారే కాకుండా రిటైర్‌ అయిన వారు పదవీ విరమణ తర్వాత డ్రా చేసే ఫైనాన్స్‌ని కూడా ‘జీతం’గానే పరిగణిస్తారు.

ఫ్యామిలీ ఫైనాన్స్‌ని మాత్రం ఇతర ఆదాయంగా పరిగణిస్తారు. డబ్బులు ఇచ్చే వ్యక్తికి, ఆ డబ్బులు పుచ్చుకునే వ్యక్తికి మధ్య యజమాని–సేవకుడు అనే సంబంధం ఉంటేనే ఈ వ్యవహారాలను జీతంగా పరిగణిస్తారు. ఎటువంటి ఉద్యోగం..?  ప్రైవేటా... ప్రభుత్వమా.., ఫుల్‌టైమా.., పార్ట్‌టైమా.., రెగ్యులరా..? పర్మినెంటా..? తాత్కాలికమా..? క్యాజువలా..? ఇటువంటి విషయాలతో నిమిత్తం లేదు.  

సెక్షన్‌ 15, సెక్షన్‌ 17లోని అంశాలు పరిశీలిస్తే జీతాల పరిధిని, నిర్వచనాన్ని చాలా జాగ్రత్తగా తయారు చేశారనిపిస్తుంది. నిర్ధిష్టంగా, సంక్షిప్తంగా, క్లుప్తంగా నిర్వచించే సందర్భాల్లో... ఒక జాబితా తయారు చేసి ఇందులో అంశాలన్నీ ‘జీతం’ అని అంటారు. చెల్లించవల్సిన జీతం టాక్సబుల్, చెల్లించకపోయినా టాక్సబుల్‌. ప్రస్తుత యజమాని, పూర్వపు యజమాని .. ఎవరు ఇవ్వాల్సినా, దాని మీద పన్ను పడుతుంది. చెల్లించిన జీతాల గురించి చెప్పక్కర్లేదు. ఎరియర్స్‌ జీతాల మీద పన్ను పడుతుంది. ‘డ్యూ’ జీతం, చెల్లించిన జీతం... ఏది ముందు జరిగితే దానికి టాక్స్‌ వర్తింపచేస్తారు.  అడ్వాన్స్‌ జీతం చెల్లించిన సంవత్సరంలో టాక్స్‌ వర్తింపచేస్తారు.  

జీతం... అంటే వేతనాలు, పెన్షన్లు, అలవెన్సులు, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్,  గ్రాట్యుటీ, అడ్వాన్స్‌ జీతం, కమీషన్, ప్రావిడెంట్‌ ఫండ్‌ క్రెడిట్‌ ద్వారా ప్రతి సంవత్సరం వచ్చి చేరే మొత్తం, న్యూ పెన్షన్‌ స్కీంలో చేసే చెల్లింపులు లాంటివన్నీ దీని పరిధిలోకి వస్తాయి. విదేశాల నుంచి జీతం వస్తే దాన్ని మన కరెన్సీలోకి మార్చి ఆ విలువను పరిగణనలోకి తీసుకుంటారు. బోనస్‌ ఏ సంవత్సరం చేతికొచ్చిందో ఆ సంవత్సరం టాక్స్‌ వేస్తారు. గత సంవత్సరాల జీతాలు ‘ఎరియర్స్‌’ ప్రస్తుత సంవత్సరం వస్తే మీకు రెండు ఆప్షన్లు ఉంటాయి.

మొదటిది ఏంటంటే మొత్తాన్ని కరెంట్‌ సంవత్సరంలో వచ్చినట్లు లెక్కించడం లేదా రెండో ఆప్షన్‌ ప్రకారం గత ఆర్థిక సంవత్సరానికి సర్దుబాటు చేయడం వలన రిలీఫ్‌ వస్తే దాన్ని పొందడం. వదులుకున్న జీతం మీద టాక్సు పడుతుంది. కేంద్ర ప్రభుత్వానికి వదిలేసిన జీతం మీద పన్ను భారం లేదు. జీతాలు విదేశాల్లో చెల్లించినా ఇండియాలోనే టాక్స్‌ వేస్తారు. డిప్యుటేషన్‌ మీద విదేశాలకు వెళ్లిన వారు ఇండియాలోనే పన్ను చెల్లించాలి.  

ఇక పెర్క్స్, పెర్క్విజిట్స్‌.. ఇదొక జాబితా.. రెంట్, ఫ్రీ వసతి, రాయితీ మీద ఇల్లు ఇవ్వడం, ఇతర సదుపాయాలు.. ఇలా ఎన్నో అంశాలు ఉంటాయి. ఎంత మొత్తం మీద పన్ను పడుతుందనేది వాల్యుయేషన్‌ చేయాలి. రూలు 3 ప్రకారం... టాక్సు వర్తించే అంశాన్ని, దాన్ని ఎలా వాల్యూ చెయ్యాలో విశదీకరించారు.  పెర్క్స్‌ తర్వాత చెప్పుకోదగినది జీతానికి బదులుగా ఇచ్చే మొత్తం. ఈ మొత్తం మీద కూడా పన్ను భారం పడుతుంది. ఉదాహరణకు పరిహారం.

ఇక కొన్ని అలవెన్సులు మీద మినహాయింపు ఉంది. లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్, గ్రాట్యూటీ, ఇంటి అద్దె అలవెన్సు మొదలైనవి ఇంకా ఎన్నో ఉంటాయి. పన్ను భారం తగ్గించుకోవడానికి అనేక ఇన్వెస్ట్‌మెంట్‌ పద్దతులున్నాయి. ఇవే 80 ఇ నుంచి మొదలయ్యే అంశాలు ఉన్నాయి. ఇదోక పెద్ద జాబితా. జీతం ఒక చిన్న పదం. దాని పరిధిలో ఎన్నో అంశాలు ఉంటాయి. ఎంతో జాగ్రత్తగా పన్ను భారాన్ని లెక్కించాలి.

పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్‌ పంపించగలరు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement