మిస్‌ సెల్లింగ్‌.. బుట్టలో పడకూడదంటే..? | Sakshi Special Story About Mis-Selling Of ULIPs | Sakshi
Sakshi News home page

మిస్‌ సెల్లింగ్‌.. బుట్టలో పడకూడదంటే..?

May 12 2025 6:18 AM | Updated on May 12 2025 8:10 AM

Sakshi Special Story About Mis-Selling Of ULIPs

బ్యాంకుల్లో బీమా, ఫండ్స్‌ విక్రయాలు 

కొన్ని సందర్భాల్లో తప్పుదోవ పట్టించి అమ్మకాలు 

మోసపోతే చర్యలు తీసుకోవచ్చు 

పూర్తి సమాచారం తెలుసుకోవాలి 

నిపుణుల సలహాతో నిర్ణయం బెటర్‌ 

ఇటీవలే పదవీ విరమణ చేసిన ప్రకాష్‌ (60)కు వివిధ ప్రయోజనాల రూపంలో రూ.40 లక్షలు సమకూరాయి. వీటిని బ్యాంక్‌లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసి (ఎఫ్‌డీ) దానిపై ప్రతి నెలా ఆదాయం తీసుకోవాలని భావించాడు. సీనియర్‌ సిటిజన్స్‌కు అర శాతం అదనపు రేటు కూడా అతన్ని ఆకర్షించింది. తీరా బ్యాంక్‌కు వెళ్లిన తర్వాత అక్కడి రిలేషన్‌ షిప్‌ మేనేజర్‌ (ఆర్‌ఎం) సూచనలతో మరింత రాబడి కోసం ‘స్పెషల్‌ ఎఫ్‌డీ’లో ఇన్వెస్ట్‌ చేశాడు.

అది కాస్తా యులిప్‌ ప్లాన్‌ అని తర్వాత తెలియడంతో ఎవరికి చెప్పుకోలేక లోలోపలే ఆవేదన చెందాడు. గత రాబడుల గురించి గొప్పగా చెప్పడంతో ఆర్‌ఎం మాటలతో బోల్తా పడ్డాడు. 55 ఏళ్ల నారాయణ మూర్తి చిన్న కిరాణా దుకాణం నడుపుతున్నాడు. ఒక్కతే కుమార్తె. ఉన్నత విద్య కోసం అమెరికాకు పంపాడు. 

ఇటీవలే ఊళ్లో భూమిని విక్రయించగా రూ.20 లక్షలు చేతికి వచ్చింది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేద్దామని బ్యాంక్‌కు వెళ్లాడు. అక్కడి మేనేజర్‌ ఎఫ్‌డీ కంటే మంచి రాబడి వస్తుందంటూ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఆ మొత్తాన్ని ఇన్వెస్ట్‌ చేయించాడు. మనలో చాలా మందికి ఇలాంటి అనుభవాలు ఎదురుకావొచ్చు. అవగాహనతోనే ఇలాంటి వాటికి చెక్‌ పెట్టడం సాధ్యపడుతుంది.  

తిరుచ్చిరాపల్లికి చెందిన నారాయణస్వామి దంపతులకూ ఇలాంటి అనుభవమే ఎదురైంది. గడువు తీరిన ఎఫ్‌డీని రెన్యువల్‌ చేద్దామని బ్యాంక్‌కు వెళ్లగా.. దానికి బదులు యులిప్‌ ప్లాన్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలన్న సూచన బ్యాంక్‌ నుంచి వచ్చింది. దీంతో వారు ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ (ఆర్థిక సేవల సలహాదారు)ను సంప్రదించారు. యులిప్‌ ప్లాన్‌లో పెట్టుబడులకు దూరంగా ఉండాలన్న సూచనతో ఎఫ్‌డీ రెన్యువల్‌కే మొగ్గు చూపించారు. బీమా పాలసీలు, మ్యూచువల్‌ ఫండ్స్, ఇతర పెట్టుబడి సాధనాలను తప్పుడు మార్గాల్లో విక్రయించడం ఇటీవలి కాలంలో ఎక్కువగా కనిపిస్తోంది. దీన్నే మిస్‌ సెల్లింగ్‌గా చెబుతున్నారు. బ్యాంక్‌లు, మ్యూచువల్‌ ఫండ్స్‌ పంపిణీదారులు, బీమా ఏజెంట్ల బుట్టలో పడకుండా ఉండాలంటే కావాల్సింది అవగాహన, స్వీయ జాగ్రత్తలే. ఇలాంటి సందర్భాల్లో కార్యాచరణ ఎలా ఉండాలన్నది చూద్దాం.     

2023 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరం ఐఆర్‌డీఏఐ గణాంకాల ప్రకారం బీమా కంపెనీలకు వ్యతిరేకంగా 1,27,378 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో 50 శాతం జీవిత బీమా కంపెనీలు మిస్‌ సెల్లింగ్‌ విధానాలకు వ్యతిరేకంగా దాఖలైనవే ఉన్నాయి. బ్యాంకింగ్‌ ఉత్పత్తుల కంటే మ్యూచువల్‌ ఫండ్స్, ఇన్సూరెన్స్‌ ఉత్పత్తులకు సంబంధించి తప్పుదోవ పట్టించి విక్రయించడం అతిపెద్ద సమస్యగా ఉన్నట్టు గ్రాంట్‌ థార్న్‌టన్‌ పార్ట్‌నర్‌ వివేక్‌ అయ్యర్‌ తెలిపారు. ‘‘బ్యాంకుల ఉత్పత్తులు సులభంగా, సరళంగా ఉంటాయి. అదే మ్యూచువల్‌ ఫండ్స్, ఇన్సూరెన్స్‌ అన్నవి మార్కెట్‌ రిస్క్లు, షరతులతో ముడిపడి ఉంటాయి. కొన్ని సందర్భాల్లో నిపుణులకు సైతం వీటి గురించి చెప్పడం కష్టంగానే ఉంటుంది’’ అని వివరించారు. 

బ్యాంకుల ద్వారా ఎక్కువ మిస్‌ సెల్లింగ్‌ అవుతున్నది బీమా ఉత్పత్తులేనని ఆర్థిక సర్వే 2024 సైతం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా యస్‌ బ్యాంక్‌ ఉదాహరణ గురించి కూడా చెప్పుకోవాలి. లోగడ యస్‌ బ్యాంక్‌ సిబ్బంది ఎఫ్‌డీల పేరుతో ఏటీ–1 బాండ్లను కస్టమర్లకు విక్రయించారు. నిజానికి అవి పర్పెచ్యువల్‌ బాండ్లు. ఈ విషయం తమకు చెప్పనేలేదని కస్టమర్లు ఆరోపించడం గమనార్హం. ఏటీ–1 బాండ్లకు మెచ్యూరిటీ ఉండదు. నిర్ణీత కాలానికోసారి వడ్డీ చెల్లింపులు చేస్తారు. ఎఫ్‌డీల కంటే వీటిపై అధిక రేటు ఉంటుంది. బ్యాంక్‌ నష్టపోతే వీటికి ఎలాంటి చెల్లింపులు చేయరు. వాటిని రద్దు చేయొచ్చు కూడా. 2020లో యస్‌ బ్యాంక్‌ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడు రూ.8,400 కోట్ల ఏటీ–1 బాండ్లను రద్దు చేసింది.

మార్కెటింగ్‌ లక్ష్యాలు.. 
→ బీమా ఉత్పత్తులను ఎఫ్‌డీల కంటే అధిక రాబడులను ఇచ్చే సాధనాలుగా బ్యాంక్‌ ఆర్‌ఎంలు విక్రయిస్తుండడం తరచుగా కనిపిస్తోంది. కొన్ని సందర్భాల్లో మూడు నుంచి ఐదేళ్ల కాలం కోసం ఉద్దేశించిన పెట్టుబడి సాధనాలుగా వాటిని బ్యాంక్‌ సిబ్బంది విక్రయిస్తున్నట్టు డెలాయిట్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ సెక్టార్‌ లీడర్‌ దేవాశిష్‌ బెనర్జీ తెలిపారు.  
→ బ్యాంక్‌ రుణం మంజూరునకు, లాకర్ల సదుపాయం తెరవాలంటే ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకోవడం తప్పనిసరి అని కొన్ని బ్యాంకులు షరతు పెడుతున్నాయి.  
→ యూనిట్‌ లింక్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్లు (యులిప్‌లు), డిఫర్డ్‌ యాన్యుటీ ప్లాన్లు (ఇన్వెస్ట్‌ చేసిన కొంత కాలం తర్వాత నుంచి దానిపై ఆదాయం చెల్లించేవి), గ్యారంటీడ్‌ ఇన్‌కమ్‌ ప్లాన్లు సైతం తçప్పుడు మార్గాల్లో విక్రయిస్తున్నారు.  
→ రిస్క్‌ అంతగా తీసుకునే సామర్థ్యం లేని సంప్రదాయ ఇన్వెస్టర్లకు అధిక రిస్క్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలను విక్రయిస్తున్నారు.  
→ పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌ సరీ్వసెస్‌ (పీఎంఎస్‌), ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌ (ఏఐఎఫ్‌లు)ను తరచుగా మ్యూచువల్‌ ఫండ్స్‌ కంటే మెరుగైనవంటూ మార్కెటింగ్‌ చేస్తున్నారు. 
→ కొన్ని సందర్భాల్లో అవసరం లేకపోయినా కస్టమర్లతో రుణాలు తీసుకునేలా ప్రోత్సహిస్తున్నారు. ఎఫ్‌డీ ప్రారంభిస్తే తక్కువ రేటుపై పర్సనల్‌ లోన్‌ ఇస్తామంటూ కొన్ని సందర్భాల్లో బ్యాంక్‌ సిబ్బంది కస్టమర్లను కోరుతున్నారు. తమకు విధించిన లక్ష్యాలను చేరుకునేందుకు వీలుగా బ్యాంక్‌ సిబ్బంది ఇలాంటి ఉత్పత్తులను ఏదో ఒక రకంగా కస్టమర్లతో కొనిపించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.  
→ 1 ఫైనాన్స్‌ మ్యాగజైన్‌’ 2024 అక్టోబర్‌ సర్వే నివేదిక ప్రకారం.. లక్ష్యాలను చేరుకోకపోతే ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుందన్న భయంతో బ్యాంక్‌ ఆర్‌ఎంలలో 57 శాతం మంది ఆర్థిక ఉత్పత్తులను తప్పుడు మార్గాల్లో విక్రయిస్తున్నట్టు చెప్పారు.

అవగాహనతోనే నివారణ 
ఏ ఉత్పత్తిని అయినా కొనుగోలు చేసే ముందు పూర్తి పరిశీలన అవసరం. దాని గురించి సమగ్రంగా తెలుసుకుని, అవగాహన ఏర్పడిన తర్వాతే కొనుగోలుపై నిర్ణయం తీసుకోవాలి. బ్యాంక్‌లు విక్రయిస్తున్నవన్నీ తప్పుదోవపట్టించి అంటగట్టేవిగా చూడడం సరికాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికీ జీవిత, ఆరోగ్య బీమా అవసరం. ఇప్పుడు చాలా బ్యాంక్‌లు గ్రూప్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కవరేజీని, గ్రూప్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కవరేజీని నాన్‌ గ్రూప్‌తో పోలి్చతే తక్కువ ప్రీమియానికే ఆఫర్‌ చేస్తున్నాయి. కనుక బ్యాంక్‌ల్లో అందుబాటులో ఉండే ఉత్పత్తుల్లో కొన్ని ప్రయోజనకరమైనవీ ఉంటాయన్నది మర్చిపోవద్దు. ముఖ్యంగా అధిక రాబడుల కాంక్షతో పెట్టుబడి సాధనాలను కొనుగోలు చేయడం సరికాదు. ఇంటర్నెట్‌లో సంబంధిత ఉత్పత్తి గురించి శోధిస్తే సమగ్ర సమాచారం చిటికెలో లభిస్తుంది. ‘‘ఏజెంట్‌ను గుడ్డిగా నమ్మకుండా కస్టమర్లు తమ పరిశోధన తర్వాత సహేతుక నిర్ణయాలు తీసుకోవాలి. ప్రతి రోజూ ఎన్నో కొత్త ఉత్పత్తులు వస్తుండడంతో బ్యాంక్‌ ఆర్‌ఎంలపై లక్ష్యాల భారం పడుతోంది. ఈ ఒత్తిడితో ఆయా సాధనాల గురించి కస్టమర్లకు వివరంగా చెప్పకుండానే తప్పుడు మార్గాల్లో విక్రయించాల్సిన పరిస్థితి నెలకొంది’’ అని గ్రాంట్‌ థార్న్‌టన్‌ పార్ట్‌నర్‌ వివేక్‌ అయ్యర్‌ తెలిపారు.

మోసపోతే ఏం చేయాలి? 
→ ఇప్పటికే బ్యాంక్‌ నుంచి ఏదైనా ఉత్పత్తిని కొనుగోలు చేసి, అది తమ అవసరాలను సరిపడదని గుర్తిస్తే దీనిపై చర్యలు చేపట్టొచ్చు. బ్యాంక్‌ కస్టమర్‌ సేవల విభాగం లేదా ఆర్‌ఎం వద్ద ఫిర్యాదు దాఖలు చేయాలి. ఫలితం రాకపోతే అదే బ్యాంక్‌లో ఫిర్యాదుల పరిష్కార విభాగం దృష్టికి తీసుకెళ్లాలి.  
→ బ్యాంక్‌ స్థాయిలో సమస్య పరిష్కారం కాకపోతే లేదా సంతృప్తికరమైన ఫలితం రాకపోతే అప్పుడు బ్యాంకింగ్‌ అంబుడ్స్‌మన్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. ‘‘సంబంధిత లావాదేవీని రద్దు చేయాలని అంబుడ్స్‌మన్‌ ఆదేశించగలదు. లేదా పరిహారం ఇప్పిస్తుంది. లేదా దిద్దుబాటు చర్యలకు ఆదేశిస్తుంది. ఇదొక సమర్థవంతమైన పరిష్కార యంత్రాంగం. దీనికి న్యాయపరమైన ప్రతినిధి అవసరం లేదు’’అని ఢిల్లీకి చెందిన న్యాయవాది నిషాంత్‌ దత్తా సూచించారు. 
→ బ్యాంక్, అంబుడ్స్‌మన్‌ స్థాయిల్లో పరిష్కారం రాకపోతే అప్పుడు వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార కమిషన్‌ (వినినయోగదారుల ఫోరమ్‌) వద్ద కేసు దాఖలు చేయాలి.   
→ చివరిగా కోర్టును ఆశ్రయించడం ద్వారా న్యాయం కోసం ప్రయత్నించొచ్చు. గతంలో పలు హైకోర్టులు, సుప్రీంకోర్టుల వరకు ఇలాంటి మిస్‌ సెల్లింగ్‌ కేసులు వెళ్లాయి. ఆ సమయంలో కోర్టులు సైతం కఠినంగా స్పందించాయి.  
→ వీరేంద్ర పాల్‌ కపూర్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా (2014) కేసులో.. రాబడులపై తప్పుడు సమాచారంతో పాలసీని విక్రయించిన బీమా సంస్థ అందుకు పూర్తి బాధ్యత వహించాలని ఆదేశించింది. బ్యాంక్‌ సిబ్బంది చర్యలకు బ్యాంకులే బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు సైతం 2013లో ఓ కేసు సందర్భంగా స్పష్టం చేసింది. 
→ మ్యూచువల్‌ ఫండ్స్‌ పంపిణీదారులు లేదా ఏజెంట్లు ఉత్పత్తులను తప్పుగా అంటగడితే సెబీ వద్ద ఫిర్యాదు దాఖలు చేయాలి.  
→ బీమా ఏజెంట్ల కారణంగా తమకు అనుకూలం కాని ఉత్పత్తులను కొనుగోలు చేసినట్టయితే బీమా అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించాలి.  

ప్రయోజనాలు.. రిస్క్ లు చూడాలి... 
బ్యాంక్‌ ఆఫర్‌ చేస్తున్నఉత్పత్తిలోని ప్రయోజనాలు, రిస్క్లు, అవి తమకు ఏ మేరకు అనుకూలమన్నది ప్రశి్నంచాలి. అర్థవంతమైన వివరణ అనంతరం సరైన నిర్ణయం తీసుకోవాలి. రుణం మంజూరు కావాలంటే దానికి అనుబంధంగా టర్మ్‌ ప్లాన్‌ తీసుకోవాలని కోరొచ్చు. అవసరం లేకపోతే అదే విషయం తేలి్చచెప్పండి. తమకు అప్పటికే లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కవరేజీ లేకపోతే కొనుగోలును పరిశీలించొచ్చు. సంతకాలు చేసే ముందు ఆయా పత్రాలను వివరంగా చదివి అర్థం చేసుకోవాలి. గ్యారంటీడ్‌ (హామీతో కూడిన) రాబడుల పేరుతో ఏదైనా ఉత్పత్తిని విక్రయించే ప్రయత్నం చేస్తుంటే.. అది డెట్‌ సాధనమే అయి ఉండాలి. 

అధిక రాబడులు వస్తాయంటుంటే అది ఈక్విటీ సాధనమైనా అయి ఉండొచ్చు. గత రాబడులు భవిష్యత్‌ పనితీరుకు హామీ కాదు. ఉత్పత్తి ఏదైనా సరే తమ అవసరాలకు సరితూగే విధంగా ఉండాలి. ఉదాహరణకు 60 ఏళ్లు నిండిన వారికి జీవిత బీమా కవరేజీ అవసరం ఉండదు. కనుక వారు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. యులిప్‌లు అయినా, ఈక్విటీలు అయినా అధిక రిస్క్తో కూడినవి. వృద్ధాప్యంలో మెజారిటీ మొత్తం సురక్షిత సాధనాల్లోనే ఉండాలన్న విషయాన్ని మర్చిపోకూడదు. సెబీ, యాంఫి, ఆర్‌బీఐ, ఐఆర్‌డీఏఐ ఇప్పటికే తమ నియంత్రణల పరిధిలో సంస్థలకు ఈ విషయమై ఆదేశాలు జారీ చేశాయి.  

→ మీ అవసరాలను, ఆర్థిక లక్ష్యాలను ముందుగా తేల్చుకోవాలి. ఆ తర్వాత అందుకు అనుకూలమైన సాధనాన్ని ఎంపిక చేసుకోవాలి. 
→ పెట్టుబడుల పత్రాలను సమగ్రంగా చదివి, సందేహాలను తీర్చుకున్న తర్వాతే ముందుకు వెళ్లాలి. 
→ రిస్క్‌ తీసుకోలేని వారు అధిక రాబడులను ఆశించడం సరికాదు. అధిక రాబడులను ఇచ్చే సాధనాల్లో ఎలాంటి హామీ ఉండదు. 
→ పెట్టుబడులు, రక్షణ కలసిన ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. ఈ రెండింటినీ వేర్వేరుగా తీసుకోవాలి. 

– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement