గడిచిన వారమంతా బుల్ పరుగులే. నిఫ్టీ ఏకంగా 1.64 శాతం పెరగగా సెన్సెక్స్ 1.39 శాతం పెరిగింది. మరి ఈ వారం ఏమవుతుంది? ఇన్వెస్టర్లు ఏం చెయ్యాలి? వాస్తవానికి మార్కెట్లు ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయిలకు దగ్గర్లో ఉన్నాయి. ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాల్సిన తరుణమిది.
అమెరికాతో వాణిజ్య చర్చలు కొన్నాళ్లుగా జరుగుతూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఈ వారంలో ట్రేడ్ డీల్ కుదిరే అవకాశం ఉందని వార్తలు వస్తూనే ఉన్నాయి. డీల్ మాత్రం కుదరటం లేదు. కుదిరినా అది మన వ్యవసాయ రక్షణలకు ప్రతికూలంగా నిలుస్తుందా? అలాంటి ఆందోళనలేవీ అవసరం లేని స్థాయిలో ఉంటుందా? అనేది తెలియదు. దీనికితోడు నవంబరు నెల ఎఫ్ అండ్ ఓ ఎక్స్‌పైరీ కూడా ఉంది. ఎక్స్‌పైరీ రోజుల్లో... అంటే మంగళవారం, గురువారం మార్కెట్లు తీవ్రమైన హెచ్చుతగ్గులు చూసే అవకాశముంది.
ప్రతికూల, అనుకూల అంశాలివీ...
దేశీయంగా...
ఈ ఏడాది (2025–26) రెండో త్రైమాసిక(జూలై–సెపె్టంబర్) జీడీపీ గణాంకాలు 28న వెలువడతాయి. ఏప్రిల్–జూన్(క్యూ1)లో దేశ ఆరి్థక వ్యవస్థ 7.8 శాతం పురోగతి సాధించింది. ఇది గత ఐదు త్రైమాసికాలలోనే అత్యధికం. ఈ సారి గణాంకాలు ఎలా ఉంటాయో చూడాలి.
అక్టోబర్ నెల పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) గణాంకాలు కూడా 28నే వెల్లడవుతాయి. సెపె్టంబర్‌లో ఐఐపీ 4% ఎగసింది. ఈసారీ ఆ స్థాయిలో ఉండొచ్చనే అంచనాలున్నాయి.
విదేశీ అంశాలు
కొద్ది రోజులుగా ఎఫ్‌ఐఐలు (విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు) దేశీ స్టాక్స్‌లో అమ్మకాలకే అధిక ప్రాధాన్యమిస్తున్నారు. కాకపోతే దేశీ ఫండ్లు కొనుగోళ్లు చేస్తుండటంతో మార్కెట్లు పెద్దగా పడటం లేదు. యూఎస్ మార్కెట్ల తీరు, అమెరికా, చైనా డేటాను గమనించాల్సి ఉంటుంది.
గత వారం రూపాయి విలువ డాలరుతో పోలిస్తే సరికొత్త ఆల్‌టైమ్ కనిష్టానికి (89.66) పతనమైంది. ఇది ప్రతికూలమే. ఈ వారం పతనం కొనసాగుతుందా? లేదా? చూడాలి...
గమనించాల్సిన ప్రధాన షేర్లు...
హెచ్‌డీఎఫ్‌సీ
డిపాజిట్లలో వృద్ధి వివరాలు వెల్లడవుతాయి. మార్జిన్లపై కంపెనీ వెల్లడించే వివరాలు అనుకూల ప్రభావాన్ని చూపించొచ్చు.
లిక్విడిటీ బలహీనంగా ఉండటం... కాస్ట్ ఆఫ్ ఫండ్స్ వంటివి ప్రతికూలాంశాలు.
జేఎస్‌డబ్ల్యూ స్టీల్...
ఎగుమతులకు డిమాండ్ బాగుండి, స్టీల్ ధరలు పెరిగితే అది ఈ షేరుకు సానుకూలం.
స్టీల్ ధరలు పతనమై.. చైనా నుంచి డిమాండ్ బలహీనపడితే అది షేరుకు ప్రతికూలం
టీసీఎస్
రూపాయి ధర స్థిరంగా ఉండి, అమెరికా టెక్నాలజీ కంపెనీల ఫలితాలు బాగుంటే అది షేరుకు సానుకూలం.
అంతర్జాతీయ టెక్ కంపెనీలు వ్యయాన్ని తగ్గించుకుంటున్నట్లు ప్రకటిస్తే అది ప్రతికూలం.
హెచ్‌ఏఎల్
రక్షణ శాఖ నుంచి, ఎగుమతుల కోసం ఆర్డర్లు వచ్చే చాన్సుంది. విదేశీ భాగస్వామ్యాలపై కొత్త సమాచారం వెలువడితే అది సానుకూలం.
ప్రాజెక్టులను పూర్తి చేయటంలో, పేమెంట్లలో జాప్యం వార్తలు ప్రతికూలమనే చెప్పాలి.
సాంకేతికంగా..
ఈ వారం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి 26,200 పాయింట్ల వద్ద రెసిస్టెన్స్ ఎదురుకావచ్చు. ఈ స్థాయి దాటితే 26,350 వద్ద తదుపరి అమ్మకాల ఒత్తిడి కనిపించవచ్చు.
నిఫ్టీ బలహీనపడితే 25,900 పాయింట్ల వద్ద తొలి సపోర్ట్ లభించవచ్చు. తదుపరి 25,850 పాయింట్ల వద్ద కొనుగోళ్ల మద్దతుకు వీలుంది.


