
భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి, గ్రామీణ అభివృద్ధిని పెంచడానికి వ్యవసాయ రుణాలు చాలా ముఖ్యం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులను వ్యవసాయ రుణాలు పెంచాలని తరచుగా ఆదేశిస్తున్నారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సకాలంలో రుణం అందడం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు, రైతుల జీవనోపాధికి కీలకం. అయితే ఈ దిశగా కేంద్రం చేస్తున్న కృషికి అనుగుణంగా బ్యాంకులు వీటి పంపిణీని ఆశించినంతగా పెంచడం లేదు. అందుకు కొన్ని సవాళ్లను ఎదురవుతున్నాయనే వాదనలున్నాయి.
నాన్-పెర్ఫార్మింగ్ అసెట్స్(NPA) భయం
వ్యవసాయ రంగంలో అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాలు, ప్రభుత్వాల రుణమాఫీ పథకాల ప్రకటన కారణంగా రుణాలు తిరిగి చెల్లించడంలో విఫలమయ్యే ప్రమాదం ఉంటుంది. దీని ఫలితంగా బ్యాంకులకు మొండి బకాయిలు (NPA) పెరిగే అవకాశం ఉంది. పెద్ద పరిశ్రమల మొండి బకాయిలతో పోలిస్తే రైతుల మొండి బకాయిలు తక్కువగా ఉన్నప్పటికీ బ్యాంకులకు ఇది ఆందోళనగా మిగిలిపోతుంది.
రుణాల దుర్వినియోగం
కొందరు రుణగ్రహీతలు వ్యవసాయం పేరుతో బంగారం తాకట్టు రుణాలు తీసుకుని వాటిని రియల్ ఎస్టేట్ లేదా ఇతర వ్యక్తిగత అవసరాలకు వినియోగించడం (ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో) బ్యాంకు అధికారులు తనిఖీల్లో గుర్తిస్తున్నారు. దీనివల్ల రుణం పొందిన ప్రయోజనం నెరవేరకపోవడం, రాయితీ వడ్డీ పథకాలు దుర్వినియోగం అవుతున్నాయి. ఈ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఆర్‌బీఐ కఠిన మార్గదర్శకాలు తీసుకువచ్చింది.
పూచీకత్తు సమస్యలు
చిన్న, సన్నకారు రైతులకు, కౌలు రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు లేకపోవడంతో బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. కౌలు రైతుల విషయంలో సరైన ధ్రువీకరణ వ్యవస్థ లేకపోవడంతో వారికి రుణాలు అందడం లేదు.
వ్యవసాయ క్షేత్రాల పరిశీలన సవాళ్లు
గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రుణాల పంపిణీ తర్వాత అవి నిజంగా వ్యవసాయ అవసరాలకు వాడుతున్నారా లేదా అని తనిఖీ చేయాలి. అందుకు బ్యాంకులకు తగినంత మానవ వనరులు, మౌలిక సదుపాయాలు లేకపోవడం ఒక సమస్యగా ఉంది.
రుణమాఫీ జాప్యం
గత ప్రభుత్వాల హయాంలో రుణమాఫీ పథకాలు ప్రకటించినప్పటికీ వాటి అమలులో జాప్యం జరుగుతుంది. దానివల్ల రైతులు పాత రుణాలను రెన్యూవల్ చేసుకోలేకపోతున్నారు. దీని ఫలితంగా బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి.
ఇదీ చదవండి: భారత రైల్వేలో అపార అవకాశాలు