
భారతీయ రైల్వే వ్యవస్థ ప్రస్తుతం గణనీయమైన పరివర్తన దశలో ఉంది. భారత రైల్వే కేవలం రవాణా వ్యవస్థ మాత్రమే కాదు.. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తోంది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించిన లక్ష్యాల ప్రకారం.. 2047 నాటికి 7,000 కిలోమీటర్ల మేర హై-స్పీడ్ కారిడార్లను విస్తరించడం, వందేభారత్, అమృత్ భారత్ రైళ్లను పెద్ద ఎత్తున ప్రవేశపెట్టడం వంటి కార్యక్రమాలు ప్రతిపాదించారు. దాంతో అంతర్జాతీయ, దేశీయ కంపెనీలకు భారత రైల్వే మార్కెట్‌లో అపారమైన అవకాశాలు లభిస్తాయనే అంచనాలున్నాయి.
ప్యాసింజర్ల అవసరాలకు అనువుగా..
అంతర్జాతీయ కంపెనీలతోపాటు దేశీయ సంస్థలు భారతీయ ప్యాసింజర్ల అవసరాలు తీర్చడానికి కొన్ని విధానాలు అనుసరించాల్సి ఉంటుంది. హై-స్పీడ్, ప్రీమియం విభాగం (వందేభారత్ వంటివి) అవసరమే అయినప్పటికీ మెజారిటీ ప్రయాణీకులకు సరసమైన ప్రయాణం(అమృత్ భారత్ వంటివి) అవసరం. ధరల విషయంలో భారతదేశ మార్కెట్‌కు ప్రత్యేకంగా సరిపోయే భాగాలను, రైళ్లను ఉత్పత్తి చేయాలి. భారతీయ రైళ్లలో రద్దీని దృష్టిలో ఉంచుకుని తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది ప్రయాణికులను చేరవేసే విధంగా కోచ్ డిజైన్‌లలో మార్పులు చేయాల్సి ఉంటుంది. సీటింగ్, లగేజీ స్థలం వంటివి దృష్టిలో ఉంచుకోవాలి.
దేశీయ తయారీని ప్రోత్సహించేందుకు తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని, నైపుణ్యాన్ని భారతీయ భాగస్వాములకు బదిలీ చేయాలి. రైల్వే విడి భాగాలు, వ్యవస్థలను భారతదేశంలోనే తయారుచేయడానికి తయారీ యూనిట్లను నెలకొల్పాలి. తద్వారా స్థానిక ఉపాధి కల్పన పెరుగుతుంది. ఆఫ్రికా వంటి దేశాలకు ఎగుమతి చేయాలనే లక్ష్యం ‘మేక్ ఇన్ ఇండియా’ కేంద్రాల నుంచే ప్రారంభమైతే అంతర్జాతీయ కంపెనీలకు భారత ప్రభుత్వ సహకారం మరింత లభించే అవకాశం ఉంటుంది.
భద్రత ప్రమాణాలు కీలకం
రైళ్ల వేగం పెరుగుతున్న నేపథ్యంలో భద్రతా ప్రమాణాలు అత్యంత కీలకం. కవచ్ వంటి స్వదేశీ సాంకేతికతలతో అనుసంధానం అయ్యే అత్యాధునిక సిగ్నలింగ్, ట్రాకింగ్ నిర్వహణ వ్యవస్థలను అందించాలి. రైలు ఆలస్యాలను, నిర్వహణ ఖర్చులను తగ్గించడానికి అత్యంత విశ్వసనీయత కలిగిన డివైజ్‌లను అందించాలి. దాంతోపాటు రైళ్లలో మెరుగైన సౌకర్యాలు (ఉదా: పరిశుభ్రమైన మరుగుదొడ్లు, మెరుగైన సీటింగ్, వినోద వ్యవస్థలు) అందించడంపై దృష్టి సారించాలి. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, దివ్యాంగుల అవసరాలకు అనుగుణంగా కోచ్ డిజైన్‌లను అభివృద్ధి చేయాలి.
కంపెనీలకు వాణిజ్య అవకాశాలు
భారత రైల్వే విస్తరణలో హై-స్పీడ్ కారిడార్లు, వందే భారత్, అమృత్ భారత్ వంటి రైళ్ల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దాంతో కంపెనీలకు అనేక వాణిజ్య అవకాశాలున్నాయి.
మౌలిక సదుపాయాలు
ప్రభుత్వం 2047 వరకు 7,000 కి.మీ.ల హై-స్పీడ్ కారిడార్లను ఏర్పాటు చేయాలని తలపెట్టిన నేపథ్యంలో అధిక నాణ్యత కలిగిన ట్రాక్ మెటీరియల్స్, వెల్డింగ్ సాంకేతికతలు, ట్రాక్ నిర్వహణ యంత్రాలు, అంతర్జాతీయ ప్రమాణాల నిర్మాణ నైపుణ్యం అవసరం. హై-స్పీడ్ రైళ్లకు అత్యాధునిక ఓవర్‌హెడ్ ఎక్విప్‌మెంట్ (OHE), ప్రపంచ స్థాయి సిగ్నలింగ్, కమ్యూనికేషన్ వ్యవస్థలు ముఖ్యం. కంపెనీలు ఇందులో పెట్టుబడులు పెట్టవచ్చు.
వందేభారత్ స్లీపర్ వెర్షన్లు, మెట్రో రైళ్లు, అమృత్ భారత్ (నాన్-ఏసీ జనరల్ క్లాస్) రైళ్లను పెద్ద సంఖ్యలో తయారు చేయాల్సి ఉంటుంది. కంపెనీలు కోచ్ డిజైన్, ప్రొపల్షన్ సిస్టమ్స్, బ్రేకింగ్ సిస్టమ్స్ వంటి అత్యంత కీలక భాగాలను సరఫరా చేయవచ్చు. భారత రైల్వేతో కలిసి సంయుక్తంగా ఉత్పత్తి ప్రారంభించవచ్చు.
ఎగుమతి ఉత్పత్తి కేంద్రాలు
భారతదేశాన్ని రైల్వే భాగాల తయారీ కేంద్రంగా ఉపయోగించుకోవడానికి కంపెనీలకు ఇదో అవకాశం. ఇక్కడ తక్కువ ఖర్చుతో తయారైన రైల్వే భాగాలను ఆఫ్రికా, ఆసియాలోని ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎగుమతి చేయవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత నిర్వహణ వ్యవస్థలు, డేటా అనలిటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారిత ట్రాక్ పర్యవేక్షణ, ప్రయాణీకుల సమాచార వ్యవస్థలను అందించడంలో అవకాశాలు ఉన్నాయి. కొత్త రైళ్లను, సాంకేతికతలను నిర్వహించడానికి ప్రస్తుత రైల్వే వర్క్‌షాప్‌లను ఆధునీకరించడానికి అత్యాధునిక యంత్రాలు, నైపుణ్యం అవసరం.
అమృత్ భారత్ స్టేషన్ పథకం
ఈ పథకం కింద వేల సంఖ్యలో స్టేషన్లను పునరుద్ధరిస్తున్నారు. కంపెనీలు స్టేషన్ డిజైన్, ఎస్కలేటర్లు, లిఫ్టులు, లాంజ్ సౌకర్యాలు, రిటైల్ స్పేస్‌ల అభివృద్ధిలో పాలుపంచుకోవచ్చు. ఇందులో భారీ పెట్టుబడులు అవసరం కాబట్టి ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) నమూనాల ద్వారా ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడంలో కంపెనీలు ముఖ్య పాత్ర పోషించవచ్చు.
ఇదీ చదవండి: పలుచబడిన ఐపీఎల్ మార్కెట్! కారణాలివే..