
విత్తనాలు వ్యవసాయ పరిశ్రమకు కీలకం. ఆహార ఉత్పత్తి, సుస్థిరత, వాణిజ్య లాభదాయకతలో ఇవి ప్రధానపాత్ర పోషిస్తాయి. విత్తన ఉత్పత్తి రంగంలో నిత్యం విప్లవాత్మక మార్పులొస్తున్నాయి. సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులకు అతీతంగా బయోటెక్ ఆవిష్కరణలు, స్థిరమైన పద్ధతుల ద్వారా వీటిని ఉత్పత్తి చేసి రైతన్నలకు అధిక దిగుబడులు ఇవ్వాలని శాస్త్రవేత్తలు, కంపెనీలు, ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆహార డిమాండ్ పెరగడంతో విత్తన పరిశ్రమలో పెట్టుబడులు, పరిశోధనలు, మార్కెట్ పోటీ పెరుగుతోంది.
మార్కెట్ ఇలా..
అధిక దిగుబడి, వాతావరణ మార్పులు, పంటలకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా 2030 నాటికి ప్రపంచ వ్యవసాయ విత్తన మార్కెట్ 100 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. బేయర్ క్రాప్ సైన్స్, సింజెంటా, కోర్టెవా అగ్రిసైన్స్, యూపీఎల్.. వంటి ప్రధాన సంస్థలు ఈ పరిశ్రమలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అయితే సేంద్రీయ, స్వదేశీ విత్తనాల ఉత్పత్తులపై అభివృద్ధి చెందుతున్న స్టార్టప్‌లు దృష్టి సారిస్తున్నాయి.
వ్యాపార ధోరణులు
బయోటెక్, జీఎం విత్తనాలు: జన్యుమార్పిడి (జెనటికల్లీ మాడిఫైడ్-జీఎం) విత్తనాలను తెగుళ్లు, కరువు, వ్యాధులను తట్టుకేనేందుకు ఉత్పత్తి చేస్తున్నారు. ఇవి దిగుబడిని మెరుగుపరుస్తాయని కంపెనీలు చెబుతున్నాయి. వీటి నియంత్రణ, వినియోగదారుల ప్రాధాన్యతల చుట్టూ వివాదాలు ఉన్నప్పటికీ జన్యుమార్పిడి విత్తనాలు ఏటా బిలియన్ల ఆదాయాన్ని సృష్టిస్తూనే ఉన్నాయి.
హైబ్రిడ్ విత్తనాలు: అధిక ఉత్పాదకత కోసం రూపొందించిన హైబ్రిడ్ విత్తనాలను వ్యవసాయంలో విరివిగా వాడుతున్నారు. ఇవి రైతుల ఆదాయాన్ని పెంచుతున్నాయి.
సేంద్రీయ, సుస్థిర విత్తనాలు: సుస్థిర వ్యవసాయం పెరగడంతో సేంద్రీయ విత్తనాలు ప్రజాదరణ పొందుతున్నాయి. పర్యావరణ స్పృహ కలిగిన వినియోగదారులను, నియంత్రణ సంస్థలను ఇవి ఆకర్షిస్తున్నాయి.
శీతోష్ణస్థితిని తట్టుకునే విత్తనాలు: వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో కీలకమైన వేడిని, వరదలను తట్టుకునే రకాలను అభివృద్ధి చేయడానికి కంపెనీలు పరిశోధనలో పెట్టుబడులు పెడుతున్నాయి.
ఈ-కామర్స్, డైరెక్ట్-టు-ఫార్మర్ సేల్స్: డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా రైతులు నేరుగా ఉత్పత్తిదారుల నుంచి అధిక నాణ్యత విత్తనాలను పొందడానికి వీలు కలుగుతుంది. మధ్యవర్తులపై ఆధారపడటాన్ని ఈ ప్లాట్‌ఫామ్‌లు తగ్గిస్తున్నాయి.
పెట్టుబడి, లాభదాయకత
విత్తన కంపెనీలు ప్రత్యేక జన్యు పరీక్షలపై పేటెంట్లను పొందుతున్నాయి. దీని ద్వారా మేధో సంపత్తి హక్కులను అందిపుచ్చుకుంటూ దీర్ఘకాలిక ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. అదనంగా ప్రభుత్వ సబ్సిడీలు, పరిశోధన గ్రాంట్లు, కార్పొరేట్ భాగస్వామ్యాల ద్వారా కంపెనీలు వాటి మార్కెట్‌ను పెంచుకుంటున్నాయి. వ్యవసాయ వృద్ధిని అందిపుచ్చుకోవాలని చూస్తున్న ఇన్వెస్టర్లు కృత్రిమ మేధ ఆధారిత బ్రీడింగ్ పద్ధతుల్లో నైపుణ్యం కలిగిన విత్తన ఉత్పత్తి స్టార్టప్‌లపై ఆసక్తి చూపుతున్నాయి. భారత విత్తన మార్కెట్ 2025 నాటికి 3.82 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. 2030 నాటికి ఇది 5.01 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. 2022లో మొత్తం సాగు విస్తీర్ణంలో హైబ్రిడ్ విత్తనాలు 80.6%గా ఉన్నాయి.
సవాళ్లు
రెగ్యులేటరీ ఆంక్షలు: జన్యుమార్పిడి విత్తనాల ఆమోదానికి సంబంధించి నియమాలు దేశాన్ని బట్టి మారుతాయి. ఇది ప్రపంచ వాణిజ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
అధిక పరిశోధన ఖర్చులు: కొత్త విత్తన వంగడాలను అభివృద్ధి చేయడానికి విస్తృతమైన పరిశోధన అవసరం అవుతుంది. ఇది విత్తన ఉత్పత్తి ఖర్చులను పెంచుతుంది.
సరసమైన ధరలు: నాణ్యమైన విత్తనాలను చిన్న, సన్నకారు రైతులకు సరసమైన ధరలకు అందేలా చూడటం సవాలుగా మారుతుంది. దీనికితోడు బ్లాక్‌లో విత్తనాలు విక్రయించే మాఫియా ప్రభుత్వ యంత్రాంగానికి సవాలుగా మారుతుంది.
ఇదీ చదవండి: దానశీలురు ఈ కార్పొరేట్లు
వ్యవసాయ విత్తనాలను బ్లాక్ మార్కెట్‌లో విక్రయించకుండా నిరోధించడానికి ప్రభుత్వ యంత్రాంగం, సాంకేతిక పరిష్కారాలు, రైతుల్లో అవగాహన కల్పిచడం కీలకం. విత్తన కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్లకు కచ్చితమైన సర్టిఫికేషన్ ప్రమాణాలు ఉండేలా చూడాలి. నకిలీ విత్తన విక్రయాలకు కఠిన శిక్షలు అమలు చేయాలి. విత్తన ధ్రువీకరణకు క్యూఆర్ కోడ్‌లు, ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్‌లను ఉపయోగించాలి. తక్కువ దిగుబడులు, తెగుళ్ల బెడద, చట్టపరమైన సమస్యలు వంటి బ్లాక్ మార్కెట్ విత్తనాల వల్ల కలిగే నష్టాలపై రైతులకు అవగాహన కల్పించాలి.