
కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లాలో ఆకస్మిక గుండె మరణాల పెరుగుదలకు కొవిడ్-19 వ్యాక్సిన్లతో సంబంధం ఉందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇటీవల చేసిన వ్యాఖ్యలను బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షా ఖండించారు. సిద్ధరామయ్య వ్యాఖ్యలు అవాస్తవమని, వాటితో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే అవకాశం ఉందని తెలిపారు.
‘భారత్‌లో అభివృద్ధి చేసిన కొవిడ్-19 వ్యాక్సిన్లను అత్యవసర వినియోగ ఆథరైజేషన్ ఫ్రేమ్‌వర్క్ కింద అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కఠినమైన ప్రోటోకాల్స్‌ను అనుసరించి ఆమోదించారు. ఈ వ్యాక్సిన్లు హడావుడిగా ఆమోదించారని తెలపడం సరికాదు. ఇది ప్రజల్లో తప్పుడు సమాచారానికి దోహదం చేస్తుంది. ఈ వ్యాక్సిన్లు లక్షల మంది ప్రాణాలను కాపాడాయి. అన్ని వ్యాక్సిన్ల మాదిరిగానే చాలా తక్కువ సంఖ్యలో కొందరిలో దుష్ప్రభావాలు కలిగి ఉండవచ్చు. నిందలు మోపడం కంటే వ్యాక్సిన్ల అభివృద్ధి వెనుక ఉన్న సైన్స్, డేటా-ఆధారిత ప్రక్రియలను గుర్తించడం చాలా ముఖ్యం’ అని ఆమె తన ఎక్స్ ఖాతాలో రాశారు.
కమిటీ ఏర్పాటు..
హసన్ జిల్లాలో గత నెలలోనే 20 మందికి పైగా గుండెపోటుతో మరణించారని కర్ణాటక ముఖ్యమంత్రి తెలిపారు. దీనిపై విచారణ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించారు. పిల్లలు, యువకులు, అమాయకుల మరణాలకు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామని, వారి కుటుంబాల ఆందోళనలను తాము పంచుకుంటామని సిద్ధరామయ్య సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. కొవిడ్ వ్యాక్సిన్లను హడావుడిగా ఆమోదించి ప్రజలకు పంపిణీ చేయడం కూడా ఈ మరణాలకు ఒక కారణం కావొచ్చని చెప్పారు. ఈమేరకు ప్రపంచవ్యాప్తంగా అనేక అధ్యయనాలు సూచించాయని తెలిపారు.
భాజపా రాజకీయ లబ్ధి కోసం..
కర్ణాటక వ్యాప్తంగా యువతలో ఆకస్మిక మరణాలకు గల కారణాలు, కొవిడ్-19 వ్యాక్సిన్లతో ఏమైనా సంబంధం ఉందా అనే విషయాలను అధ్యయనం చేసే బాధ్యతను ఫిబ్రవరిలో ఇదే నిపుణుల కమిటీకి అప్పగించినట్లు ఆయన తెలిపారు. గుండె సంబంధ వ్యాధిగ్రస్తులపై ప్రాథమిక విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఈ ఆరోగ్య సమస్యలను భాజపా నేతలు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని సిద్ధరామయ్య ఆరోపించారు.
COVID-19 vaccines developed in India were approved under the Emergency Use Authorisation framework, following rigorous protocols aligned with global standards for safety and efficacy. To suggest that these vaccines were ‘hastily’ approved is factually incorrect and contributes to… https://t.co/uMEcMXzBV0
— Kiran Mazumdar-Shaw (@kiranshaw) July 3, 2025
ఇదీ చదవండి: ‘ఆర్‌బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఎస్‌బీఐ తీరు’
వ్యాక్సిన్లతో ఎలాంటి సంబంధం లేదు: కేంద్రం
సిద్ధరామయ్య వాదనలకు ప్రతిస్పందనగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దేశంలోని అత్యున్నత ప్రజారోగ్య పరిశోధనా సంస్థలకు చెందిన ముఖ్య అధికారులతో కలిసి కొవిడ్-19 వ్యాక్సిన్లకు, హసన్ జిల్లాలో చోటుచేసుకుంటున్న మరణాలకు మధ్య ఎలాంటి సంబంధం లేదని ఖండించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సీడీసీ) సంయుక్త వివరణలో ప్రస్తుత విశ్లేషణలు కొవిడ్‌కు ముందు, కొవిడ్ అనంతరం సంభవించిన గుండె సంబంధిత మరణాల మధ్య పెద్ద తేడాలు గుర్తించలేదని తెలిపాయి.