
గురుగ్రామ్, బెంగళూరుకు మధ్య కొన్ని విషయాల్లో దగ్గరి పోలికలున్నాయని బయోకాన్ ఛైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా అన్నారు. దేశంలోని రెండు అత్యంత సంపన్న నగరాల్లో స్థానిక ప్రభుత్వాలు మౌలిక సదుపాయాల కల్పనను విస్మరించాయని విమర్శించారు. కాలమిస్ట్, వ్యాపారవేత్త సుహేల్ సేథ్ గురుగ్రామ్‌పై చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ఆమె ఈమేరకు తన ఎక్స్ ఖాతాలో స్పందించారు.
అంతకుముందు సేథ్ ఓ మీడియా కార్యక్రమంలో మాట్లాడుతూ..‘గురుగ్రామ్‌లోని మౌలిక సదుపాయాలు దేశానికి సిగ్గుచేటు. ఈ నగరం దేశ రాజధానికి సమీపంలో ఉన్నప్పటికీ అక్కడి నగర పాలక సంస్థ అధికారులతీరు దారుణంగా ఉంది. గురుగ్రామ్‌లో ట్రాఫిక్ సిగ్నల్స్ కంటే ఎక్కువ మద్యం దుకాణాలు, పాఠశాలల కంటే బార్లు అధికంగా ఉన్నాయి. స్మార్ట్‌గా వ్యవహరించని నాయకులతో స్మార్ట్ సిటీల ఏర్పాటు సాధ్యం కాదు’ అని ఘాటుగా విమర్శించారు.
దీనిపై మజుందార్ షా ఎక్స్ ద్వారా స్పందించారు. ‘ధనిక నగరాల దుస్థితి ఇలాగే ఉంది. బెంగళూరు కూడా మరో గురుగ్రామ్‌లా మారుతోంది. మౌలిక సదుపాయాలు, పౌర సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత లేకుండా ప్రభుత్వం బంగారు బాతు(అభివృద్ధి చెందుతోన్న నగరాలు)ను దోచుకుని చంపేస్తోంది. డబ్బు సంపాదన కోసం భవన నిర్మాణ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు’ అని సేథ్ వ్యాఖ్యలకు మద్దతుగా మాట్లాడారు.
This is the fate of every rich city. Bengaluru is another Gurugram The state plunders n kills the golden goose with no responsibility to provide basic infrastructure n civic amenities -building rules are flouted to make money etc. @Suhelseth https://t.co/OLlM3YXaL1
— Kiran Mazumdar-Shaw (@kiranshaw) July 26, 2025
ఇదీ చదవండి: ఒకటికి మించిన ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా?
దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘సరస్సులు, పచ్చదనం, సరైన ప్రణాళికతో కొత్త బెంగళూరును నిర్మించే అవకాశం ప్రభుత్వానికి లభించింది. కానీ ట్రాఫిక్, చెత్తాచెదారంతో కాంక్రీట్ జంగిల్‌గా మారుస్తున్నారు’ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. ‘పట్టణ ప్రణాళిక అనేది ఒక డెడ్ డిపార్ట్‌మెంట్. బహిరంగ ప్రదేశాలపై సరైన నిబంధనలు లేవు. బెంగళూరు రోడ్లు పార్కింగ్ స్థలాలుగా మారాయి’ అని ఒకరు చెప్పారు. స్మార్ట్ సిటీల గురించి 15-20 ఏళ్లుగా వింటున్నామని మరో యూజర్ ఆవేదన వ్యక్తం చేశారు.