
సిస్టమ్యాటిక్ విత్ డ్రాయల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ) అంటే ఏంటి? ఏక మొత్తంలో ఓ పథకంలో పెట్టుబడి పెట్టి, తదుపరి నెల నుంచి ఎస్‌డబ్ల్యూపీ ద్వారా ఆదాయం పొందొచ్చా? అలా అయితే అది నా పెట్టుబడిపై ప్రభావం చూపిస్తుందా? – రాఘవరాజు
పెట్టుబడులను పెట్టడమే కాదు.. వాటిని వెనక్కి తీసుకునే విషయంలోనూ తగిన ప్రణాళిక కలిగి ఉండాలి. మార్కెట్లలో అస్థిరతలను అధిగమించేందుకు క్రమానుగత పెట్టుబడులకు సిప్ ఎలా ఉపయోగపడుతుందో..? అదే మాదిరి.. పెట్టుబడిని నిర్ణీత కాలానికి ఓసారి వెనక్కి తీసుకునేందుకు ఎస్‌డబ్ల్యూపీ వీలు కల్పిస్తుంది. మార్కెట్లు కనిష్టాల్లో (తక్కువ విలువల వద్ద) ఉన్నప్పుడు పెట్టుబడి మొత్తాన్ని ఒకేసారి వెనక్కి తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఎస్‌డబ్ల్యూపీ సాయపడుతుంది. రిటైర్మెంట్ తీసుకున్న వారికి, అదనపు ఆదాయం కోరుకునే వారికి అనుకూలం. దీని ద్వారా వారు తమకు కావాల్సినంత స్థిరమైన ఆదాయం పొందే ఏర్పాటు చేసుకోవచ్చు. ఎన్ని రోజులకు ఒకసారి ఆదాయం రావాలన్నది నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉంటుంది.
ఇన్వెస్టర్ ప్రతీ నెలా నిర్ణీత తేదీన, నిర్ణీత మొత్తాన్ని ఎస్‌డబ్ల్యూపీ ద్వారా రావాలని నిర్ణయించుకుంటే.. అదే రోజు ఆ మొత్తం బ్యాంకు ఖాతాకు జమ అవుతుంది. ఆ మేరకు పెట్టుబడుల విలువ తగ్గుతుంటుంది. సిప్ ఎంపిక చేసుకుంటే.. ప్రతీ నెలా నిర్ణీత మొత్తం బ్యాంకు ఖాతా నుంచి మ్యూచువల్ ఫండ్ పథకంలో పెట్టుబడిగా వెళుతుంది. దీనికి పూర్తి వ్యతిరేకంగా పనిచేసేదే ఎస్‌డబ్ల్యూపీ. మీ మొత్తం పెట్టుబడుల్లో కనీసం మూడింట ఒక వంతును ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఒక ఏడాదిలో ఎస్‌డబ్ల్యూపీ ద్వారా ఉపసంహరించుకునే మొత్తం పెట్టుబడుల విలువలో 4–6 శాతం మించకుండా జాగ్రత్తపడాలి. దీనివల్ల పెట్టుబడికి నష్టం లేకుండా ఉంటుంది.
ఇదీ చదవండి: ‘దేశానికి రక్షణ కల్పించండి.. మీ సమస్యలతో మేం పోరాడుతాం’
ఉదాహరణకు మీ పెట్టుబడులపై రాబడి వార్షికంగా 8–9 శాతంగా ఉండి, 5 శాతాన్ని వెనక్కి తీసుకునేట్టు అయితే.. అప్పుడు మిగిలిన 3–4 శాతం రాబడి పెట్టుబడిని వృద్ధి చేస్తుంటుంది. దీనివల్ల ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెట్టుబడి విలువ క్షీణించకుండా స్థిరంగా ఉంటుంది. ఎస్‌డబ్ల్యూపీ ద్వారా ఏటా ఉపసంహరించుకునే మొత్తంపై పన్ను పడదు. నికర లాభంపై పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఏడాదిలో రూ.1.25 లక్షల దీర్ఘకాల మూలధన లాభంపై పన్ను లేదు. అంతకు మించిన మొత్తంపైనే దీర్ఘకాల మూలధన లాభాల పన్ను పడుతుందని గుర్తు పెట్టుకోవాలి. ఏడాదిలోపు ఈక్విటీ పెట్టుబడులపై 15 శాతం స్వల్పకాల మూలధన లాభం చెల్లించాలి. డెట్ పెట్టుబడులపై లాభం వార్షిక ఆదాయానికి కలుస్తుంది.
ఒకటికి మించిన ఫండ్ విభాగాల్లో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచి నిర్ణయమేనా? – చిట్టి లాస్య
ఒకటికి మించిన మ్యూచువల్ ఫండ్స్ విభాగాల్లో పెట్టుబడులు పెట్టుకున్నప్పటికీ.. నిర్ణీత కాలానికి ఒకసారి పోర్ట్‌ఫోలియోని రీబ్యాలన్స్ (సమీక్ష/మార్పులు, చేర్పులు) చేసుకోవడం మర్చిపోవద్దు. ప్రత్యామ్నాయంగా ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోడాన్ని పరిశీలించొచ్చు. ఎందుకంటే ఈ పథకాలు అన్నిరకాల మార్కెట్ విభాగాల్లోని కంపెనీల్లో (స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్) ఇన్వెస్ట్ చేస్తుంటాయి. మార్కెట్ పరిస్థితులు, వ్యాల్యూయేషన్ల ఆధారంగా ఆయా విభాగాలకు కేటాయించే పెట్టు బడుల మొత్తం మారిపోతుంటుంది.
సాధారణంగా ఫ్లెక్సీక్యాప్ పథకాలు తమ నిర్వహణలోని పెట్టుబడుల్లో 70–75 శాతాన్ని లార్జ్‌క్యాప్ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. మిగిలిన పెట్టుడులను మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ పథకాలకు కేటాయిస్తుంటాయి. మీరు రెండు నుంచి మూడు ఫ్లెక్సీ క్యాప్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఫ్లెక్సీక్యాప్ పథకాలు ఎక్కువ మొత్తాన్ని లార్జ్‌క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. కాబట్టి మీరు విడిగా లార్జ్‌క్యాప్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవాల్సిన అవసరం లేదు. పెట్టుబడులపై అధిక రాబడులు కోరుకుంటూ, రిస్క్ తీసుకునే సామర్థ్యం కలిగిన వారు.. ఫ్లెక్సీక్యాప్‌నకు అదనంగా 10–15 శాతం పెట్టుబడులను మిడ్, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌కు కేటాయించుకోవచ్చు.