
ఐదేళ్ల కుమారుడి భవిష్యత్తు అవసరాల కోసం రూ.లక్ష ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఈ మొత్తాన్ని ఫ్లెక్సీక్యాప్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలా? లేక అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్ ఎంపిక చేసుకోవాలా? ఒక పథకం లేదంటే ఒకటికి మించిన పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా? – మాధవ్.కె
దీర్ఘకాలంలో మీ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఫ్లెక్సీక్యాప్, అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ రెండూ అనుకూలమే. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నది మీ రిస్క్ సామర్థ్యంపైనే ఆధారపడి ఉంటుంది. ఫ్లెక్సీక్యాప్ అన్నది లార్జ్, మిడ్, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడుతుంది. ఎన్నో రంగాలతోపాటు, వివిధ మార్కెట్ విలువలతో కూడిన స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా తమ పెట్టుబడుల్లో మార్పులు చేస్తుంటాయి. మిడ్‌క్యాప్ ఫండ్స్, స్మాల్‌క్యాప్ ఫండ్స్ కంటే ఫ్లెక్సీక్యాప్‌లో స్థిరత్వం ఎక్కువ. కనుక మోస్తరు రిస్క్ తీసుకోగలిగి, దీర్ఘకాలంలో పెట్టుబడులను వృద్ధి చేసుకోవాలని కోరుకుంటే అప్పుడు ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ సహజంగానే వైవిధ్యంతో ఉంటాయి. కనుక ఒక ఫ్లెక్సీక్యాప్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ అన్నవి ఈక్విటీ, డెట్ సాధనాల్లో పెట్టుబడులు పెడుతుంటాయి. కాకపోతే ఈక్విటీలకు ఎక్కువ పెట్టుబడులను కేటాయిస్తాయి. పెట్టుబడుల వృద్ధితోపాటు భద్రతను ఇవి ఆఫర్ చేస్తాయి. ఈక్విటీ మార్కెట్ల పతనాల సమయంలో డెట్ పెట్టుబడులు పోర్ట్‌ఫోలియోకి నష్టాల నుంచి రక్షణనిస్తాయి. ఈక్విటీ పెట్టుబడులు ద్రవ్యోల్బణాన్ని మించి రాబడులను ఇస్తాయి.
ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలని భావిస్తూ, అదే సమయంలో అచ్చమైన ఈక్విటీ ఫండ్స్ మాదిరి ఆటుపోట్లు వద్దనుకుంటే.. అప్పుడు మీకు అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ అనుకూలం. ఒకవేళ మీరు ఇప్పటికే ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తూ, మార్కెట్ ఉద్దాన, పతనాలకు ఆందోళనకు గురికాకుండా ఉండేట్టు అయితే అప్పుడు మీకు అగ్రెస్సివ్ ఈక్విటీ పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి. అలాంటప్పుడు మిడ్‌క్యాప్ లేదా స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీర్ఘకాలంలో అధిక రాబడులకు ఇవి భరోసానిస్తాయి. ముఖ్యంగా 10–15 ఏళ్ల కాలానికి ఇవి మెరుగైన ఎంపిక. సంక్షిప్తంగా.. మోస్తరు రిస్క్‌తో దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేసుకోవాలని అనుకుంటే ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ ఎంపిక చేసుకోండి. స్వల్పకాలంలో మార్కెట్ల పతనాలకు ఆందోళన చెందేట్టు అయితే అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోండి. 10 ఏళ్లు అంతకుమించిన కాలానికి, రిస్క్ తీసుకునేట్టు అయితే మిడ్ లేదా స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రూ.లక్ష మొత్తాన్ని ఒకే విడత కాకుండా.. 6 లేదా 12 వాయిదాల్లో ఇన్వెస్ట్ చేసుకోండి.
నేను ఇల్లు, కారు, క్రెడిట్ కార్డు రుణాల కోసం నెలకు రూ.40,000 ఈఎంఐ కింద చెల్లిస్తున్నాను. వీటిల్లో ముందుగా ఏ రుణం నుంచి బయపడాలి? – భాస్కర్ బాబు
రుణాలన్నవి భవిష్యత్తు ఆదాయాన్ని మింగేస్తాయి. కనుక ఆర్థికంగా కుదేలు చేసే రుణాలను ముందుగా వదిలించుకోవాలి. ముందుగా క్రెడిట్ కార్డు రుణాన్ని తీర్చడంతో ప్రారంభించండి. అధిక వడ్డీ రేటుతో ఖరీదైన రుణాలు ఇవి. కనుక వేగంగా తీర్చేయడంపై దృష్టి పెట్టండి. అవసరమైతే పార్ట్ టైమ్ ఉద్యోగం చేయడం లేదంటే పెట్టుబడులను స్వల్పకాలం పాటు నిలిపివేసి క్రెడిట్ కార్డు బకాయి తీర్చేయండి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే తీసుకోతగినవి ఇవి. ఎక్కువ కాలం పాటు కొనసాగిస్తే ఆర్థిక పరిస్థితులపై ప్రభావం పడుతుంది. క్రెడిట్ కార్డు రుణం తర్వాత కారు రుణం తీర్చేయండి. ఎందుకంటే వాహనం విలువ క్షీణిస్తుంటుంది. కనుక వీలైనంత ముందుగా ముగించండి. దీర్ఘకాలంలో విలువను సమకూర్చే ఆస్తి కనుక ఇంటిపై రుణాన్ని కొనసాగించుకోవచ్చు. తక్కువ రేటుతో, పన్ను ప్రయోజనం ఇందులో ఉంటుంది.

ఇదీ చదవండి: డబ్బు అడగొద్దు.. సలహా అడగండి!