
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో నాకు రూ.1.25 లక్షలకు పైగా దీర్ఘకాల మూలధన లాభం (ఎల్‌టీసీజీ) వచ్చింది. అదే సమయంలో స్వల్పకాల మూలధన నష్టం కూడా ఎదురైంది. ఈ నష్టాన్ని సర్దుబాటు చేసుకుని తక్కువ పన్ను చెల్లించడం సాధ్యపడుతుందా? – సత్యనారాయణ గొట్టిపాటి
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో దీర్ఘకాల మూలధన లాభం వచ్చినట్లయితే.. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.25 లక్షలకు మించిన మొత్తంపై 12.5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈక్విటీ పెట్టుబడులపై స్వల్పకాల మూలధన నష్టం (ఏడాదిలోపు విక్రయించినప్పుడు వచ్చే మొత్తం/ఎస్‌టీసీఎల్)) ఎదురైతే.. అప్పుడు ఎల్‌టీసీజీ నుంచి ఎస్‌టీసీఎల్‌ను మినహాయించుకోవచ్చు. దీనివల్ల నికరంగా చెల్లించాల్సిన పన్ను భారం తగ్గిపోతుంది. ఈక్విటీ పెట్టుబడిని కొనుగోలు చేసిన తేదీ నుంచి ఏడాది నిండిన తర్వాత విక్రయించనప్పుడు వచ్చే లాభం/నష్టాన్ని దీర్ఘకాలంగా, ఏడాది నిండకుండా విక్రయించినప్పుడు వచ్చే మొత్తాన్ని స్వల్పకాల మూలధన లాభం/నష్టం కింద పరిగణిస్తారు.
ఉదాహరణకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.2 లక్షల దీర్ఘకాల లాభం వచ్చిందని అనుకుందాం. రూ.1.25 లక్షల వరకు పన్ను లేదు. అప్పుడు మిగిలిన రూ.75,000పై 12.5 శాతం చొప్పున రూ.9,375 పన్ను చెల్లించాలి. ఒకవేళ అదే ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 స్వల్పకాల నష్టం వచ్చిందనుకోండి. నికర దీర్ఘకాల లాభం రూ.75వేలలో ఈ మొత్తాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు. అప్పుడు నికర దీర్ఘకాల మూలధన లాభం రూ.25,000కు తగ్గుతుంది. దీనిపై 12.5 శాతం రేటు ప్రకారం రూ.3,125 పన్ను చెల్లిస్తే సరిపోతుంది.
ఒకవేళ ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుబడులపై వచ్చిన నష్టం దీర్ఘకాలానికి సంబంధించి అయితే.. అప్పుడు దీర్ఘకాల మూలధన లాభంతోనే సర్దుబాటు చేసుకోగలరు. అదే స్వల్పకాల మూలధన నష్టాన్ని స్వల్పకాల మూలధన లాభం, దీర్ఘకాల మూలధన లాభంతోనూ సర్దుబాటు చేసుకోవచ్చు. ఒకవేళ స్వల్పకాల నష్టం అన్నది స్వల్పకాల లాభం/దీర్ఘకాల మూలధన లాభం మించి ఉంటే.. అప్పుడు సర్దుబాటు చేసుకోగా మిగిలిన నికర నష్టాన్ని ఎనిమిది ఆర్థిక సంవత్సరాల పాటు క్యారీ ఫార్వార్డ్ (భవిష్యత్తు లాభాల్లో సర్దుబాటు) చేసుకోవచ్చు.
ఇదీ చదవండి: మధ్యతరగతి వారికి వారెన్ బఫెట్ ఆర్థిక సలహా
మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తున్నాను. నాకు ఇంటి లోన్ ఉంది. మరో 5 ఏళ్లకు పూర్తవుతుంది. గ్రాట్యుటీ రూపంలో వచ్చే మొత్తంతో గృహ రుణాన్ని ముందుగానే తీర్చివేయాలా లేక మెరుగైన రాబడి వచ్చే చోట ఇన్వెస్ట్ చేసుకోవాలా? – జ్యోతిర్మయి
గృహ రుణాన్ని కొనసాగించుకోవచ్చు. గృహ రుణం కాకుండా ఇతర రుణాలు ఉంటే, పెట్టుబడుల కంటే ముందు వాటిని తీర్చేయడం మంచి నిర్ణయం అవుతుంది. గృహ రుణం కొనసాగించడం వల్ల నష్టం లేదనడానికి పలు కారణాలు ఉన్నాయి. అద్దె రూపంలో కొంత ఆదా చేస్తుంటారు. రుణంపై వడ్డీ చెల్లింపులకు పన్ను ప్రయోజనం ఉంది. పైగా చాలా తక్కువ రేటుకు వచ్చే రుణం ఇది. ఈ రుణం రేటుతో పోలిస్తే దీర్ఘకాలంలో పెట్టుబడులపై అధిక రాబడులు వస్తాయి. కనుక గృహ రుణం లాభదాయకమే. ఒకవేళ గృహ రుణాన్ని పూర్తిగా తీర్చివేయడం ద్వారా నిశ్చింతగా ఉండొచ్చని భావిస్తే లేదా భవిష్యత్తు ఆదాయం విషయంలో అనిశ్చితిగా ఉంటే అలాగే ముందుకెళ్లొచ్చు. గ్రాట్యుటీ ద్వారా వచ్చే మొత్తంతో ఆ పనిచేయవచ్చు.
