
నల్సా ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ జస్టిస్ సూర్యకాంత్
‘నల్సా వీర్ పరివార్ సహాయతా యోజన 2025’ ప్రారంభం
భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా సైనికుల కుటుంబాలకు న్యాయసహాయం అందించనున్నారు. ‘నల్సా వీర్ పరివార్ సహాయతా యోజన 2025’ పేరుతో ఈ కొత్త కార్యక్రమం ద్వారా భారతీయ సైనికులకు సాయం చేయనున్నారు. సొంత ఊళ్లకు దూరంగా దేశం కోసం సేవలందిస్తున్న సైనికులు, తమ కుటుంబ సభ్యులు కొన్నిసార్లు స్థానికంగా న్యాయపరమైన వివాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దాంతో దేశం కోసం సుదూర ప్రాంతాల్లో పోరాడుతున్న సైనికులు స్వగ్రామాలకు రావడం కష్టంగా మారుతుంది. అలాంటివారికి, తమ కుటుంబ సభ్యులకు న్యాయసేవ అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ జస్టిస్ సూర్యకాంత్ శ్రీనగర్‌లో జరిగిన కార్గిల్ విజయ్ దివాస్ సదస్సులో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈమేరకు నిర్ణయం తీసుకోవడం సైనికులకు ఎంతో వెసులుబాటు కల్పిస్తుందని నమ్ముతున్నారు. ఈ ఆపరేషన్ సమయంలో సాయుధ దళాలు చేసిన త్యాగాలను చూసి తీవ్రంగా చలించిపోయానని జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. న్యాయవ్యవస్థ వారి శ్రేయస్సుకు మరింత ప్రత్యక్షంగా దోహదపడే మార్గాలను అన్వేషిస్తుందన్నారు. అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్లు చెప్పారు.
ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ప్లాట్ల అమ్మకాలకు అంతా సిద్ధం..
ఈ కార్యక్రమం ఉద్దేశం..
సైనికులు విధుల్లో ఉన్నప్పుడు అపరిష్కృత ఆస్తి వివాదాలు, కుటుంబ కలహాలు, భూ సమస్యలు, ఇతర చట్టపరమైన విషయాల నుంచి ఉపశమనం కలిగించేలా న్యాయసేవ అందిస్తారు.
సైనికులు వృత్తిపరమైన కారణాలతో కోర్టుకు హాజరు కాలేకపోయినా, కోర్టులో కుటుంబాలకు ప్రాతినిధ్యం వహించడానికి నల్సా రంగంలోకి దిగుతుంది.
ఇండియన్ ఆర్మీ, బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, ఇతర పారామిలటరీ బలగాలు దీని పరిధిలోకి వస్తారు.
ప్యానెల్ లాయర్లు, పారాలీగల్ వాలంటీర్లకు సులభంగా అందుబాటులో ఉండేలా రాష్ట్రాల్లోని సైనిక్ వెల్ఫేర్ బోర్డులను ఏర్పాటు చేస్తారు.
కేసు పురోగతిని పర్యవేక్షించడానికి, సకాలంలో పరిష్కారాన్ని నిర్ధారించడానికి వీరు తోడ్పాటు అందిస్తారు.