
‘రియల్ ఎస్టేట్’ బాగానే ఉన్నా విక్రయాలకు వెనుకంజ
సర్కార్ పిలుపు కోసం ఎదురుచూపులు
లే అవుట్‌లు సిద్ధం చేసిన హెచ్‌ఎండీఏ
హెచ్‌ఎండీఏ లే అవుట్‌ల్లో స్థలాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ సర్కార్ నుంచి అనుమతి లభించకపోవడంతో అధికారులు వెనుకంజ వేస్తున్నారు. ఆరు నెలల క్రితమే భూముల విక్రయం ద్వారా ఆదాయాన్ని ఆర్జించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆన్‌లైన్ బిడ్డింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కానీ అప్పట్లో రియల్‌ఎస్టేట్ రంగంలో స్తబ్దత నెలకొనడం వల్ల విరమించుకున్నారు. కొద్ది రోజులుగా ‘రియల్’ రంగంలో సానుకూల వాతావరణం నెలకొంది. ఇటీవల హౌసింగ్‌బోర్డు స్థలాల అమ్మకాలకు సముచితమైన స్పందన లభించింది. మరోవైపు నగర శివార్లలోని వివిధ ప్రాంతాల్లో నిర్మాణరంగం ఊపందుకుంటోంది. ఈ క్రమంలో హెచ్‌ఎండీఏ భూములకు సైతం డిమాండ్ బాగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
కొనుగోలుదారుల ఆసక్తి..
ప్రైవేట్ వెంచర్‌ల కంటే హెచ్‌ఎండీఏ లే అవుట్‌లలో కొనుగోలు చేసేందుకే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. రోడ్లు, పారిశుద్ధ్య, మంచినీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా కల్పించడం, ఎలాంటి వివాదాలు లేని స్థలాలు కావడంతో సామాన్య, మధ్యతరగతి వర్గాలు మొదలుకుని సంపన్నులు, బిల్డర్‌లు, రియల్టర్లు తదితర అన్ని వర్గాలకు చెందిన వాళ్లు కూడా హెచ్‌ఎండీఏ భూములను, స్థలాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారు. గతంలో వివిధ ప్రాంతాల్లో హెచ్‌ఎండీఏ విక్రయించిన స్థలాలకు భారీ ఎత్తున స్పందన లభించడమే ఇందుకు నిదర్శనం.
కాలయాపన ఎందుకు..
ప్రస్తుతం పలు ప్రాంతాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇన్ముల్‌నెర్వా, లేమూరు, కుర్మల్‌గూడ, తొర్రూరు, ప్రతాప్‌సింగారం తదితర ప్రాంతాల్లో స్థలాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. కొన్ని చోట్ల హెచ్‌ఎండీఏ సొంత స్థలాల్లో లేఅవుట్‌లను అభివృద్ధి చేయగా, ప్రతాప్‌సింగారం, మేడిపల్లి తదితర ప్రాంతాల్లో రైతుల నుంచి సేకరించిన భూములను అభివృద్ధి చేశారు. ఈ వెంచర్‌లలో రైతులకు 60 శాతం ప్లాట్‌లు కేటాయించగా చెందిన మిగతా 40 శాతం స్థలాల్లో ఆన్‌లైన్ బిడ్డింగ్ ద్వారా స్థలాలను విక్రయించవచ్చు. ‘ప్రస్తుతం అన్ని విధాలుగా సానుకూలంగా ఉంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొంటేనే కొనుగోలుదార్ల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లభిస్తుంది’ అని హెచ్‌ఎండీఏ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.
బుద్వేల్, మోకిల వంటి చోట్ల గతంలో హెచ్‌ఎండీఏ స్థలాలకు భారీ స్పందన లభించింది. ప్రస్తుతం అక్కడ ఇంకా కొన్ని స్థలాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. కోకాపేట్‌లో ఎకరం రూ.వంద కోట్లకు అమ్ముడైంది. బుద్వేల్‌లోనూ భారీ ఆదాయం లభించింది. వివిధ ప్రాంతాల్లో ఎన్నారైలు పెద్ద ఎత్తున పోటీపడ్డారు. సొంతింటి కలను సాకారం చేసుకోవాలని ఆశించే మధ్యతరగతి వర్గాలు సైతం హెచ్‌ఎండీఏ స్థలాలను కొనుగోలు చేశాయి.
ఇదీ చదవండి: ‘జీఎస్‌టీ అమల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి’
కాసులుంటేనే పరుగులు..
సికింద్రాబాద్ నుంచి డెయిరీఫాం, శామీర్‌పేట్ మార్గాల్లో ఎలివేటెడ్ కారిడార్‌లతో పాటు ఔటర్‌రింగ్‌రోడ్డు నుంచి రీజినల్ రింగ్‌రోడ్డు వరకు గ్రీన్‌ఫీల్డ్ రోడ్ల నిర్మాణానికి హెచ్‌ఎండీఏ కార్యాచరణ చేపట్టింది. డెయిరీఫాం ఎలివేటెడ్‌కు, గ్రీన్‌ఫీల్డ్ రోడ్లకు టెండర్‌లు కూడా ఖరారయ్యాయి. దీంతో నిధుల కేటాయింపు హెచ్‌ఎండీఏకు ఒక సవాల్‌గా మారింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న భూములను, ప్లాట్‌లను విక్రయించడం వల్ల కనీసం రూ.5000 కోట్ల వరకు ఆర్జించే అవకాశం ఉంది.
