పలుచబడిన ఐపీఎల్‌ మార్కెట్‌! కారణాలివే.. | Harsh Goenka Explains Why IPL Valuation Dropped to ₹76,100 Cr In 2025, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

పలుచబడిన ఐపీఎల్‌ మార్కెట్‌! కారణాలివే..

Oct 18 2025 9:42 AM | Updated on Oct 18 2025 12:21 PM

Why IPL valuation dropped again in 2025  Harsh Goenka tweet viral

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మార్కెట్‌ విలువ 2025లో గణనీయంగా పడిపోవడానికి దారితీసిన అంశాలను ఆర్‌పీజీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో విశ్లేషించారు. ఐపీఎల్ విలువ గతేడాది రూ.92,500 కోట్ల నుంచి 2025లో రూ.76,100 కోట్లకు పడిపోవడం వెనుక ఉన్న ప్రధాన కారణాలను తెలియజేస్తూ అవి మార్కెట్, ప్రకటనలు, చట్టపరమైన మార్పులు, క్రికెట్ మార్కెట్‌పై చూపిన ప్రభావాన్ని అంచనా వేశారు.

మీడియా హక్కులపై ఏకఛత్రాధిపత్యం

డిస్నీ స్టార్, వయాకామ్ 18 విలీనం కావడం ద్వారా మార్కెట్‌లో ఒకే పెద్ద బ్రాడ్‌కాస్టర్ (జియోస్టార్)కు అవకాశం ఏర్పడింది. గతంలో మీడియా హక్కుల కోసం పెద్ద సంస్థల మధ్య తీవ్రమైన పోటీ (బిడ్డింగ్ వార్) ఉండేది. దీని వల్ల మీడియా హక్కులను చేజిక్కించుకునేందుకు మరింత డబ్బు వెచ్చించేవారు. డిస్నీ స్టార్, వయాకామ్ 18 విలీనంతో ప్రధాన బ్రాడ్‌కాస్టర్‌గా ఏర్పడినప్పుడు పోటీ లేకపోవడం వల్ల ఐపీఎల్ (IPL) మీడియా హక్కుల కోసం చెల్లించే ధరలు తగ్గిపోయాయి. ఇది ఐపీఎల్ (IPL) మొత్తం విలువపై తీవ్ర ప్రభావం చూపింది.

ఫాంటసీ, గేమింగ్ ప్రకటనలపై నిషేధం

కొత్త ఆన్‌లైన్ గేమింగ్ చట్టం కింద ఫాంటసీ స్పోర్ట్స్, ఇతర గేమింగ్ కార్యకలాపాలకు సంబంధించిన ప్రకటనలపై నిషేధం లేదా కఠినమైన నిబంధనలు విధించారు. ఐపీఎల్ (IPL) ప్రసారాలకు ఫాంటసీ గేమింగ్ సంస్థలు ఒకప్పుడు అతిపెద్ద ప్రకటనదారులుగా ఉండేవి. కొత్త నిబంధనలతో ఈ వర్గాన్ని కోల్పోవడం లేదా వారి ప్రకటన బడ్జెట్ తగ్గడం వల్ల లీగ్ (League) ప్రకటనల ఆదాయంపై భారీగా దెబ్బతింది.

ఆర్థిక అనిశ్చితి

ప్రపంచవ్యాప్తంగా, దేశీయంగా ఆర్థిక మందగమనం, అనిశ్చితి నెలకొన్నప్పుడు కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకుంటున్నాయి. ఆర్థిక పరిస్థితుల కారణంగా కంపెనీలు తమ ప్రకటనల బడ్జెట్‌లను పరిమితం చేశాయి. ముఖ్యంగా బ్రాండ్ (Brand) ప్రచారం కోసం చేసే ఖర్చు తగ్గింది.

ఫ్రాంచైజీల లాభాలపై ఒత్తిడి

ఏటా ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి, వారి జీతాల కోసం అయ్యే ఖర్చు (సాలరీ క్యాప్) పెరుగుతూ వస్తోంది. మరోవైపు ప్రధాన స్పాన్సర్‌షిప్ ఒప్పందాల విలువ అనుకున్నంత వేగంగా పెరగడం లేదు. అధిక ఖర్చులు, స్తబ్దుగా ఉన్న వీటి ఆదాయాల కారణంగా లాభాలు తగ్గుతున్నాయి.

గ్లోబల్ క్రికెట్

ప్రపంచ క్రికెట్ మార్కెట్‌లో అనేక కొత్త లీగ్‌లు పుట్టుకొస్తున్నాయి. ఇది ప్రేక్షకులను ఐపీఎల్‌ నుంచి కాస్త దూరంగా ఉంచుతుంది. ఆస్ట్రేలియాలోని బిగ్ బాష్ లీగ్ (BBL), కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL), సౌతాఫ్రికా టీ20, యూఏఈ (UAE) లీగ్ వంటి అనేక అంతర్జాతీయ లీగ్‌లు ఉన్నాయి.

ఇదీ చదవండి: అమెరికా అణ్వాయుధ సిబ్బందికి లేఆఫ్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement