ULIP Investment
-
మిస్ సెల్లింగ్.. బుట్టలో పడకూడదంటే..?
ఇటీవలే పదవీ విరమణ చేసిన ప్రకాష్ (60)కు వివిధ ప్రయోజనాల రూపంలో రూ.40 లక్షలు సమకూరాయి. వీటిని బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి (ఎఫ్డీ) దానిపై ప్రతి నెలా ఆదాయం తీసుకోవాలని భావించాడు. సీనియర్ సిటిజన్స్‌కు అర శాతం అదనపు రేటు కూడా అతన్ని ఆకర్షించింది. తీరా బ్యాంక్‌కు వెళ్లిన తర్వాత అక్కడి రిలేషన్ షిప్ మేనేజర్ (ఆర్ఎం) సూచనలతో మరింత రాబడి కోసం ‘స్పెషల్ ఎఫ్డీ’లో ఇన్వెస్ట్ చేశాడు.అది కాస్తా యులిప్ ప్లాన్ అని తర్వాత తెలియడంతో ఎవరికి చెప్పుకోలేక లోలోపలే ఆవేదన చెందాడు. గత రాబడుల గురించి గొప్పగా చెప్పడంతో ఆర్ఎం మాటలతో బోల్తా పడ్డాడు. 55 ఏళ్ల నారాయణ మూర్తి చిన్న కిరాణా దుకాణం నడుపుతున్నాడు. ఒక్కతే కుమార్తె. ఉన్నత విద్య కోసం అమెరికాకు పంపాడు. ఇటీవలే ఊళ్లో భూమిని విక్రయించగా రూ.20 లక్షలు చేతికి వచ్చింది. ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దామని బ్యాంక్‌కు వెళ్లాడు. అక్కడి మేనేజర్ ఎఫ్డీ కంటే మంచి రాబడి వస్తుందంటూ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఆ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయించాడు. మనలో చాలా మందికి ఇలాంటి అనుభవాలు ఎదురుకావొచ్చు. అవగాహనతోనే ఇలాంటి వాటికి చెక్ పెట్టడం సాధ్యపడుతుంది. తిరుచ్చిరాపల్లికి చెందిన నారాయణస్వామి దంపతులకూ ఇలాంటి అనుభవమే ఎదురైంది. గడువు తీరిన ఎఫ్డీని రెన్యువల్ చేద్దామని బ్యాంక్‌కు వెళ్లగా.. దానికి బదులు యులిప్ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలన్న సూచన బ్యాంక్ నుంచి వచ్చింది. దీంతో వారు ఫైనాన్షియల్ అడ్వైజర్ (ఆర్థిక సేవల సలహాదారు)ను సంప్రదించారు. యులిప్ ప్లాన్‌లో పెట్టుబడులకు దూరంగా ఉండాలన్న సూచనతో ఎఫ్డీ రెన్యువల్‌కే మొగ్గు చూపించారు. బీమా పాలసీలు, మ్యూచువల్ ఫండ్స్, ఇతర పెట్టుబడి సాధనాలను తప్పుడు మార్గాల్లో విక్రయించడం ఇటీవలి కాలంలో ఎక్కువగా కనిపిస్తోంది. దీన్నే మిస్ సెల్లింగ్‌గా చెబుతున్నారు. బ్యాంక్‌లు, మ్యూచువల్ ఫండ్స్ పంపిణీదారులు, బీమా ఏజెంట్ల బుట్టలో పడకుండా ఉండాలంటే కావాల్సింది అవగాహన, స్వీయ జాగ్రత్తలే. ఇలాంటి సందర్భాల్లో కార్యాచరణ ఎలా ఉండాలన్నది చూద్దాం. 2023 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరం ఐఆర్డీఏఐ గణాంకాల ప్రకారం బీమా కంపెనీలకు వ్యతిరేకంగా 1,27,378 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో 50 శాతం జీవిత బీమా కంపెనీలు మిస్ సెల్లింగ్ విధానాలకు వ్యతిరేకంగా దాఖలైనవే ఉన్నాయి. బ్యాంకింగ్ ఉత్పత్తుల కంటే మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ ఉత్పత్తులకు సంబంధించి తప్పుదోవ పట్టించి విక్రయించడం అతిపెద్ద సమస్యగా ఉన్నట్టు గ్రాంట్ థార్న్టన్ పార్ట్నర్ వివేక్ అయ్యర్ తెలిపారు. ‘‘బ్యాంకుల ఉత్పత్తులు సులభంగా, సరళంగా ఉంటాయి. అదే మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ అన్నవి మార్కెట్ రిస్క్‌లు, షరతులతో ముడిపడి ఉంటాయి. కొన్ని సందర్భాల్లో నిపుణులకు సైతం వీటి గురించి చెప్పడం కష్టంగానే ఉంటుంది’’ అని వివరించారు. బ్యాంకుల ద్వారా ఎక్కువ మిస్ సెల్లింగ్ అవుతున్నది బీమా ఉత్పత్తులేనని ఆర్థిక సర్వే 2024 సైతం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా యస్ బ్యాంక్ ఉదాహరణ గురించి కూడా చెప్పుకోవాలి. లోగడ యస్ బ్యాంక్ సిబ్బంది ఎఫ్‌డీల పేరుతో ఏటీ–1 బాండ్లను కస్టమర్లకు విక్రయించారు. నిజానికి అవి పర్పెచ్యువల్ బాండ్లు. ఈ విషయం తమకు చెప్పనేలేదని కస్టమర్లు ఆరోపించడం గమనార్హం. ఏటీ–1 బాండ్లకు మెచ్యూరిటీ ఉండదు. నిర్ణీత కాలానికోసారి వడ్డీ చెల్లింపులు చేస్తారు. ఎఫ్‌డీల కంటే వీటిపై అధిక రేటు ఉంటుంది. బ్యాంక్ నష్టపోతే వీటికి ఎలాంటి చెల్లింపులు చేయరు. వాటిని రద్దు చేయొచ్చు కూడా. 2020లో యస్ బ్యాంక్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడు రూ.8,400 కోట్ల ఏటీ–1 బాండ్లను రద్దు చేసింది.మార్కెటింగ్ లక్ష్యాలు.. → బీమా ఉత్పత్తులను ఎఫ్‌డీల కంటే అధిక రాబడులను ఇచ్చే సాధనాలుగా బ్యాంక్ ఆర్ఎంలు విక్రయిస్తుండడం తరచుగా కనిపిస్తోంది. కొన్ని సందర్భాల్లో మూడు నుంచి ఐదేళ్ల కాలం కోసం ఉద్దేశించిన పెట్టుబడి సాధనాలుగా వాటిని బ్యాంక్ సిబ్బంది విక్రయిస్తున్నట్టు డెలాయిట్ ఇండియా ఇన్సూరెన్స్ సెక్టార్ లీడర్ దేవాశిష్ బెనర్జీ తెలిపారు. → బ్యాంక్ రుణం మంజూరునకు, లాకర్ల సదుపాయం తెరవాలంటే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం తప్పనిసరి అని కొన్ని బ్యాంకులు షరతు పెడుతున్నాయి. → యూనిట్ లింక్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు (యులిప్‌లు), డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్లు (ఇన్వెస్ట్ చేసిన కొంత కాలం తర్వాత నుంచి దానిపై ఆదాయం చెల్లించేవి), గ్యారంటీడ్ ఇన్కమ్ ప్లాన్లు సైతం తçప్పుడు మార్గాల్లో విక్రయిస్తున్నారు. → రిస్క్ అంతగా తీసుకునే సామర్థ్యం లేని సంప్రదాయ ఇన్వెస్టర్లకు అధిక రిస్క్ మ్యూచువల్ ఫండ్స్ పథకాలను విక్రయిస్తున్నారు. → పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సరీ్వసెస్ (పీఎంఎస్), ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్‌లు)ను తరచుగా మ్యూచువల్ ఫండ్స్ కంటే మెరుగైనవంటూ మార్కెటింగ్ చేస్తున్నారు. → కొన్ని సందర్భాల్లో అవసరం లేకపోయినా కస్టమర్లతో రుణాలు తీసుకునేలా ప్రోత్సహిస్తున్నారు. ఎఫ్డీ ప్రారంభిస్తే తక్కువ రేటుపై పర్సనల్ లోన్ ఇస్తామంటూ కొన్ని సందర్భాల్లో బ్యాంక్ సిబ్బంది కస్టమర్లను కోరుతున్నారు. తమకు విధించిన లక్ష్యాలను చేరుకునేందుకు వీలుగా బ్యాంక్ సిబ్బంది ఇలాంటి ఉత్పత్తులను ఏదో ఒక రకంగా కస్టమర్లతో కొనిపించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. → 1 ఫైనాన్స్ మ్యాగజైన్’ 2024 అక్టోబర్ సర్వే నివేదిక ప్రకారం.. లక్ష్యాలను చేరుకోకపోతే ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుందన్న భయంతో బ్యాంక్ ఆర్ఎంలలో 57 శాతం మంది ఆర్థిక ఉత్పత్తులను తప్పుడు మార్గాల్లో విక్రయిస్తున్నట్టు చెప్పారు.అవగాహనతోనే నివారణ ఏ ఉత్పత్తిని అయినా కొనుగోలు చేసే ముందు పూర్తి పరిశీలన అవసరం. దాని గురించి సమగ్రంగా తెలుసుకుని, అవగాహన ఏర్పడిన తర్వాతే కొనుగోలుపై నిర్ణయం తీసుకోవాలి. బ్యాంక్‌లు విక్రయిస్తున్నవన్నీ తప్పుదోవపట్టించి అంటగట్టేవిగా చూడడం సరికాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికీ జీవిత, ఆరోగ్య బీమా అవసరం. ఇప్పుడు చాలా బ్యాంక్‌లు గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజీని, గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీని నాన్ గ్రూప్‌తో పోలి్చతే తక్కువ ప్రీమియానికే ఆఫర్ చేస్తున్నాయి. కనుక బ్యాంక్‌ల్లో అందుబాటులో ఉండే ఉత్పత్తుల్లో కొన్ని ప్రయోజనకరమైనవీ ఉంటాయన్నది మర్చిపోవద్దు. ముఖ్యంగా అధిక రాబడుల కాంక్షతో పెట్టుబడి సాధనాలను కొనుగోలు చేయడం సరికాదు. ఇంటర్నెట్లో సంబంధిత ఉత్పత్తి గురించి శోధిస్తే సమగ్ర సమాచారం చిటికెలో లభిస్తుంది. ‘‘ఏజెంట్‌ను గుడ్డిగా నమ్మకుండా కస్టమర్లు తమ పరిశోధన తర్వాత సహేతుక నిర్ణయాలు తీసుకోవాలి. ప్రతి రోజూ ఎన్నో కొత్త ఉత్పత్తులు వస్తుండడంతో బ్యాంక్ ఆర్ఎంలపై లక్ష్యాల భారం పడుతోంది. ఈ ఒత్తిడితో ఆయా సాధనాల గురించి కస్టమర్లకు వివరంగా చెప్పకుండానే తప్పుడు మార్గాల్లో విక్రయించాల్సిన పరిస్థితి నెలకొంది’’ అని గ్రాంట్ థార్న్టన్ పార్ట్నర్ వివేక్ అయ్యర్ తెలిపారు.మోసపోతే ఏం చేయాలి? → ఇప్పటికే బ్యాంక్ నుంచి ఏదైనా ఉత్పత్తిని కొనుగోలు చేసి, అది తమ అవసరాలను సరిపడదని గుర్తిస్తే దీనిపై చర్యలు చేపట్టొచ్చు. బ్యాంక్ కస్టమర్ సేవల విభాగం లేదా ఆర్ఎం వద్ద ఫిర్యాదు దాఖలు చేయాలి. ఫలితం రాకపోతే అదే బ్యాంక్‌లో ఫిర్యాదుల పరిష్కార విభాగం దృష్టికి తీసుకెళ్లాలి. → బ్యాంక్ స్థాయిలో సమస్య పరిష్కారం కాకపోతే లేదా సంతృప్తికరమైన ఫలితం రాకపోతే అప్పుడు బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. ‘‘సంబంధిత లావాదేవీని రద్దు చేయాలని అంబుడ్స్‌మన్ ఆదేశించగలదు. లేదా పరిహారం ఇప్పిస్తుంది. లేదా దిద్దుబాటు చర్యలకు ఆదేశిస్తుంది. ఇదొక సమర్థవంతమైన పరిష్కార యంత్రాంగం. దీనికి న్యాయపరమైన ప్రతినిధి అవసరం లేదు’’అని ఢిల్లీకి చెందిన న్యాయవాది నిషాంత్ దత్తా సూచించారు. → బ్యాంక్, అంబుడ్స్‌మన్ స్థాయిల్లో పరిష్కారం రాకపోతే అప్పుడు వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార కమిషన్ (వినినయోగదారుల ఫోరమ్) వద్ద కేసు దాఖలు చేయాలి. → చివరిగా కోర్టును ఆశ్రయించడం ద్వారా న్యాయం కోసం ప్రయత్నించొచ్చు. గతంలో పలు హైకోర్టులు, సుప్రీంకోర్టుల వరకు ఇలాంటి మిస్ సెల్లింగ్ కేసులు వెళ్లాయి. ఆ సమయంలో కోర్టులు సైతం కఠినంగా స్పందించాయి. → వీరేంద్ర పాల్ కపూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (2014) కేసులో.. రాబడులపై తప్పుడు సమాచారంతో పాలసీని విక్రయించిన బీమా సంస్థ అందుకు పూర్తి బాధ్యత వహించాలని ఆదేశించింది. బ్యాంక్ సిబ్బంది చర్యలకు బ్యాంకులే బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు సైతం 2013లో ఓ కేసు సందర్భంగా స్పష్టం చేసింది. → మ్యూచువల్ ఫండ్స్ పంపిణీదారులు లేదా ఏజెంట్లు ఉత్పత్తులను తప్పుగా అంటగడితే సెబీ వద్ద ఫిర్యాదు దాఖలు చేయాలి. → బీమా ఏజెంట్ల కారణంగా తమకు అనుకూలం కాని ఉత్పత్తులను కొనుగోలు చేసినట్టయితే బీమా అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించాలి. ప్రయోజనాలు.. రిస్క్ లు చూడాలి... బ్యాంక్ ఆఫర్ చేస్తున్నఉత్పత్తిలోని ప్రయోజనాలు, రిస్క్‌లు, అవి తమకు ఏ మేరకు అనుకూలమన్నది ప్రశి్నంచాలి. అర్థవంతమైన వివరణ అనంతరం సరైన నిర్ణయం తీసుకోవాలి. రుణం మంజూరు కావాలంటే దానికి అనుబంధంగా టర్మ్ ప్లాన్ తీసుకోవాలని కోరొచ్చు. అవసరం లేకపోతే అదే విషయం తేలి్చచెప్పండి. తమకు అప్పటికే లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజీ లేకపోతే కొనుగోలును పరిశీలించొచ్చు. సంతకాలు చేసే ముందు ఆయా పత్రాలను వివరంగా చదివి అర్థం చేసుకోవాలి. గ్యారంటీడ్ (హామీతో కూడిన) రాబడుల పేరుతో ఏదైనా ఉత్పత్తిని విక్రయించే ప్రయత్నం చేస్తుంటే.. అది డెట్ సాధనమే అయి ఉండాలి. అధిక రాబడులు వస్తాయంటుంటే అది ఈక్విటీ సాధనమైనా అయి ఉండొచ్చు. గత రాబడులు భవిష్యత్ పనితీరుకు హామీ కాదు. ఉత్పత్తి ఏదైనా సరే తమ అవసరాలకు సరితూగే విధంగా ఉండాలి. ఉదాహరణకు 60 ఏళ్లు నిండిన వారికి జీవిత బీమా కవరేజీ అవసరం ఉండదు. కనుక వారు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. యులిప్‌లు అయినా, ఈక్విటీలు అయినా అధిక రిస్క్‌తో కూడినవి. వృద్ధాప్యంలో మెజారిటీ మొత్తం సురక్షిత సాధనాల్లోనే ఉండాలన్న విషయాన్ని మర్చిపోకూడదు. సెబీ, యాంఫి, ఆర్బీఐ, ఐఆర్డీఏఐ ఇప్పటికే తమ నియంత్రణల పరిధిలో సంస్థలకు ఈ విషయమై ఆదేశాలు జారీ చేశాయి. → మీ అవసరాలను, ఆర్థిక లక్ష్యాలను ముందుగా తేల్చుకోవాలి. ఆ తర్వాత అందుకు అనుకూలమైన సాధనాన్ని ఎంపిక చేసుకోవాలి. → పెట్టుబడుల పత్రాలను సమగ్రంగా చదివి, సందేహాలను తీర్చుకున్న తర్వాతే ముందుకు వెళ్లాలి. → రిస్క్ తీసుకోలేని వారు అధిక రాబడులను ఆశించడం సరికాదు. అధిక రాబడులను ఇచ్చే సాధనాల్లో ఎలాంటి హామీ ఉండదు. → పెట్టుబడులు, రక్షణ కలసిన ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. ఈ రెండింటినీ వేర్వేరుగా తీసుకోవాలి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
చిన్నారి బీమా...ధీమానిస్తుందా?
పిల్లల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నవి చైల్డ్ ప్లాన్లు. అయితే, వీటి గురించి పూర్తిగా తెలిసినది అతి తక్కువ మందికే. బీమా ఏజెంట్లు చైల్డ్ ప్లాన్ల గురించి ఆకర్షణీయమైన అంశాలు... ఆకర్షణీయ రాబడుల గణాంకాలను చూపించినప్పుడు ఇన్వెస్ట్ చేయాలన్న ఆసక్తి ఏర్పడవచ్చు. అంతేకాదు, కొందరు వెంటనే ఇన్వెస్ట్మెంట్ కూడా ప్రారంభిస్తారు. ‘దిగితేకానీ లోతు ఎంతో తెలియదు’ అన్న చందంగా ఈ ప్లాన్లను అభివర్ణించాల్సి ఉంటుంది. ‘నీ ముక్కు ఏది?’ అని ప్రశ్నిస్తే తలచుట్టూ వేలిని తిప్పి చూపించినట్టుగా చైల్డ్ ప్లాన్లను పేర్కొనక తప్పదు. ప్రీమియం భారం... చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు, ఇన్వెస్ట్‌మెంట్‌తో కలసి ఉంటాయి. వీటిని ఎండోమెంట్ పాలసీలుగానే చూడాల్సి ఉంటుంది. వీటిల్లో పాలసీదారులకు ఎంతొస్తుందన్నది పక్కన పెడితే.. పాలసీ చేయించిన ఏజెంట్‌కు మాత్రం మంచి కమీషన్ ముడుతుంది. ముఖ్యంగా ఈ పాలసీల్లో ఇన్వెస్ట్ చేసే వారిని ప్రధానంగా ఆకర్షించే అంశం ఒకటుంది. పాలసీదారుడు దురదృష్టవశాత్తూ మరణిస్తే.. ఆ తర్వాత కూడా ఈ పాలసీ కొనసాగుతుంది. కాకపోతే ఆ తర్వాత వార్షిక ప్రీమియంలను కట్టే బాధ్యత పాలసీదారుడి కుటుంబంపై పడదు. పాలసీదారుడి తరఫున బీమా కంపెనీయే పాలసీ గడువు తీరే వరకు వార్షిక ప్రీమియంను జమ చేస్తూ మెచ్యూరిటీ తర్వాత అసలు, రాబడులను కలిపి చెల్లిస్తుంది. చూడ్డానికి బాగానే ఉంది కానీ.. ఈ సదుపాయం కోసం పాలసీదారుడు భారీ ప్రీమియంను చెల్లించుకోవాల్సి వస్తుంది. ఒకవేళ పాలసీ గడువు తీరే వరకు పాలసీదారుడు జీవించి ఉంటే చివర్లో వచ్చే రాబడులు చాలా తక్కువ. ద్రవ్యోల్బణం ప్రభావాన్ని పూడ్చుకునేందుకు సరిపోతాయో లేదో కూడా అనుమానమే. పాలసీల్లో చేరాలని కోరే బీమా ఏజెంట్లు ఈ చైల్డ్ ప్లాన్లలో ఉండే వివిధ చార్జీల గురించి వివరంగా చెప్పడం అరుదే. ఎండోమెంట్ ప్లాన్ బీమా ఏజెంట్లు మార్కెటింగ్ చేసే చిన్నారి పథకాల్లో ఎక్కువగా ఎండోమెంట్ ప్లాన్లే ఉంటున్నాయి. ఇవి పొదుపు, బీమా కలసిన ప్లాన్లు. బీమా ప్లాన్లు కావడంతో పెట్టుబడులకు సంబంధించిన వివరాల్లో పారదర్శకత చాలా తక్కువ. పెట్టుబడుల వివరాలను కంపెనీలు వెల్లడించవు. సాధారణంగా డెట్ సాధనాల్లోనే బీమా సంస్థలు ఇన్వెస్ట్ చేస్తుంటాయి. డెట్ సాధనాల్లో రాబడులు 7–9 శాతం మించవని తెలిసిందే. బీమా రిస్క్ చార్జీలను కంపెనీలు మినహాయించుకుంటాయి. దీంతో చెల్లించే ప్రీమియం అంతా పెట్టుబడులకు వెళ్లదు. ఫలితంగా దీర్ఘకాలానికి సగటు రాబడులు ఈ ప్లాన్లలో 4–5 శాతం వరకే ఉంటాయి. ఒకవేళ పిల్లల పేరిట పాలసీ తీసుకున్న పేరెంట్ (తల్లి లేదా తండ్రి)... పాలసీ ఆరంభమైన తొలినాళ్లలో మరణిస్తే ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ (రాబడి రేటు) కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. స్థూల రాబడి రేటును 8 శాతం అంచనాగా చూపించినప్పటికీ.. నికర రాబడులు 5 శాతం మించవు. పార్టిసిపేటింగ్ ప్లాన్ల (బీమా లాభాల నుంచి వాటా లభించేవి)లో రాబడి రేటు దీనికి కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. ఎందుకంటే ఏటా బోనస్ చెల్లిస్తాయి కనుక. అయితే, ఈ బోనస్‌ను ఏటా ప్రకటించాలన్న గ్యారంటీ ఏమీ ఉండదు. ఒకవేళ పాలసీ తీసుకున్న తర్వాత ఐదేళ్లలోపు తప్పుకుంటే అప్పటి వరకు చెల్లించిన ప్రీమియం మొత్తంలో చాలా వరకు నష్టపోవాల్సి వస్తుంది. ఎందుకంటే బీమా సంస్థలు వివిధ చార్జీలను మినహాయించుకుని మిగిలినది చెల్లిస్తాయి. కనుక ఈ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. చిన్నారుల భవిష్యత్తు లక్ష్యాలకు వారు మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లడం దీని కంటే మంచి ఆప్షన్ అవుతుంది. డెట్ సాధనాలతో పోలిస్తే దీర్ఘకాలంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో రాబడులే మెరుగ్గా ఉన్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, చిన్నారుల ఉన్నత విద్య, వివాహం ఇతర లక్ష్యాల కోసం ఉద్దేశించిన పెట్టుబడులు అన్నింటినీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేయకుండా భిన్న సాధనాల మధ్య (పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన) మధ్య వర్గీకరించుకోవడం వైవిధ్యంతో కూడుకున్న ఆప్షన్ అవుతుంది. చైల్డ్ యులిప్‌లు చిన్నారుల పేరుతో ఆఫర్ చేసే యులిప్ ప్లాన్లు కూడా మార్కెట్లో ఉన్నాయి. ఇవి కూడా బీమా, పెట్టుబడులు కలగలసిన సాధనాలు. ఇవి ఈక్విటీ మార్కెట్‌తో ముడిపడిన సాధనాలు. బీమా, ఇతర ఖర్చులు పోను చెల్లించిన ప్రీమియంలో మిగిలిన మొత్తాన్ని ఈక్విటీల్లో బీమా కంపెనీలు ఇన్వెస్ట్ చేసి, వచ్చిన రాబడులను పాలసీదారులకు పంచుతుంటాయి. ఈ ప్లాన్లలో ఈక్విటీ లేదా డెట్.. ఈక్విటీ, డెట్ కలిసిన ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈక్విటీ ఆప్షన్‌తో కూడిన యులిప్ ప్లాన్లలో రాబడులు ఎండోమెంట్ ప్లాన్లతో పోల్చుకుంటే కాస్త నయమే. ఈక్విటీ ఆప్షన్‌తో కూడిన ప్లాన్లలో దీర్ఘకాలంలో సగటున 7–8 శాతం రాబడులను ఆశించొచ్చు. స్థూల, నికర రాబడుల మధ్య వ్యత్యాసం కూడా 2 శాతాన్ని మించి ఉండదు. అయితే, యులిప్ ప్లాన్లలో పెట్టుబడులకు ఐదేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. ఇందులోనూ బీమా రక్షణ ఉంటుంది. చిన్నారుల కోసం యులిప్ ప్లాన్లలో ఇన్వెస్ట్ చేయాలన్న ఆసక్తి ఉన్నట్టయితే.. మ్యాక్స్ లైఫ్ శిక్షా ప్లస్ సూపర్ ప్లాన్‌ను పరిశీలించొచ్చు. ఇది నాన్ పార్టిసిపేట్ యులిప్ ప్లాన్. ఇందులో ఆరు రకాల ఫండ్లలో ఒకదాన్ని ఎంచుకునే వెసులుబాటు ఉంది. డైనమిక్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీని ఎంచుకున్నట్టయితే.. పాలసీ ఆరంభంలో ప్రీమియంను ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. పాలసీ కాల వ్యవధి గడుస్తున్న డెట్‌తో కూడిన కన్జర్వేటివ్ ఫండ్‌కు పెట్టుబడులను మళ్లిస్తుంది. అలాగే, హెచ్డీఎఫ్సీ స్టాండర్డ్ లైఫ్ యంగ్‌స్టార్ సూపర్ ప్రీమియం కూడా చైల్డ్ యులిప్ ప్లానే. ఇందులోనూ నాలుగు రకాల ఫండ్ ఆప్షన్లు ఉన్నాయి. చిన్నారుల పేరిట బీమా.. చిన్నారులకు బీమా రక్షణ కల్పించే ప్లాన్లు కూడా ఉన్నాయి. పిల్లలకు ఏదైనా జరిగితే పరిహారాన్ని తల్లిదండ్రులకు చెల్లించడం జరుగుతుంది. ఎల్ఐసీ న్యూ చిల్డ్రన్ మనీ బ్యాక్ పాలసీ ఇటువంటిదే. బీమా రక్షణ అనేది కుటుంబానికి ఆధారమైన వ్యక్తి కోసం ఉద్దేశించినది. అతనికి ప్రాణాపాయం వాటిల్లితే అతని పిల్లల చదువులకు ఇబ్బంది రాకూడదు. బీమా ఉంటే వచ్చే పరిహారం ఇందుకు ఉపయోగపడుతుంది. పిల్లలు ఎవరిమీద ఆధారపడ్డారో వారికి బీమా ఉండాలి. అంతే కానీ, పిల్లల పేరిట బీమా ఉంటే ఉపయోగం ఏమీ ఉండదు. కనుక పిల్లల పేరిట బీమాతో కూడిన పాలసీలను తీసుకోవడం తెలివైన నిర్ణయం అనిపించుకోదు. బీమా తగినంత ఉంటుందా..? చైల్డ్ ప్లాన్లలో బీమా రక్షణ వార్షిక ప్రీమియానికి 10 రెట్లకు మించదు. పాలసీదారు మరణించే నాటికి వార్షిక ప్రీమియానికి పది రెట్లు లేదా అప్పటి వరకు చెల్లించిన ప్రీమియానికి 105 శాతం.. ఈ రెండింటిలో ఏది ఎక్కువగా ఉంటే ఆ మేరకు బీమా పరిహారం చెల్లించడం జరుగుతుంది. ఈ ప్రకారం చూస్తే ఒకవేళ వార్షికంగా చెల్లించే ప్రీమియం రూ.50,000 ఉందనుకున్నా.. బీమా కవరేజీ రూ.5లక్షలుగానే ఉంటుంది. కానీ, పిల్లల ఉన్నత విద్య, వివాహ అవసరాలకు ఇది ఏ మూలకు సరిపోతుంది..? అందుకే కుటుంబానికి, భవిష్యత్తు లక్ష్యాలకు బీమా రక్షణ కల్పించాలంటే అందుకు ఈ తరహా చైల్డ్ ప్లాన్లు లేదా ఎండోమెంట్ పాలసీలు ఏ విధంగానూ అనుకూలం కావన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. చెల్లింపుల్లో సౌలభ్యం..? ఇక చైల్డ్ ప్లాన్లలో పిల్లల అవసరాలకు అనుగుణంగా చెల్లింపులను ఎంచుకునే సౌలభ్యం తక్కువే. ఉదాహరణకు ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ స్మార్ట్ చాంప్ ఇన్సూరెన్స్ లో చెల్లింపులు పిల్లలకు 18 ఏళ్లు వచ్చిన తర్వాత ప్రారంభం అవుతాయి. వార్షికంగా నాలుగు సమాన వాయిదాల్లో చెల్లింపులు జరుగుతాయి. ఒకవేళ 21 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత ఏకమొత్తంలో చెల్లింపులు కోరుకుంటే ఆ అవకాశం లేదు. అదే విధంగా బజాజ్ అలియాంజ్ యంగ్ అష్యూర్ ప్లాన్‌లోనూ ఏక మొత్తంలో మెచ్యూరిటీ ప్రయోజనాలను చెల్లించే ఆప్షన్ లేదు. పాలసీ కాల వ్యవధి 10, 15, 20 ఏళ్లుగా ఉండగా, ఈ కాల వ్యవధి ముగిసిన తర్వాత 3/5/7 వాయిదాల్లో బీమా సంస్థ చెల్లింపులు చేస్తుంది. ఇలా కాకుండా మ్యాక్స్ లైఫ్ ఫ్యూచర్ జీనియర్ ఎడ్యుకేషన్ ప్లాన్‌లో అయితే 16, 18, లేదా 21 ఏళ్ల వయసులో మెచ్యూరిటీ చెల్లించే ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్లను తీసుకోవడం వెనుక ప్రధాన ఉద్దేశ్యాన్ని గమనించినట్టయితే.. తమకు ఏదైనా జరగరానిది జరిగితే తమ పిల్లల విద్య, ఇతర కుటుంబ లక్ష్యాలకు విఘాతం కలగకుండా ఉండాలని ఎక్కువ మంది కోరుకుంటుంటారు. కానీ, ఇందుకు టర్మ్ లైఫ్ ప్లాన్ చక్కగా సరిపోతుంది. ఎక్కువ చార్జీలను పిండుకునే ఈ తరహా చైల్డ్ప్లాన్లు లేదా ఎండోమెంట్ పాలసీలు, యులిప్‌లకు బదులు టర్మ్ పాలసీ తీసుకోవడం ఉత్తమం. టర్మ్ పాలసీల్లో మెచ్యూరిటీ అనంతరం ఎటువంటి ప్రయోజనాలు ఉండవు. అందుకే తక్కువ ప్రీమియానికి ఎక్కువ కవరేజీ లభిస్తుంది. దీంతో కుటుంబం కోసం ఎక్కువ కవరేజీతో కూడిన ప్లాన్ తీసుకోవచ్చు. ఉదాహరణకు పిల్లల ఉన్నత విద్య, కుటుంబ పోషణ, ఇతర లక్ష్యాలకు రూ.కోటి కవరేజీతో టర్మ్ ప్లాన్ తీసుకోవాలనుకుంటే.. ప్రీమియం 30 ఏళ్ల వయసున్న ఆరోగ్యవంతుడైన వ్యక్తికి రూ.10,000గానే ఉంటుంది. కనుక ఇటువంటి గందరగోళాలకు తావివ్వని, సులభమైన, సూటి అయిన టర్మ్ ప్లాన్ మేలైనది. భవిష్యత్తు లక్ష్యాల కోసం పెట్టుబడులు పెట్టుకోవాలని భావిస్తే అందుకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్, పీపీఎఫ్ వంటి పథకాలను ఎంచుకోవచ్చు. -
పెన్షన్ కోసం... మీ ‘ప్లాన్’ ఏంటి?
ఒకప్పటి పరిస్థితి ఇప్పుడు లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పెన్షన్ లేక ఎన్‌పీఎస్‌లో (జాతీయ పెన్షన్ విధానం) చేరి... దాన్నుంచి పెన్షన్ అందుకునే పరిస్థితి ఉంది. ఇక ప్రయివేటు ఉద్యోగులో..? ఏదో కొద్ది మందికి ఆయా సంస్థలు సొంత ట్రస్టుల్ని పెట్టుకుని పెన్షన్ ఇస్తున్నాయి తప్ప 90 శాతానికిపైగా ఇలాంటి సౌకర్యం లేనివారే. ఇక స్వయం ఉపాధి పొందుతున్న వారి గురించి చెప్పనే అక్కర్లేదు. మరి వీళ్లందరికీ రిటైరయ్యాక కూడా స్థిరంగా నెలనెలా కొంత ఆదాయం వచ్చేదెలా? ఇదిగో... దీనికోసం ఉద్దేశించినవే పెన్షన్ పథకాలు. వీటిలో బీమా పెన్షన్ పథకాలకు మొదట్లో బాగా ఆదరణ ఉండేది కానీ... మధ్యలో ఎవ్వరూ వీటివైపు చూడటం మానేశారు. కాకపోతే, ఐఆర్డీఏ బీమా ఉత్పత్తుల విషయంలో చేపట్టదలిచిన తాజా సంస్కరణలు ఆచరణలోకి వస్తే గనక ఇవి మళ్లీ మునుపటిలా ఆకర్షణీయంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. యూనిట్ ఆధారిత పెన్షన్ ప్లాన్లను (యూఎల్‌పీపీ) మరింత సౌకర్యంగా, జాతీయ పెన్షన్ పథకానికి (ఎన్పీఎస్) దీటుగా ఉండేలా ఐఆర్డీఏ కీలక మార్పులను ప్రతిపాదించింది. అయినప్పటికీ యులిప్ పెన్షన్ ప్లాన్లతో పోలిస్తే ఎన్పీఎస్ చాలా చౌక. ఇందులో చార్జీలు చాలా తక్కువ కూడా!!. – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం యూనిట్ ఆధారిత బీమా పథకాల (యులిప్) గురించి చాలా మందికి తెలుసు. యూఎల్పీపీల పనితీరు కూడా వాటి మాదిరే ఉంటుంది. కాకపోతే వీటిల్లో బీమా ఉండదు. ఏ ఫండ్స్‌లో పెట్టబడులు పెట్టాలన్నది ఇన్వెస్టర్ల ఇష్టానికే పరిమితం. ఇక యులిప్‌లు, యూఎల్‌పీపీలు రెండింటిలోనూ ఐదేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. పెన్షన్ ప్లాన్లు కాబట్టి తొలి నాళ్లలోనే పెట్టుబడులను వెనక్కి తీసుకోకుండా చూడటమే ఈ లాకిన్ పీరియడ్ ఉద్దేశం. యూఎల్పీపీలో పాక్షిక ఉపసంహరణలకు అవకాశం లేదు. పాలసీ కాల వ్యవధి ముగియకముందే పెట్టుబడులను నగదుగా మార్చుకోవాలనుకుంటే మూడింట ఒకవంతు మాత్రమే తీసుకోవడానికి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని యాన్యుటీ ప్లాన్‌లో (ప్రతి నెలా పెన్షన్ చెల్లించే ప్లాన్) పెట్టాల్సి ఉంటుంది. లేదా సింగిల్ ప్రీమియం పెన్షన్ పాలసీ కొనుగోలుకు వినియోగించుకోవచ్చు. కాల వ్యవధి ముగిశాక కూడా, మూడింట ఒకవంతు మాత్రమే తీసుకోవడానికి ఉంటుంది. మిగిలింది యాన్యుటీగా మార్చుకోక తప్పదు. ఎన్పీఎస్... ఇపుడు మారింది ‘‘ఎన్పీఎస్ పథకంలో రూ.50,000 పెట్టుబడులపై సెక్షన్ 80సీకి అదనంగా పన్ను మినహాయింపు పొందొచ్చు. అంతేకాదు! రిటైర్మెంట్ సమయంలో వెనక్కి తీసుకునే 60 శాతం నిధులపైనా తాజాగా పన్నును తొలగించారు’’అని హెచ్డీఎఫ్సీ పెన్షన్ మేనేజ్మెంట్ సీఈవో సుమీత్ శుక్లా చెప్పారు. ఎన్‌పీఎస్‌లో ఏటా కనీస మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టడం తప్పనిసరి. అలాగే, 60 ఏళ్లు రాక ముందే తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవాలనుకుంటే అందుకు అవకాశం లేదు. చాలా ప్రత్యేకమైన సందర్భాల్లోనే అందుకు అవకాశం కల్పిస్తారు. పిల్లల విద్య, వివాహం, ఇల్లు కొనుగోలు లేదా తీవ్రమైన అనారోగ్యం ఎదురైతే చికిత్స అవసరాల కోసం ఎన్పీఎస్ నిధిలో 25 శాతాన్ని ఉపసంహరించుకోవచ్చు. మొత్తం ఎన్పీఎస్ కాల వ్యవధిలోపు మూడు సార్లు పాక్షిక ఉపసంహరణలకు అవకాశం ఇస్తారు. ఒకవేళ 60 ఏళ్లు నిండకముందే ఎన్పీఎస్ నుంచి వైదొలగాలనుకుంటే అప్పటి వరకు ఉన్న మొత్తం నిధుల్లో కేవలం 10 శాతమే చేతికి వస్తాయి. మిగిలిన 90 శాతాన్ని యాన్యుటీ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎన్‌పీఎస్‌లో చేరిన వారు 60 ఏళ్ల వయసుకు వచ్చాక మొత్తం నిధిలో 60 శాతాన్ని తీసేసుకుని మిగిలిన 40 శాతాన్ని యాన్యుటీ ప్లాన్‌లో పెడితే సరిపోతుంది. అదే యూఎల్‌పీపీల్లో అయితే మొత్తం నిధిలో మూడింట ఒక వంతు అంటే 33.33 శాతమే తీసుకుని, మిగిలిన 66 శాతాన్ని యాన్యుటీ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎన్పీఎస్ మాదిరే, యూఎల్పీపీల్లోనూ కాల వ్యవధి తీరిన తర్వాత 60 శాతాన్ని వెనక్కి తీసుకునేందుకు, కాల వ్యవధిలోపు పాక్షిక ఉపసంహరణలకు అవకాశం కల్పించే ప్రతిపాదనలను ఐఆర్డీఏ తాజా ముసాయిదా నిబంధనల్లో ఉన్నాయి. ఇవి అమలైతే ఈ విషయాల్లోనూ యూఎల్‌పీపీలు ఎన్పీఎస్కు ఏ మాత్రం తీసిపోవు. పెట్టుబడుల తీరు ఇలా... యూఎల్‌పీపీలు ప్రస్తుతానికి పూర్తి ఈక్విటీ ఫండ్స్‌ను ఆఫర్ చేయడం లేదు. ఎన్‌పీఎస్‌లో మాత్రం 75 శాతం వరకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకునేందుకు వీలుంది. అయితే, ఈ రెండు రకాల ఉత్పాదనల్లోనూ పరిమితులున్నాయి. ‘‘ఐఆర్డీఏ తన ముసాయిదా నిబంధల్లో మెచ్యూరిటీపై గ్యారంటీని ఐచ్ఛికం చేసింది. దీంతో కస్టమర్లు దీర్ఘకాలంలో తగినంత నిధిని సమకూర్చుకునేందుకు గాను అగ్రెస్సివ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం లభిస్తుంది’’ అని మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ మార్కెటింగ్ డైరెక్టర్ మాణిక్నాంజియా తెలిపారు. ఎన్‌పీఎస్‌లోనూ గతంలో ఈక్విటీల్లో గరిష్ట పరిమితి 50 శాతమే ఉండేది. జీఎన్ బాజ్‌పాయి కమిటీ ఈక్విటీల్లో 100 శాతం ఇన్వెస్ట్‌మెంట్‌కు సిఫారసు చేయగా, ఆ తర్వాత ఎన్‌పీఎస్‌లో ఈక్విటీ పరిమితిని 75 శాతానికి పెంచారు. ఫండ్స్ కంటే ఎన్పీఎస్ మెరుగే... ప్రస్తుతం ఎన్పీఎస్ పథకంలో రిటైర్మెంట్ సమయానికి మొత్తం నిధిలో 60 శాతాన్ని వెనక్కి తీసుకోవచ్చు. ఇందులో 20 శాతంపై పన్ను పడుతోంది. ఇకపై పూర్తి 60 శాతానికి పన్ను మినహాయింపు కల్పించారు. ఇప్పటికే ఎన్‌పీఎస్‌లో పెట్టుబడులకూ పన్ను మినహాయింపు ఉంది. దీంతో ఈపీఎఫ్, పీపీఎఫ్ మాదిరే ఎన్పీఎస్కూ మూడు దశల్లోనూ పన్ను మినహాయింపు లభించింది. మొత్తంగా మ్యూచువల్ ఫండ్స్‌తో పోలిస్తే ఎన్పీఎస్ మెరుగైనది. ఎందుకంటే... రిటైర్మెంట్ తర్వాత ఎన్పీఎస్ నిధిలో 40 శాతాన్ని యాన్యుటీ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేసి, మిగిలిన 60 శాతాన్ని రూపాయి కూడా పన్ను చెల్లించకుండా వెనక్కి తీసేసుకోవచ్చు. ఇది ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేటుగా ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేసే అందరికీ లభిస్తుంది. 2004 తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన వారందరూ ఎన్‌పీఎస్‌లో చేరడం తప్పనిసరి. పథకంలో తాజా మార్పుతో ప్రైవేటు ఉద్యోగులకూ ప్రయోజనం కలగనుంది. ఏ పథకంలో ఎంత వ్యయాలు? పథకాలు ఏవైనా అందులో ఇన్వెస్టర్లు భరించాల్సిన వ్యయాలు కీలకం అవుతాయి. దీర్ఘకాలంలో రాబడులను ఇవి నిర్దేశిస్తాయి. ఎన్పీఎస్ పథకంలో ప్రస్తుతం 0.001 శాతాన్నే పెట్టుబడుల నిర్వహణ ఫీజుగా వసూలు చేస్తున్నారు. ఈ ఫీజులు భవిష్యత్తులో పెరగొచ్చు. కానీ యూఎల్‌పీపీల్లో ఫండ్ మేనేజ్మెంట్ చార్జ్ 1.35 శాతం వరకు ఉంటోంది. పంపిణీ ఖర్చులు మొదటి ఏడాది ప్రీమియంలో 7.5 శాతం మేర, ఆ తర్వాత ఏటా ప్రీమియంలో 2 శాతం మేర ఉంటాయి. ఎన్‌పీఎస్‌లో అయితే ఈ ఫీజు కేవలం 0.25 శాతానికే పరిమితం చేశారు. అది కూడా గరిష్ట పరిమితి రూ.25,000గానే ఉంది. ఇతర వ్యయాలు చూసుకున్నా మొత్తం మీద ఎన్‌పీఎస్‌లో చార్జీలు చాలా తక్కువ. అంకెల్లో పెద్ద తేడా అనిపించకపోవచ్చు. ఉదాహరణకు... ఓ యూఎల్‌పీపీ పథకంలో ఏటా రూ.లక్ష చొప్పున 8 శాతం రాబడి రేటు అంచనా ఆధారంగా 15 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేశారనుకోండి. అప్పుడు మొత్తం నిధి రూ.24 లక్షలు అవుతుంది. అదే ఎన్‌పీఎస్‌లో ఇంతే మొత్తం 15 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే, ఇంతే రాబడి రేటు ప్రకారం సమకూరే మొత్తం రూ.29 లక్షలు అవుతుంది. చార్జీల్లో వ్యత్యాసం వల్ల 15 ఏళ్ల కాలంలో ఏకంగా రూ.5 లక్షల రాబడిని నష్టపోయినట్లు అర్థం చేసుకోవచ్చు. ఏది నయం?..: వ్యయాలు, సౌకర్యాల రీత్యా ఎన్పీఎస్ మొదటి స్థానంలో నిలుస్తుంది. పైగా ఎన్‌పీఎస్‌లో పెట్టుబడులు, రాబడులు, ఉపసంహరణలపైనా ప్రభుత్వం పన్ను మినహాయింపు కల్పించడం అదనపు ఆకర్షణ. ‘‘ఎన్‌పీఎస్‌లో సెక్షన్ 80సీకి అదనంగా రూ.50,000 పెట్టుబడులపై పన్ను మినహాయింపు కూడా మరో ఆకర్షణ. పైగా ఎన్పీఎస్ ద్వారా యాన్యుటీ ప్లాన్‌ను కొనుగోలు చేస్తే జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇతర పెన్షన్ ప్లాన్ ద్వారా యాన్యుటీని కొనుగోలు చేస్తే 1.8 శాతం జీఎస్టీ చెల్లించాలి’’ అని సుమీత్ శుక్లా తెలిపారు. తమ పెట్టుబడుల్లో 20 శాతాన్నే ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేసి, మిగిలిన నిధులను పీపీఎఫ్, ఈటీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలని తాను సూచిస్తానని లాడర్–7 ఫైనాన్షియల్ అడ్వైజర్స్ వ్యవస్థాపకుడు సురేశ్ సెడగోపన్ చెప్పారు. ఇక యూఎల్‌పీపీల్లో ప్రస్తుతం రిటైర్మెంట్ సమయంలో 33.33 శాతం మొత్తానికే పన్ను మినహాయింపు ఉంది. అయితే, ఐఆర్డీఏ ప్రతిపాదన అమల్లోకి వస్తే అప్పుడు 60 శాతం నిధిపైనా పన్ను మినహాయింపు లభిస్తుందని ఫ్యూచర్ జనరాలి ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ సీఎల్ భరద్వాజ్ తెలిపారు. -
నచ్చని పాలసీ.. వైదొలిగేదెలా?
అప్పటికప్పుడు అనుకుని తీసుకున్న కొన్ని బీమా పాలసీలు కాలం గడిచే కొద్దీ .. మన అవసరాలకు ఉపయోగపడనివిగా అనిపించవచ్చు. ఒకోసారి ప్రీమియాలు భారమై.. కట్టలేని పరిస్థితి ఎదురవ్వొచ్చు. ఇలాంటి సందర్భాల్లో పాలసీ నుంచి వైదొలిగితే ఎదురయ్యే లాభనష్టాల గురించి వివరించేదే ఈ కథనం. డిస్కంటిన్యూ చేస్తే వచ్చే ప్రయోజనాలు..బీమా పాలసీని తీసుకున్నాకా గడిచిన సమయాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. కొత్తగా తీసుకున్న పాలసీకి, అప్పుడెప్పుడో తీసుకున్న పాలసీకి వ్యత్యాసముంటుంది. కొత్తగా తీసుకున్న పాలసీ సంగతి విషయానికొస్తే .. ప్రతి బీమా పాలసీలోనూ 15 పని దినాల ఫ్రీ-లుక్ పీరియడ్ ఉంటుంది. డాక్యుమెంట్ మన చేతికి వచ్చాక ఒకవేళ పాలసీని వద్దనుకుంటే ఈ వ్యవధిలోగా బీమా కంపెనీకి తిప్పి పంపేయొచ్చు. ఇలాంటి సందర్భాల్లో కంపెనీ స్టాంపు డ్యూటీ, మెడికల్ టెస్టులు వంటి ఖర్చులు మినహాయించుకుని మీరు కట్టిన పూర్తి ప్రీమియం డబ్బు వాపసు చేయాల్సి ఉంటుంది. అదే యూనిట్ ఆధారిత బీమా పాలసీలైతే (యులిప్) పాలసీని వాపసు చేసిన తేదీ నాడు యూనిట్ విలువ (ఎన్ఏవీ)ని లెక్కగట్టి, ఇతర వ్యయాలు మినహాయించుకుని.. మిగతా మొత్తాన్ని కంపెనీ తిరిగి చెల్లిస్తుంది. పాత పాలసీలైతే: గతంలో ఎప్పుడో తీసుకున్న పాలసీలను డిస్కంటిన్యూ చేయడానికి మరో విధానం అనుసరించాల్సి ఉంటుంది. సాధారణంగా సంప్రదాయ పాలసీల్లో కనీసం మూడేళ్ల పాటు ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ మధ్యలో మానేస్తే ..అప్పటిదాకా కట్టిన డబ్బు కూడా కంపెనీకే వెళ్లిపోతుంది. పాలసీని డిస్కంటిన్యూ చేసినా పైసా కూడా చేతికి రాదు. అదే మూడేళ్ల పాటు క్రమం తప్పకుండా చెల్లించిన పక్షంలో .. పాలసీని నిలిపేయడానికి రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. మొదటిదాని విషయానికొస్తే.. మూడేళ్ల అనంతరం తదుపరి ప్రీమియం చెల్లింపులను ఆపేయొచ్చు. అప్పటిదాకా పాలసీ ప్రయోజనాలు ఆనాటితో నిల్చిపోతాయి. పాలసీ వ్యవధి ముగిసిన తర్వాత మెచ్యూరిటీ మొత్తాన్ని కంపెనీ తిరిగి చెల్లిస్తుంది. ఇక రెండో ప్రత్యామ్నాయం సంగతి చూస్తే.. మీరు ఒక అయిదేళ్ల పాటు ప్రీమియంలు చెల్లించి, నిలిపివేసిన పక్షంలో .. ఆ అయిదేళ్ల కాలం తర్వాత వచ్చే ప్రయోజనాలన్నీ కూడా యథాతథంగా కొనసాగుతాయి. పాలసీ గడువు తీరిన తర్వాత మీ చేతికి అందుతాయి. అంత కాలం ఆగే అవకాశం లేక మధ్యలోనే పాలసీని రద్దు చేసి వచ్చినంత తీసుకుందామనుకుంటే.. ఆ పనీ చేయొచ్చు. కానీ, ఇలాంటి సందర్భాల్లో డబ్బు తక్షణమే చేతికి వస్తుంది..కానీ బీమా కంపెనీ భారీ మొత్తంలో చార్జీలు మినహాయించుకుంటుంది.