పెన్షన్‌ కోసం... మీ ‘ప్లాన్‌’ ఏంటి?

Govt makes National Pension Scheme sharper and better - Sakshi

ప్రస్తుతానికి బీమా పెన్షన్‌ ప్లాన్లలో ఆకర్షణ తక్కువే

దీంతో కీలక మార్పులను ప్రతిపాదించిన ఐఆర్‌డీఏ

అవన్నీ అమల్లోకి వస్తే ఈ పథకాలూ అనుకూలమే

కానీ ఎన్‌పీఎస్‌లో అత్యంత తక్కువ చార్జీలు

దీంతో దీర్ఘకాలంలో బీమా ప్లాన్లతో పోలిస్తే అధిక రాబడి

సౌలభ్యం కూడా ఎన్‌పీఎస్‌లోనే ఎక్కువ  

ఒకప్పటి పరిస్థితి ఇప్పుడు లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పెన్షన్‌ లేక ఎన్‌పీఎస్‌లో (జాతీయ పెన్షన్‌ విధానం) చేరి... దాన్నుంచి పెన్షన్‌ అందుకునే పరిస్థితి ఉంది. ఇక ప్రయివేటు ఉద్యోగులో..? ఏదో కొద్ది మందికి ఆయా సంస్థలు సొంత ట్రస్టుల్ని పెట్టుకుని పెన్షన్‌ ఇస్తున్నాయి తప్ప 90 శాతానికిపైగా ఇలాంటి సౌకర్యం లేనివారే. ఇక స్వయం ఉపాధి పొందుతున్న వారి గురించి చెప్పనే అక్కర్లేదు. మరి వీళ్లందరికీ రిటైరయ్యాక కూడా స్థిరంగా నెలనెలా కొంత ఆదాయం వచ్చేదెలా?

ఇదిగో... దీనికోసం ఉద్దేశించినవే పెన్షన్‌ పథకాలు. వీటిలో బీమా పెన్షన్‌ పథకాలకు మొదట్లో బాగా ఆదరణ ఉండేది కానీ... మధ్యలో ఎవ్వరూ వీటివైపు చూడటం మానేశారు. కాకపోతే, ఐఆర్‌డీఏ బీమా ఉత్పత్తుల విషయంలో చేపట్టదలిచిన తాజా సంస్కరణలు ఆచరణలోకి వస్తే గనక ఇవి మళ్లీ మునుపటిలా ఆకర్షణీయంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. యూనిట్‌ ఆధారిత పెన్షన్‌ ప్లాన్లను (యూఎల్‌పీపీ) మరింత సౌకర్యంగా, జాతీయ పెన్షన్‌ పథకానికి (ఎన్‌పీఎస్‌) దీటుగా ఉండేలా ఐఆర్‌డీఏ కీలక మార్పులను ప్రతిపాదించింది. అయినప్పటికీ యులిప్‌ పెన్షన్‌ ప్లాన్లతో పోలిస్తే ఎన్‌పీఎస్‌ చాలా చౌక. ఇందులో చార్జీలు చాలా తక్కువ కూడా!!.
– సాక్షి, పర్సనల్‌ ఫైనాన్స్‌ విభాగం

యూనిట్‌ ఆధారిత బీమా పథకాల (యులిప్‌) గురించి చాలా మందికి తెలుసు. యూఎల్‌పీపీల పనితీరు కూడా వాటి మాదిరే ఉంటుంది. కాకపోతే వీటిల్లో బీమా ఉండదు. ఏ ఫండ్స్‌లో పెట్టబడులు పెట్టాలన్నది ఇన్వెస్టర్ల ఇష్టానికే పరిమితం. ఇక యులిప్‌లు, యూఎల్‌పీపీలు రెండింటిలోనూ ఐదేళ్ల లాకిన్‌ పీరియడ్‌ ఉంటుంది. పెన్షన్‌ ప్లాన్లు కాబట్టి తొలి నాళ్లలోనే పెట్టుబడులను వెనక్కి తీసుకోకుండా చూడటమే ఈ లాకిన్‌ పీరియడ్‌ ఉద్దేశం. యూఎల్‌పీపీలో పాక్షిక ఉపసంహరణలకు అవకాశం లేదు.

పాలసీ కాల వ్యవధి ముగియకముందే పెట్టుబడులను నగదుగా మార్చుకోవాలనుకుంటే మూడింట ఒకవంతు మాత్రమే తీసుకోవడానికి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని యాన్యుటీ ప్లాన్‌లో (ప్రతి నెలా పెన్షన్‌ చెల్లించే ప్లాన్‌) పెట్టాల్సి ఉంటుంది. లేదా సింగిల్‌ ప్రీమియం పెన్షన్‌ పాలసీ కొనుగోలుకు వినియోగించుకోవచ్చు. కాల వ్యవధి ముగిశాక కూడా, మూడింట ఒకవంతు మాత్రమే తీసుకోవడానికి ఉంటుంది. మిగిలింది యాన్యుటీగా మార్చుకోక తప్పదు.  

ఎన్‌పీఎస్‌... ఇపుడు మారింది
‘‘ఎన్‌పీఎస్‌ పథకంలో రూ.50,000 పెట్టుబడులపై సెక్షన్‌ 80సీకి అదనంగా పన్ను మినహాయింపు పొందొచ్చు. అంతేకాదు! రిటైర్మెంట్‌ సమయంలో వెనక్కి తీసుకునే 60 శాతం నిధులపైనా తాజాగా పన్నును తొలగించారు’’అని హెచ్‌డీఎఫ్‌సీ పెన్షన్‌ మేనేజ్‌మెంట్‌ సీఈవో సుమీత్‌ శుక్లా చెప్పారు. ఎన్‌పీఎస్‌లో ఏటా కనీస మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టడం తప్పనిసరి. అలాగే, 60 ఏళ్లు రాక ముందే తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవాలనుకుంటే అందుకు అవకాశం లేదు. చాలా ప్రత్యేకమైన సందర్భాల్లోనే అందుకు అవకాశం కల్పిస్తారు.

పిల్లల విద్య, వివాహం, ఇల్లు కొనుగోలు లేదా తీవ్రమైన అనారోగ్యం ఎదురైతే చికిత్స అవసరాల కోసం ఎన్‌పీఎస్‌ నిధిలో 25 శాతాన్ని ఉపసంహరించుకోవచ్చు. మొత్తం ఎన్‌పీఎస్‌ కాల వ్యవధిలోపు మూడు సార్లు పాక్షిక ఉపసంహరణలకు అవకాశం ఇస్తారు. ఒకవేళ 60 ఏళ్లు నిండకముందే ఎన్‌పీఎస్‌ నుంచి వైదొలగాలనుకుంటే అప్పటి వరకు ఉన్న మొత్తం నిధుల్లో కేవలం 10 శాతమే చేతికి వస్తాయి. మిగిలిన 90 శాతాన్ని యాన్యుటీ ప్లాన్‌లో ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది.

ఎన్‌పీఎస్‌లో చేరిన వారు 60 ఏళ్ల వయసుకు వచ్చాక మొత్తం నిధిలో 60 శాతాన్ని తీసేసుకుని మిగిలిన 40 శాతాన్ని యాన్యుటీ ప్లాన్‌లో పెడితే సరిపోతుంది. అదే యూఎల్‌పీపీల్లో అయితే మొత్తం నిధిలో మూడింట ఒక వంతు అంటే 33.33 శాతమే తీసుకుని, మిగిలిన 66 శాతాన్ని యాన్యుటీ ప్లాన్‌లో ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. ఎన్‌పీఎస్‌ మాదిరే, యూఎల్‌పీపీల్లోనూ కాల వ్యవధి తీరిన తర్వాత 60 శాతాన్ని వెనక్కి తీసుకునేందుకు, కాల వ్యవధిలోపు పాక్షిక ఉపసంహరణలకు అవకాశం కల్పించే ప్రతిపాదనలను ఐఆర్‌డీఏ తాజా ముసాయిదా నిబంధనల్లో ఉన్నాయి. ఇవి అమలైతే ఈ విషయాల్లోనూ యూఎల్‌పీపీలు ఎన్‌పీఎస్‌కు ఏ మాత్రం తీసిపోవు.  

పెట్టుబడుల తీరు ఇలా...
యూఎల్‌పీపీలు ప్రస్తుతానికి పూర్తి ఈక్విటీ ఫండ్స్‌ను ఆఫర్‌ చేయడం లేదు. ఎన్‌పీఎస్‌లో మాత్రం 75 శాతం వరకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేసుకునేందుకు వీలుంది. అయితే, ఈ రెండు రకాల ఉత్పాదనల్లోనూ పరిమితులున్నాయి. ‘‘ఐఆర్‌డీఏ తన ముసాయిదా నిబంధల్లో మెచ్యూరిటీపై గ్యారంటీని ఐచ్ఛికం చేసింది. దీంతో కస్టమర్లు దీర్ఘకాలంలో తగినంత నిధిని సమకూర్చుకునేందుకు గాను అగ్రెస్సివ్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకునే అవకాశం లభిస్తుంది’’ అని మ్యాక్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ మాణిక్‌నాంజియా తెలిపారు. ఎన్‌పీఎస్‌లోనూ గతంలో ఈక్విటీల్లో గరిష్ట పరిమితి 50 శాతమే ఉండేది. జీఎన్‌ బాజ్‌పాయి కమిటీ ఈక్విటీల్లో 100 శాతం ఇన్వెస్ట్‌మెంట్‌కు సిఫారసు చేయగా, ఆ తర్వాత ఎన్‌పీఎస్‌లో ఈక్విటీ పరిమితిని 75 శాతానికి పెంచారు.

ఫండ్స్‌ కంటే ఎన్‌పీఎస్‌ మెరుగే...
ప్రస్తుతం ఎన్‌పీఎస్‌ పథకంలో రిటైర్మెంట్‌ సమయానికి మొత్తం నిధిలో 60 శాతాన్ని వెనక్కి తీసుకోవచ్చు. ఇందులో 20 శాతంపై పన్ను పడుతోంది. ఇకపై పూర్తి 60 శాతానికి పన్ను మినహాయింపు కల్పించారు. ఇప్పటికే ఎన్‌పీఎస్‌లో పెట్టుబడులకూ పన్ను మినహాయింపు ఉంది. దీంతో ఈపీఎఫ్, పీపీఎఫ్‌ మాదిరే ఎన్‌పీఎస్‌కూ మూడు దశల్లోనూ పన్ను మినహాయింపు లభించింది. మొత్తంగా మ్యూచువల్‌ ఫండ్స్‌తో పోలిస్తే ఎన్‌పీఎస్‌ మెరుగైనది.

ఎందుకంటే... రిటైర్మెంట్‌ తర్వాత ఎన్‌పీఎస్‌ నిధిలో 40 శాతాన్ని యాన్యుటీ ప్లాన్‌లో ఇన్వెస్ట్‌ చేసి, మిగిలిన 60 శాతాన్ని రూపాయి కూడా పన్ను చెల్లించకుండా వెనక్కి తీసేసుకోవచ్చు. ఇది ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేటుగా ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్‌ చేసే అందరికీ లభిస్తుంది. 2004 తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన వారందరూ ఎన్‌పీఎస్‌లో చేరడం తప్పనిసరి. పథకంలో తాజా మార్పుతో ప్రైవేటు ఉద్యోగులకూ ప్రయోజనం కలగనుంది.
ఏ పథకంలో ఎంత వ్యయాలు?
పథకాలు ఏవైనా అందులో ఇన్వెస్టర్లు భరించాల్సిన వ్యయాలు కీలకం అవుతాయి. దీర్ఘకాలంలో రాబడులను ఇవి నిర్దేశిస్తాయి. ఎన్‌పీఎస్‌ పథకంలో ప్రస్తుతం 0.001 శాతాన్నే పెట్టుబడుల నిర్వహణ ఫీజుగా వసూలు చేస్తున్నారు. ఈ ఫీజులు భవిష్యత్తులో పెరగొచ్చు. కానీ యూఎల్‌పీపీల్లో ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ చార్జ్‌ 1.35 శాతం వరకు ఉంటోంది. పంపిణీ ఖర్చులు మొదటి ఏడాది ప్రీమియంలో 7.5 శాతం మేర, ఆ తర్వాత ఏటా ప్రీమియంలో 2 శాతం మేర ఉంటాయి. ఎన్‌పీఎస్‌లో అయితే ఈ ఫీజు కేవలం 0.25 శాతానికే పరిమితం చేశారు.

అది కూడా గరిష్ట పరిమితి రూ.25,000గానే ఉంది. ఇతర వ్యయాలు చూసుకున్నా మొత్తం మీద ఎన్‌పీఎస్‌లో చార్జీలు చాలా తక్కువ. అంకెల్లో పెద్ద తేడా అనిపించకపోవచ్చు. ఉదాహరణకు... ఓ యూఎల్‌పీపీ పథకంలో ఏటా రూ.లక్ష చొప్పున 8 శాతం రాబడి రేటు అంచనా ఆధారంగా 15 ఏళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేశారనుకోండి. అప్పుడు మొత్తం నిధి రూ.24 లక్షలు అవుతుంది. అదే ఎన్‌పీఎస్‌లో ఇంతే మొత్తం 15 ఏళ్లు ఇన్వెస్ట్‌ చేస్తే, ఇంతే రాబడి రేటు ప్రకారం సమకూరే మొత్తం రూ.29 లక్షలు అవుతుంది. చార్జీల్లో వ్యత్యాసం వల్ల 15 ఏళ్ల కాలంలో ఏకంగా రూ.5 లక్షల రాబడిని నష్టపోయినట్లు అర్థం చేసుకోవచ్చు.  

ఏది నయం?..: వ్యయాలు, సౌకర్యాల రీత్యా ఎన్‌పీఎస్‌ మొదటి స్థానంలో నిలుస్తుంది. పైగా ఎన్‌పీఎస్‌లో పెట్టుబడులు, రాబడులు, ఉపసంహరణలపైనా ప్రభుత్వం పన్ను మినహాయింపు కల్పించడం అదనపు ఆకర్షణ. ‘‘ఎన్‌పీఎస్‌లో సెక్షన్‌ 80సీకి అదనంగా రూ.50,000 పెట్టుబడులపై పన్ను మినహాయింపు కూడా మరో ఆకర్షణ. పైగా ఎన్‌పీఎస్‌ ద్వారా యాన్యుటీ ప్లాన్‌ను కొనుగోలు చేస్తే జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇతర పెన్షన్‌ ప్లాన్‌ ద్వారా యాన్యుటీని కొనుగోలు చేస్తే 1.8 శాతం జీఎస్టీ చెల్లించాలి’’ అని సుమీత్‌ శుక్లా తెలిపారు.

తమ పెట్టుబడుల్లో 20 శాతాన్నే ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్‌ చేసి, మిగిలిన నిధులను పీపీఎఫ్, ఈటీఎఫ్, మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలని తాను సూచిస్తానని లాడర్‌–7 ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌ వ్యవస్థాపకుడు సురేశ్‌ సెడగోపన్‌ చెప్పారు. ఇక యూఎల్‌పీపీల్లో ప్రస్తుతం రిటైర్మెంట్‌ సమయంలో 33.33 శాతం మొత్తానికే పన్ను మినహాయింపు ఉంది. అయితే, ఐఆర్‌డీఏ ప్రతిపాదన అమల్లోకి వస్తే అప్పుడు 60 శాతం నిధిపైనా పన్ను మినహాయింపు లభిస్తుందని ఫ్యూచర్‌ జనరాలి ఇండియా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌ సీఎల్‌ భరద్వాజ్‌ తెలిపారు.


 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top