
ఎన్‌పీఎస్ మాదిరే కల్పిస్తున్నట్టు కేంద్రం ప్రకటన
న్యూఢిల్లీ: యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)ను ప్రోత్సహించే దిశగా ఈ పథకాన్ని ఎంపిక చేసుకున్న ఉద్యోగులకు ఎన్‌పీఎస్ మాదిరే పన్ను ప్రయోజనాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అవసరమైన చర్యలను కేంద్రం చేపట్టింది. యూపీఎస్‌ను సైతం పన్ను కార్యాచరణ పరిధిలోకి చేర్చడం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు విశ్రాంత జీవన భద్రత దిశగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో ముందడు అని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది.
ఎన్‌పీఎస్ కింద అమల్లో ఉన్న పన్ను ప్రయోజనాలను యూపీఎస్ ఎంపిక చేసుకునే వారికి సైతం వర్తింపచేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెబుతూ.. యూపీఎస్ కూడా ఎన్‌పీఎస్ కింద ఒక ఆప్షన్ అన్న విషయాన్ని గుర్తు చేసింది. దీనివల్ల యూపీఎస్ ఎంపిక చేసుకునే వారికి సైతం గణనీయమైన పన్ను ప్రయోజనాలు దక్కుతాయని తెలిపింది. 2025 ఏప్రిల్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో చేరే ఉద్యోగులకు ఎన్‌పీఎస్ కింద యూపీఎస్‌ను ఒక ఆప్షన్‌గా ప్రవేశపెడుతూ ఈ ఏడాది జనవరి 24న కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే ఎన్‌పీఎస్ కింద నమోదై ఉన్న ఉద్యోగులు యూపీఎస్‌కు మారేందుకు ఒక్కసారి అవకాశం ఇచ్చింది.