మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు (అస్సెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు /ఏఎంసీలు) ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసే చార్జీలు (ఎక్స్‌పెన్స్ రేషియో), బ్రోకరేజీ చార్జీలపై సెబీ కీలక మార్పులను ప్రతిపాదించింది. క్యాష్ మార్కెట్ లావాదేవీలపై బ్రోకరేజీ చార్జీ ఇప్పటివరకు గరిష్టంగా 12 బేసిస్ పాయింట్లకు అనుమతి ఉండగా, 2 బేసిస్ పాయింట్లకు తగ్గించింది. డెరివేటివ్స్‌కు బేసిస్ పాయింట్ల గరిష్ట పరిమితిని ఒక బేసిస్ పాయింట్‌కు కుదించింది.
ఇక ప్రతీ మ్యూచువల్ ఫండ్ పథకంలో పెట్టుబడిదారుల నుంచి ఏఎంసీలు టోటల్ ఎక్స్‌పెన్స్ రేషియో (టీఈఆర్) వసూలు చేస్తుంటాయి. అయితే, బ్రోకరేజీ, సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను (ఎస్‌టీసీ), జీఎస్‌టీ, స్టాంప్ డ్యూటీ వంటి చార్జీలు ఇప్పటి వరకు టీఈఆర్‌లో కలసి ఉంటుండగా, ఇకపై వీటిని విడిగా చూపించాల్సి ఉంటుంది. దీనివల్ల అసలు పెట్టుబడుల నిర్వహణపై ఎంత చార్జీ పడుతుందో ఇన్వెస్టర్లకు తెలుస్తుందన్నది సెబీ ఉద్దేశం.
టీఈఆర్ గరిష్ట పరిమితిలోనూ 15–20 బేసిస్ పాయింట్లను తగ్గించాలన్నది మరొక ప్రతిపాదన. పనితీరు ఆధారిత టీఈఆర్‌ను కూడా ప్రతిపాదించింది. 2018లో మ్యూచువల్ ఫండ్స్ పథకాల పునర్‌వ్యవస్థీకరణ తర్వాత 5 బేసిస్ పాయింట్ల మేర అదనంగా వసూలు చేసుకునేందుకు సెబీ అనుమతించింది. ఇప్పుడు దీన్ని తొలగించనున్నట్టు పేర్కొంది. ఈ ప్రతిపాదనలపై సూచనలకు సెబీ ఆహ్వానించింది.
ఇన్వెస్టర్లకు ప్రయోజనం
సెబీ ప్రతిపాదనలతో ఇన్వెస్టర్లకు వ్యయాలు తగ్గి, రాబడులు పెరుగుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘‘బ్రోకరేజీ చార్జీలను క్రమబద్ధీకరించడం వల్ల ఇన్వెస్టర్లు పరిశోధన, అడ్వైజరీల కోసం రెట్టింపు చెల్లించాల్సిన అవసరం తప్పుతుంది’’అని ఆనంద్‌రాఠీ వెల్త్ జాయింట్ సీఈవో ఫెరోజ్ అజీజ్ అభిప్రాయపడ్డారు. జీఎస్‌టీ, ఎస్‌టీటీ, స్టాంప్ డ్యూటీలను టీఈఆర్‌లో కాకుండా విడిగా పేర్కొనడం వల్ల వివిధ పథకాల మధ్య అసలు వ్యయాలు ఎంతన్నది పోల్చుకోవడం సులభం అవుతుందన్నారు. ‘‘నికరంగా ఇన్వెస్టర్లకు టీఈఆర్ తగ్గుతుంది. దీంతో రాబడులు అధికం కావడం వల్ల అదనపు ప్రయోజనం పొందుతారు’’అని ట్రస్ట్ మ్యూచువల్ ఫండ్ సీఈవో
సందీప్ బగ్లా తెలిపారు.
ఇదీ చదవండి: ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు


