తక్షణం ఉండటానికైతే ఫ్లాట్ కొనటమే నయం
ఇన్వెస్ట్‌మెంట్ కోసమైతే ఫ్లాట్లకన్నా స్థలాలు మేలు
అభివృద్ధికి అవకాశం ఉండే ప్రాంతాల్లో పెట్టుబడి మంచిది
స్థలం కొనేముందు సవాలక్ష జాగ్రత్తలు తప్పనిసరి
అన్నీ క్షుణ్ణంగా పరిశీలించుకున్నాకే ముందుకెళ్లాలి
గడిచిన ఐదేళ్లలో హైదరాబాద్‌లో ఫ్లాట్ల ధరలు రెట్టింపు
అదే సమయంలో స్థలాల ధరలు మూడునాలుగు రెట్లు
విశాఖ లాంటి ప్రాంతాల్లో ఆ స్థాయిలో లేని పెరుగుదల
ఫ్లాటా... ప్లాటా? ఇల్లా... స్థలమా? కొనేటప్పుడు చాలామందిని ఈ సందేహం వేధిస్తూనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఫ్లాటో, ప్లాటో కొన్న తరువాత బాధ పడటమూ సహజం. అయ్యో.. ఇక్కడ ఫ్లాట్ బదులు అక్కడ స్థలం కొని ఉండాల్సిందే... లేకపోతే ఈ స్థలం బదులు అక్కడ ఫ్లాట్ కొనుక్కుని ఉండాల్సిందే... అనుకుంటూ ఉంటారు. ఇలాంటివి ఎప్పుడు జరుగుతాయంటే మనం కొందామనుకున్నది బాగా పెరిగి... కొన్నది అంతగా పెరగనప్పుడు!!. మరి ఈ నిర్ణయం ఎలా తీసుకోవాలి? ఏది కొంటే బెటర్? దీనిపై అవగాహన కోసమే ఈ కథనం..
– సాక్షి, వెల్త్ డెస్క్
నగరాల్లోనైనా, శివార్లలోనైనా, ఊళ్లల్లోనైనా ఎక్కడ చూసినా ప్రస్తుతం రియల్ ఎస్టేట్ జోరుగానే ఉంది. స్థలాలు, ఫ్లాట్లని తేడా లేకుండా అన్నింటి రేట్లూ ఆకాశాన్ని తాకేస్తున్నాయి. కొన్న కొద్ది సంవత్సరాలకే విలువ భారీగా పెరిగిపోతోంది కూడా. అనరాక్‌లాంటి మార్కెట్ వర్గాల గణాంకాలను బట్టి అయిదారేళ్ల క్రితం హైదరాబాద్‌లోని కోకాపేట్‌లో ఫ్లాట్ల రేటు చ.అ.కు సగటున రూ.4,750గా ఉండగా గతేడాది ప్రథమార్ధంలో రెట్టింపై ఏకంగా రూ.9,000కు ఎగిసింది.
మరికొన్ని మార్కెట్ వర్గాల ప్రకారం ఇదే వ్యవధిలో విశాఖపట్నంలోని మధురవాడలో రూ. 3,800–4,300గా ఉన్న ధర రూ. 5,2,00–6,200 స్థాయికి చేరింది. అదే మధురవాడ ప్రాంతంలో స్థలాల రేట్లు 2019లో దాదాపుగా గజం 40వేల వరకూ ఉండి... గతేడాది రూ.75000 దాటేశాయి. ఇక హైదరాబాద్‌లో ఇదే కాలంలో చూస్తే ఫ్లాట్ల ధరలు రెట్టింపయ్యాయేమో కానీ... స్థలాల ధరలు నాలుగైదు రెట్లు పెరిగాయి. కొన్నిచోట్ల ఇంకా ఎక్కువే పెరిగాయి. ఈ లెక్కన చూసినపుడు రెండూ పెరుగుతున్నాయి. ప్రాంతాన్ని బట్టి స్థలాలు ఇంకాస్త ఎక్కువ పెరుగుతున్నాయి. మరి ఎంచుకోవటం ఎలా?
అవసరానికే పెద్ద పీట...
స్థలమైనా, ఫ్లాటైనా... మన అవసరాన్ని బట్టి కొనుక్కుంటే తరువాత రేట్లు పెరగకపోయినా, పెరిగినా పెద్దగా బాధపడాల్సిన పని ఉండదు. హైదరాబాద్‌తో పాటు ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ కొత్త ప్రాజెక్టులొస్తూ అభివృద్ధి జరుగుతోంది కాబట్టి అక్కడ డిమాండ్ పెరగటం, దానికి తగ్గట్లే రేటూ పెరగటం సహజం. స్థలం ఉంటే అవకాశాలెక్కువ. ఇక ఫ్లాట్ల విషయానికొస్తే అపార్ట్‌మెంట్ పరిమాణం పరిమితం. పైపెచ్చు పాతబడిపోతూ ఉంటుంది. పెచ్చులూడిపోవడం, పెయింట్లు వెలిసిపోవడం, పైపులు లీక్ కావడం, కామన్ ఏరియాలు పాడైపోవడంలాంటి సవాళ్లుంటాయి. దీంతో ఆ ప్రాంతం అభివృద్ధి చెందినా, స్థలం మాదిరిగా ఫ్లాట్ విలువ పెరగదు. కాబట్టి ఇన్వెస్టరు కోణంలో ఆలోచించే ఎవరికైనా ఫ్లాట్ కన్నా స్థలం అర్ధవంతంగా ఉంటుంది. స్థలం కొనుక్కుని కాస్త 5–10 ఏళ్లు ఆగితే దాని విలువ రెండు రెట్లు, మూడు రెట్లు, అంతకు మించి కూడా పెరిగే అవకాశం ఉంది. అందుకే స్థలంపై చేసే ఇన్వెస్ట్‌మెంట్‌ను సరైన పెట్టుబడిగా చెబుతారు.
స్థలం కొనేముందు జాగ్రత్తలెన్నో....
సాధారణంగా ఫ్లాట్లనేవి కొన్ని సందర్భాలు మినహా చాలా మటుకు చట్టపరమైన అన్ని అనుమతులతో లభిస్తాయి. అదే పేరున్న బిల్డర్ దగ్గర్నుంచి కొంటున్నారంటే లీగల్ విషయాల గురించి పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. అయితే, రెరా రిజిస్ట్రేషన్, ఆక్యుపెన్సీ సర్టి ఫికెట్ వంటివి తప్పనిసరిగా చూడాల్సి ఉన్నా... ఓవరాల్‌గా రిస్కు తక్కువే ఉంటుంది. స్థలం విషయానికొచ్చే సరికి మాత్రం చూసుకోవాల్సినవి చాలా ఉంటాయి. టైటిల్ ఓనర్íÙప్ ఎవరి పేరిట ఉంది? రెసిడెన్షియలా లేక వ్యవసాయ భూమా? కన్వర్షన్ పరిస్థితి ఏంటి? లీగల్ వివాదాలేవైనా ఉన్నాయా? లే అవుట్‌కి ఆ ప్రాంత డెవలప్‌మెంట్ అథారిటినీ నుంచి అన్ని అనుమతులూ ఉన్నాయా? ఇలాంటి విషయాలెన్నీ నిశితంగా చూసి తీరాలి. వీటిల్లో ఏ చిన్న తేడా జరిగినా, మీరు కొనుక్కున్న స్థలాన్ని ఉపయోగించుకోలేని పరిస్థితి తలెత్తవచ్చు.
లేదా అది పూర్తిగా చేయి జారిపోనూ వచ్చు. కాబట్టి, స్థలంపై ఇన్వెస్ట్ చేయడం మంచిదే అయినప్పటికీ పేపర్‌వర్క్ 100 శాతం కరెక్ట్‌గా ఉన్నప్పుడే మంచిదవుతుంది. ఇక మెయింటెనెన్స్ విషయంలో ఫ్లాట్‌తో పోలిస్తే ప్లాట్‌దే పైచేయి. ఫ్లాట్ కొంటే మనం ఉన్నా... అద్దెకు ఇచ్చినా ప్రతి నెలా లిఫ్టులు, సెక్యూరిటీ, క్లీనింగ్ ఇలాంటివాటన్నింటికీ సంబంధించి మెయింటెనెన్స్ బిల్లు భారం ఉంటుంది. స్విమ్మింగ్ పూళ్లు.. జిమ్ములు గట్రా మీరు వాడకపోయినా కచి్చతంగా కట్టాల్సిందే. అదే స్థలం విషయానికొస్తే.. ప్రాపర్టీ ట్యాక్స్ తప్ప ప్రతి నెలా కచి్చతంగా ఇంత చెల్లించాలనే బాదరబందీ ఉండదు. ఒకవేళ అందులో మీరు కట్టుకున్న నిర్మాణాన్ని బట్టి ఏవైనా మెయింటెనెన్స్ ఉండొచ్చు.
ఫ్లాట్లకు రుణాలు సులభం ..
స్థలాలతో పోలిస్తే.. ఫ్లాట్లకు రుణాలు ఈజీగా దొరుకుతాయి. ప్రాపర్టీ విలువలో దాదాపు 80–90 శాతం వరకు బ్యాంకులు రుణాలిస్తుంటాయి. రీపేమెంట్ వ్యవధి కూడా సుదీర్ఘంగా ఉంటుంది. వడ్డీ రేట్లు తగ్గితే ఆ ప్రయోజనాలూ ఉంటాయి. అదే మీరు స్థలం కొనుక్కోవడానికి రుణం తీసుకోవాలంటే మాత్రం బోలెడు రూల్సు, పరిమితులు ఉంటాయి. ఆ తర్వాత కూడా స్థలం విలువలో 60–70 శాతమే రుణం ఇవ్వొచ్చు. ఇక రుణాన్ని తీర్చేందుకు కాలవ్యవధి కూడా ఫ్లాట్లతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. చాలా మటుకు బ్యాంకులు 15 ఏళ్ల వరకే లోన్లు ఇస్తాయి. పైపెచ్చు స్థలం కొన్నాక నిరీ్ణత వ్యవధిలో ఇల్లు కట్టుకోవాలనే షరతులు పెడతాయి. ఏరియా బాగుండి, రేటు రీజనబుల్‌గా ఉంటే ఫ్లాట్లు ఇట్టే అమ్ముడవుతాయి. కానీ బాగా డిమాండ్ ఉన్న ప్రాంతమైతే తప్ప స్థలాలు అంత వేగంగా అమ్ముడు కావు. కానీ కాస్త ఓపిక పడితే, సమయం వచి్చనప్పుడు మాత్రం మంచి రేటుకే అమ్ముడవుతాయి.
ఫ్లాట్ కొనటం, అమ్మటం కాస్త ఈజీ
నివసించడం కోసమైతే ఫ్లాట్లను కొనుక్కోవడం సరైన నిర్ణయమని చెప్పాలి. కొనటం కూడా చాలా సులువు. కొనుక్కుని, పేపర్‌వర్క్ పూర్తి చేసి, షిఫ్టింగ్ ప్రక్రియను ప్రారంభించవచ్చు. ఒకవేళ నిర్మాణ దశలో ఉన్నదైతే, ఎప్పటికల్లా పూర్తవుతుందనేది ముందే తెలుస్తుంది. అదే స్థలం విషయానికొస్తే కేవలం ప్లాట్ చేతికి వస్తుంది. ఆ తర్వాత ఇల్లు కట్టుకుని, అందులోకి మారాలంటే చాలా సమయం పడుతుంది. అంతా సవ్యంగా సాగి, ఎలాంటి జాప్యాలు జరగకుండా ఉంటే కనీసం ఏడాదిన్నర సమయం పడుతుంది. కానీ ఇలాంటి సందర్భాలు చాలా తక్కువ. కాబట్టి, సత్వరం నివసించేందుకు ఇల్లు కావాలంటే ఫ్లాట్‌ను ఎంచుకోవచ్చు. అదే కొ న్నాళ్ల తరవాత మారాలనుకుంటే ప్లాట్ ఎంచుకోవచ్చు.


