ఒక వ్యక్తి ఆర్థికంగా ఎంత విజయం సాధించాడన్నది ఈ రోజుల్లో ఆన్‌లైన్‌లో చూస్తున్నారు. వారి విలాసవంతమైన జీవనశైలి, వాడే లగ్జరీ వస్తువులు, సోషల్ మీడియా హోదాతో కొలుస్తారు. కానీ చార్టర్డ్ అకౌంటెంట్ నితిన్ కౌశిక్ మాత్రం సంపదకు కొత్త నిర్వచనాన్ని చెబుతున్నారు. సంపదను ప్రదర్శించేవారు నిజమైన ధనవంతులు కారు అంటున్నారాయన.
‘నిజమైన సంపద అంటే మనశ్శాంతి. బ్యాంక్ బ్యాలెన్స్ కాదు’ అంటూ తన అభిప్రాయాలను ‘ఎక్స్’ పోస్ట్‌లో వెల్లడించారు. కౌశిక్ అభిప్రాయం ప్రకారం.. ఆర్థిక ఆరోగ్యాన్ని మన దగ్గర ఉన్న డబ్బు ద్వారా కాకుండా, ఆ డబ్బు మనకు ఇచ్చే శాంతి, స్వేచ్ఛ ద్వారా కొలవాలి.
‘మీరు ప్రశాంతంగా నిద్రపోలేకపోతే, బ్యాంకులో రూ.50 లక్షలు ఉన్నా వ్యర్థం’ అని రాసుకొచ్చారు. బడ్జెట్, పొదుపు, పెట్టుబడి వంటి ఆర్థిక అలవాట్లు దురాశతో కాకుండా స్వేచ్ఛ కోసం అలవరుచుకోవాలని గుర్తుచేశారు. కౌశిక్ దృష్టిలో "ఆర్థిక స్వేచ్ఛ = మానసిక స్వేచ్ఛ". అంటే సంపద నిర్వహణ అంతిమ లక్ష్యం శాంతియుతమైన, సురక్షితమైన మనస్సు. అంతే కానీ బయటకు ప్రదర్శించేది కాదు.
ఆర్థిక పరిణతి అంటే..
“ఆర్థికంగా పరిణతి చెందిన అలవాట్లు” గురించి మరొక పోస్ట్‌లో కౌశిక్ వివరించారు. నిజమైన సంపద ఆదాయం లేదా ఆస్తులను మించి ఉందని, “ధనవంతులను నిర్వచించేది డబ్బు కాదు.. దానిని వాళ్లు ఎలా తీసుకువెళ్తారన్నదే” అని చెప్పారు. ప్రశాంతత, క్రమశిక్షణ, దీర్ఘదృష్టి.. ఇవే ఆర్థిక పరిణతి అసలైన లక్షణాలు అని వివరించారు.
ఆర్థికంగా పరిణతి చెందిన వ్యక్తుల అలవాట్లు
తమ ఆర్థిక విజయాలను ప్రదర్శించరు. నిజమైన ఇన్వెస్టర్లు (ధనవంతులు) తమ గురించి చెప్పుకోరు. అంటే, వృద్ధికి ప్రజా గుర్తింపు అవసరం లేదు.
తమ ఆర్థిక ప్రమాణాలను సమర్థించుకోరు. “పేలవమైన డబ్బు అలవాట్లకు నో చెప్పినందుకు మీరు ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు.”
విలాసాన్ని చూపించరు. “నిజమైన సంపద శాంతిని తెస్తుంది. అందరి దృష్టిని కాదు” నిజమైన ఆర్థిక భద్రత తక్కువ ప్రదర్శనలోనే ఉంటుంది.
మార్కెట్ గోలను పట్టించుకోరు. “ఆ డ్రామా (మార్కెట్ హడావుడి) నుండి దూరంగా ఉండటం దృష్టిని, పోర్ట్‌ఫోలియో రాబడిని రక్షిస్తుంది” తద్వారా భావోద్వేగ స్థిరత్వాన్ని పొందుతారు.
ధ్రువీకరణ కోసం వెతుక్కోరు. “ఉనికి, స్థిరత్వం, సహనం.. ఇవి బ్యాలెన్స్ షీట్ కంటే గొప్పవి” నిశ్శబ్ద పట్టుదల వారికి బలాన్ని ఇస్తుంది.
Real wealth = Peace of mind ☕️
Having ₹50 lakh in the bank means nothing if you can’t sleep peacefully.
Budgeting, saving, and investing are not about greed .. they’re about freedom.
Financial freedom = mental freedom.#StockMarket #IndianFinance— CA Nitin Kaushik (FCA) | LLB (@Finance_Bareek) November 7, 2025


