సంపదకు అసలైన మార్గం.. కియోసాకి మూడు సూత్రాలు! | Robert Kiyosaki Reveals His Three Most Controversial Statements | Sakshi
Sakshi News home page

సంపదకు అసలైన మార్గం.. కియోసాకి మూడు సూత్రాలు!

Jun 20 2026 3:18 PM | Updated on Jun 20 2026 3:26 PM

Robert Kiyosaki Reveals His Three Most Controversial Statements

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన పుస్తకాల్లో ఒకటి 'రిచ్ డాడ్ పూర్ డాడ్'. దీని రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) తన ఆర్థిక ఆలోచనలతో ఎంతో మంది పెట్టుబడిదారులను ప్రభావితం చేశారు. ఆయన చెప్పిన కొన్ని విషయాలు సాధారణంగా ప్రజలు నమ్మే ఆర్థిక సూత్రాలకు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా ఆయన చెప్పిన మూడు వ్యాఖ్యలు చాలా వివాదాస్పదంగా మారాయి.

మీ ఇల్లు ఒక ఆస్తి కాదు
సాధారణంగా చాలామంది తమ ఇంటిని జీవితంలో అత్యంత విలువైన ఆస్తిగా భావిస్తారు. కానీ కియోసాకి అభిప్రాయం ప్రకారం.. ఒక ఆస్తి అంటే మీ జేబులోకి డబ్బు తీసుకురావాలి. మీరు నివసిస్తున్న ఇంటి వల్ల ఆదాయం రాకపోగా, హౌస్ లోన్ EMIలు, పన్నులు, నిర్వహణ ఖర్చులు వంటి వ్యయాలు పెరుగుతాయి. అందువల్ల అది నిజమైన ఆస్తి కాదని ఆయన చెబుతారు. అయితే అద్దెకు ఇచ్చి ఆదాయం వచ్చే ఇల్లు లేదా కమర్షియల్ ప్రాపర్టీ మాత్రం ఆస్తిగా పరిగణించవచ్చని ఆయన అభిప్రాయం.

పొదుపు చేసేవారు నష్టపోతారు
సాధారణంగా డబ్బు పొదుపు చేయడం మంచి అలవాటుగా భావిస్తారు. కానీ కియోసాకి దృష్టిలో కేవలం బ్యాంకులో డబ్బు నిల్వ ఉంచడం వల్ల ద్రవ్యోల్బణం కారణంగా దాని కొనుగోలు శక్తి క్రమంగా తగ్గిపోతుంది. ఉదాహరణకు.. ఈరోజు రూ.100తో కొనగలిగే వస్తువు కొన్నేళ్ల తర్వాత రూ.120 లేదా అంతకంటే ఎక్కువ కావచ్చు. అందువల్ల డబ్బును కేవలం సేవింగ్స్ ఖాతాలో ఉంచడం కంటే పెట్టుబడుల రూపంలో పెంచుకోవాలని ఆయన సూచిస్తారు.

ధనవంతులు డబ్బు కోసం పని చేయరు
చాలామంది ఉద్యోగం చేసి జీతం సంపాదించడం ద్వారా ఆర్థిక భద్రత పొందాలని భావిస్తారు. అయితే.. కియోసాకి ప్రకారం ధనవంతులు తమ సమయాన్ని డబ్బుకు అమ్ముకోరు. వారు.. వ్యాపారాలు, పెట్టుబడులు, రియల్ ఎస్టేట్ లేదా ఇతర ఆదాయ వనరులను సృష్టించి డబ్బు తమ కోసం పనిచేసేలా చేస్తారు. అంటే, వారు ఒకసారి నిర్మించిన ఆస్తులు నిరంతరం ఆదాయం తెచ్చిపెడతాయి. అందుకే సంపన్నులు సంపాదన కోసం మాత్రమే పనిచేయకుండా, ఆదాయాన్ని సృష్టించే వ్యవస్థలను నిర్మించడంపై దృష్టి పెడతారని ఆయన వివరిస్తారు.

నిజానికి రాబర్ట్ కియోసాకి అభిప్రాయాలు అందరూ అంగీకరించకపోయినా, డబ్బు, పెట్టుబడులు, సంపద గురించి కొత్త కోణంలో ఆలోచించేలా చేస్తాయి. కేవలం సంపాదించడం లేదా పొదుపు చేయడం కాకుండా, ఆదాయాన్ని సృష్టించే ఆస్తులను నిర్మించడం ద్వారా దీర్ఘకాలిక ఆర్థిక స్వాతంత్య్రం సాధించవచ్చని ఆయన అభిప్రాయం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement