కరెన్సీ విలువ పడిపోయి... పెరుగుతున్న ఖర్చులు
ధరల భారంతో ఇంటి బడ్జెట్ తలకిందులు
తక్షణ దిద్దుబాటు చర్యలతోనే రిలీఫ్ సాధ్యం
ఎమర్జెన్సీ ఫండ్‌కి ఎస్.. భారీ రుణాలకు నో
ప్రతి ఖర్చుకీ లెక్కుండాలి.. బీమా చూసుకోవాలి
ఈక్విటీలు, పసిడిలో పెట్టుబడులు పెంచాలి
బంగారాన్ని కొనవద్దంటూ ఆంక్షలు విధించినా... దిగుమతి సుంకం అమాంతం పెంచేసినా... అదంతా మన దిగుమతుల బిల్లు భారం తగ్గించుకోవటానికే. విదేశీ ప్రయాణాలు వద్దని సాక్షాత్తూ ప్రధానమంత్రి సూచించటం ఒకెత్తయితే... దేశీయంగా పెట్రోలు వాడకాన్ని తగ్గించడానికి అందులో కలిపే ఇథనాల్ మోతాదును పెంచటం కూడా చేస్తోంది ప్రభుత్వం. పైపెచ్చు 100 శాతం ఇథనాల్ అంటూ కొత్త వాహనాలను, ఇంధనాన్ని మార్కెట్లోకి తెస్తున్నారు కూడా. ఇదంతా ఎందుకంటే దిగుమతుల బిల్లు తగ్గించుకోవటానికి.
అంతకంతకూ కరిగిపోతున్న రూపాయి విలువను కాస్తయినా పటిష్ఠంగా ఉంచడానికి. కానీ డాలర్‌తో మారకంలో రూపాయి ఇప్పటికే భారీగా పతనమైపోయింది. ఎల్రక్టానిక్ గాడ్జెట్లతో సహా తప్పనిసరిగా దిగుమతి చేసుకోవాల్సిన చాలా వస్తువుల ధరలు పైకి ఎగిశాయి. దేశీయంగా పెట్రోలు ధరలు పెరగటం ఫలితంగా చాలా వస్తువుల ధరలు పెరిగిపోయాయి. వెరసి సామాన్యుడి బడ్జెట్ తల్లకిందులయింది. ఈ నేపథ్యంలో ఏ వర్గంపై ఎలాంటి ప్రభావం పడుతోంది? వారు బయటపడాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అని వివరించేదే ఈ సాక్షి వెల్త్ స్టోరీ...
ఐటీ, ఫైనాన్స్, స్టార్టప్‌లవ్యాప్తంగా ఒకప్పుడు పుష్కలంగా కొలువులు వచి్చనా... ఇప్పుడు ఉద్యోగమే ప్రశ్నార్థకంగా మారింది. నెలంతా అప్పులతో నెట్టుకొచ్చి జీతం రాగానే చెల్లించేసే చాలా మంది వేతన జీవులకు ఈ అనిశ్చితి సమస్యాత్మకంగా ఉంటోంది. వివిధ అవసరాల కోసం తీసుకున్న రుణాల ఈఎంఐలు గుదిబండగా మారుతున్నాయి. జీతాలు పెరిగినా పెరగకపోయినా.. పెరిగిపోయే స్కూలు, కాలేజీ ఫీజులు కట్టడమెలా అని తలపట్టుకుంటున్నారు.
అటు పదవీ విరమణ చేసిన వారి సంగతి తీసుకుంటే వైద్యం ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. ఆర్థికంగా ఆసరాగా ఉంటుంది కదా అని ఫిక్స్‌డ్ డిపాజిట్లలో కాస్తో కూస్తో దాచుకున్నా.. దానిపై వచ్చే వడ్డీ అంతంతమాత్రమే. ఈ వడ్డీ పెరిగే ధరల భారాన్ని తట్టుకునేందుకు సరిపోయేట్లు ఏమాత్ర ఉండటం లేదు. ఇక చిరు వ్యాపార వర్గాలను చూస్తే.. రవాణా ఖర్చులు, మెటీరియల్ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. పైపెచ్చు వినియోగదారులు కొనుగోళ్లను తగ్గించుకుంటూ ఉండటంతో అమ్మకాలు పడిపోతూ పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతోంది.
అయిదు హెచ్చరిక సంకేతాలు..
పరిస్థితి అదుపు తప్పుతోందనడానికి ఓ అయిదు హెచ్చరిక సంకేతాలు కనిపిస్తాయి. అవి కనిపించగానే, వెంటనే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించాలి. ఇంతకీ ఆ హెచ్చరిక సంకేతాలేమిటంటే..
1. క్రెడిట్ కార్డు బాకీలను ప్రతి నెలా క్యారీ ఫార్వార్డ్ చేస్తుండటం
2. ఈఎంఐల భారం ఆదాయంలో 40 శాతానికి పైగా ఉండటం
3. అత్యవసర నిధి అంటూ లేకపోవడం
4. వచ్చే ఆదాయంలో పొదుపు మొత్తం 10% కూడా లేకపోవడం
5. ఆరోగ్య బీమా లేకపోవడం
ఇలా చేద్దాం..
పరిష్కారం 1:
ఒక ఏడాదికి సరిపడే అత్యవసర నిధి
గతంలో ఎలాంటి అత్యవసరాన్నైనా ఎదుర్కోవాలంటే ఒక ఆరు నెలల ఖర్చులకు సరిపడా దాచిపెట్టుకుంటే సరిపోయేది. కానీ జాబ్ మార్కెట్లో అనిశ్చితి నెలకొనడం, హెల్త్ ఎమర్జెన్సీలు తలెత్తుతుండటం, ధరలు పరుగులు తీస్తున్న తరుణంలో కనీసం 9–12 నెలల అవసరాలకు సరిపోయేంత మొత్తాన్ని తక్షణం తీసుకోవటానికి వీలుగా పక్కన పెట్టుకోవడం అనివార్యం. ఈ మొత్తాన్ని లిక్విడ్ ఫండ్స్, సేవింగ్స్ అకౌంట్స్, ఫిక్సిడ్ డిపాజిట్ల రూపంలో భద్రపరుచుకోవచ్చు.
పరిష్కారం 2:
కొత్త భారీ రుణాలకు దూరం..
సాధ్యమైనంత వరకు భారీ స్థాయి రుణాలకు అంటే.. లగ్జరీ కార్ లోన్స్, వ్యక్తిగత రణాలు, ఈఎంఐలతో క్రెడిట్ కార్డుల మీద పెద్ద మొత్తాల్లో కొనుగోళ్లు చేయటం వంటి వాటికి దూరంగా ఉండటం శ్రేయస్కరం. పైగా వడ్డీ రేటు అధికంగా ఉండే అప్పును తీర్చేయడం లక్ష్యంగా పెట్టుకుంటే మరీ మంచిది. వడ్డీ రూపంలో కట్టాల్సిన ఒక్క రూపాయిని ఆదా చేసినా.. పన్నుల భారం లేకుండా కాస్త అదనపు ఆదాయాన్ని అందుకున్నట్లే.
పరిష్కారం 3:
ఈక్విటీల్లో క్రమంగా పెట్టుబడులు
చారిత్రకంగా చూస్తే కరెన్సీ బలహీనపడినప్పుడల్లా బంగారం ఆదుకుంటూ వస్తోంది. పెరిగే ధరలను ఎదుర్కొనగలిగేలా ఈక్విటీలు.. అంటే షేర్లు మెరుగైన రాబడులు అందిస్తూ వస్తున్నాయి. కాబట్టి మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయనే కారణంతో పెట్టుబడులను ఆపేయకుండా సిప్ మార్గంలో ఇన్వెస్ట్ చేసే వారు.. కొనసాగిచడమే మంచిది.
పరిష్కారం 4:
బంగారంలో 10–15% పెట్టుబడి..
పసిడిలో ఎంతో కొంతైనా పెట్టుబడి పెడితే కష్టకాలంలో ఉపయోగపడుతుంది. కనుక మొత్తం పోర్ట్‌ఫోలియోలో ఓ 10–15% బంగారానికి కేటాయించండి. గోల్డ్ ఈటీఎఫ్‌లు, సావరీన్ గోల్డ్ బాండ్లలో (మళ్లీ ప్రవేశపెడితే) ఇన్వెస్ట్ చేయొచ్చు. కుటుంబ అవసరాల మేరకే ఫిజికల్ గోల్డ్ తీసుకోవచ్చు. లేకపోతే ఎల్రక్టానిక్ పద్ధతిలో కొనుక్కోవడమే శ్రేయస్కరం. సాధారణంగా రూపాయి బలహీనపడినప్పుడు, అంతర్జాతీయంగా అనిశ్చితి పెరిగినప్పుడు పసిడికి డిమాండ్ పెరుగుతుంది.
పరిష్కారం 5:
బీమా కవరేజీని సమీక్షించుకోవాలి
ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్య బీమా, అలాగే ఆర్జించే కుటుంబ సభ్యుల పేరిట టర్మ్ పాలసీని తప్పనిసరిగా తీసుకోవాలి. అంతే కాదు.. కవరేజీ కూడా సరిపోయేంతగా ఉందో లేదో చూసుకోవాలి. ఎందుకంటే, ఏదైనా సంక్షోభం ముంచుకొస్తే తప్ప చాలా మందికి .. తాము తీసుకున్న బీమా కవరేజీ.. తమ అవసరాలకు సరిపోయేంతగా లేదనే విషయం తెలియదు. కాబట్టి పాలసీ తీసుకుని మర్చిపోవడం కాకుండా.. ప్రతి సంవత్సరం కవరేజీని సమీక్షించుకుంటూ, అవసరాన్ని బట్టి పెంచుకుంటూ ఉండాలి.
పరిష్కారం 6:
కొత్త నైపుణ్యాలు..
అనిశ్చితిని ఎదుర్కొనేందుకు ఇది అన్నింటికంటే ముఖ్యమైన పరిష్కారం. 40 ఏళ్ల పైబడిన ప్రొఫెషనల్స్ ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటూ, తమను తాము అప్‌గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. ఏఐ గురించి తెలుసుకోవాలి. డిజిటల్ మార్కెటింగ్, డేటా అనలిటిక్స్, ఫైనాన్షియ్లల్ ప్లానింగ్ సర్టిఫికేషన్లు, తాము చేసే రంగాలకు సంబంధించి నైపుణ్యాలను పెంపొందించుకుంటూ ఉండాలి. తద్వారా పెట్టుబడులపై రాబడులు ఎలా ఉన్నా ఆదాయం అధికంగా ఉంటే ధరల దాడిని కొంత మేర అయినా సమర్ధంగా ఎదుర్కొనవచ్చు.
పరిష్కారం 7:
వివిధ ఆదాయ మార్గాలు
కేవలం జీతం మీదే ఆధారపడితే సరిపోదు. వేరే వేరే ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టాలి. కన్సలి్టంగ్, ఫ్రీలాన్సింగ్, కంటెంట్ క్రియేషన్, ట్యూషన్లు, ఆన్‌లైన్ సరీ్వసులు.. ఇలా అదనంగా కనీసం ఒక్క ఆదాయ మార్గమైనా పక్కన ఉంటే... ఆర్థికంగా స్ట్రెస్ కాస్త తగ్గుతుంది.
పరిష్కారం 8:
‘విదేశీ’ తగ్గించుకోవాలి
రూపాయి పతనం వల్ల విదేశీ ప్రయాణాలు, చదువులు, దిగుమతి చేసుకున్న గ్యాడ్జెట్లు.. చాలా ఖరీదైన వ్యవహారంగా మారతాయి. కాబట్టి అనవసరమైన అప్‌గ్రేడ్స్ జోలికి వెళ్లకూడదు. వీలైనంత వరకు వాయిదా వేసుకోతగిన వాటి కొనుగోళ్లను వాయిదా వేసుకోవడం మంచిది.
పరిష్కారం 9:
నాణ్యమైన కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయాలి
అనిశ్చితి నెలకొన్న వేళ.. పెట్టుబడుల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. బ్యాలెన్స్ షీటు పటిష్టంగా ఉన్నవి, స్థిరంగా క్యాష్ ఫ్లో ఉన్నవి, క్రమం తప్పకుండా డివిడెండ్లు చెల్లించే కంపెనీలను పరిశీలించి, అలాంటి షేర్లలో ఇన్వెస్ట్ చేయాలి. భారీగా రుణభారం ఉన్న స్పెక్యులేటివ్ స్టాక్స్ జోలికి పోవద్దు.
పరిష్కారం 10:
బిజినెస్‌లాగే బడ్జెట్
వ్యాపారం చేస్తుంటే ప్రతిదీ ఎలా లెక్కేస్తామో ఇంటి బడ్జెట్‌లోనూ అలాగే ఉండాలి. ఇంటి ఈఎంఐలు, పిల్లల చదువులు, వైద్య ఖర్చులు, రవాణా, వినోదం ఇలా అన్నింటినీ ట్రాక్ చేసుకుంటూ ఉండాలి. అనవసరమైన సబ్‌్రస్కిప్షన్లు, ఫుడ్ డెలివరీలు, ఆత్రం కొద్దీ కొనేసే వాటివల్ల ఎంత దుబారా అవుతోందనేది చాలా కుటుంబాలు గ్రహించవు. ఇలాంటి ఖర్చులను నివారిస్తే బోలెడు ఆదా అయినట్లే.


