సాధారణ మధ్యతరగతి కుటుంబానికి నెలవారీ బడ్జెట్‌ను నిర్వహించడం సవాలుగా మారింది. వచ్చే ఆదాయానికి, అయ్యే ఖర్చులకు పొంతన కుదర్చడానికి సామాన్యుడు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాడు. ఇప్పటికే కిరాణా సామాగ్రి, ఇంధన ధరలు, పిల్లల పాఠశాల ఫీజులు, ఈఎంఐలు, కరెంట్ బిల్లులు లాంటి యుటిలిటీ బిల్లులు గృహ ఆదాయంలో అత్యధిక భాగాన్ని మింగేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఊహించని ఖర్చుల కోసం రూపాయి దాచుకుందామన్నా సాధ్యపడటం లేదు.
ఈక్రమంలో తాజా ద్రవ్యోల్బణ గణాంకాలు సామాన్యుడు మరింత ఆందోళన చెందేలా ఉన్నాయి. భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో నమోదైన 3.48 శాతం నుంచి మే నెల నాటికి 3.93కి పెరిగింది. ప్రధానంగా ఆహార పదార్థాలు, ఇంధన ధరలు పెరగడమే ఇందుకు కారణం. కాగితంపై ఈ పెరుగుదల స్వల్పంగానే కనిపించవచ్చు. అలాగే ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నిర్దేశిత పరిమితిలోనే ఉండవచ్చు. కానీ, ఒక స్థిరమైన జీతంపై ఆధారపడే కుటుంబాలకు మాత్రం రాబోయే రోజుల్లో నిత్యావసరాలు మరింత ప్రియం కానున్నాయా అనే ఆందోళన మొదలైంది.
మళ్లీ పెరిగిన ఆహారం, ఇంధనం మంట!
సాధారణ వినియోగదారుడికి ద్రవ్యోల్బణం లెక్కలు, ఆర్థిక అంచనాలతో పెద్దగా పనిలేదు. మార్కెట్‌కు వెళ్తే కూరగాయలు, వంటనూనె ఎంతకు వస్తున్నాయి, బండిలో పెట్రోల్ కొట్టించడానికి ఎంతవుతోంది అనేదే వారి లెక్క. ఏప్రిల్‌లో 4.20 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం, మే నెలలో 4.78కు ఎగబాకింది. రవాణా ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 0.01గా ఉన్న ఉంటే మే నాటికి ఏకంగా 1.75 శాతానికి పెరిగింది.
ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నెలలోనే నాలుగు సార్లు ఇంధన ధరలను సవరించడం దీనికి ప్రధాన కారణం. రవాణా ఖర్చులు పెరిగినప్పుడు ఆ భారాన్ని వ్యాపారాలు వినియోగదారులపైకే నెట్టేస్తాయి. ఫలితంగా అన్ని రకాల వస్తువుల ధరలు అంతకంతకూ పెరుగుతాయి. ‘మే నెలలో రిటైల్ వినియోగదారులు టోకు ద్రవ్యోల్బణ తీవ్రత నుంచి కొంతవరకు తప్పించుకున్నప్పటికీ.. రెస్టారెంట్లు, వంట గ్యాస్, రవాణా వంటి రంగాలలో అప్పుడే ధరల ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోంది’ అని పిరమల్ గ్రూప్ చీఫ్ ఎకనామిస్ట్ దేబోపమ్ చౌధురి అన్నారు. గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లోనే ద్రవ్యోల్బణం వేగంగా పెరుగుతోంది. ఇది పట్టణ మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తిని హరిస్తూ మార్కెట్‌లో డిమాండ్‌ను తగ్గిస్తోంది.
భవిష్యత్తు మరింత భారమేనా?
ప్రస్తుత ద్రవ్యోల్బణ గణాంకాలు అంచనాలకు లోబడే ఉన్నప్పటికీ ధరల ఒత్తిడి మాత్రం పెరుగుతోందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎలారా క్యాపిటల్ డిప్యూటీ హెడ్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఎకనామిస్ట్ గరిమా కపూర్ మాట్లాడుతూ.. ‘ఇంధనం, ఆహార ధరల ప్రభావం ఉన్నప్పటికీ మే నెల సీపీఐ ద్రవ్యోల్బణం అంచనాల కంటే కొంచెం తక్కువగానే నమోదైంది. పశ్చిమాసియా సంక్షోభ పరిష్కారం దిశగా అడుగులు పడటం, ఆర్‌బీఐ-ప్రభుత్వ చర్యల వల్ల స్థూల ఆర్థిక నేపథ్యం ప్రస్తుతం కాస్త అనుకూలంగా మారింది. అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీనిని అదుపు చేయడానికి ఆర్‌బీఐ వడ్డీ రేట్లను మరో 50 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశం ఉంది’ అని విశ్లేషించారు.
ఇదీ చదవండి: ఒక్కసారిగా బంగారం ధరలు రివర్స్.. తెలుగు రాష్ట్రాల్లో..


