రూ.3.70 లక్షల కోట్ల టర్నోవర్‌.. దూసుకెళ్తున్న రిలయన్స్ రిటైల్! | Reliance Retail Posts Strong FY26 Growth Revenue Surges to Rs 3 7 Lakh Crore | Sakshi
Sakshi News home page

రూ.3.70 లక్షల కోట్ల టర్నోవర్‌.. దూసుకెళ్తున్న రిలయన్స్ రిటైల్!

Jun 19 2026 7:52 PM | Updated on Jun 19 2026 8:14 PM

Reliance Retail Posts Strong FY26 Growth Revenue Surges to Rs 3 7 Lakh Crore

రిటైల్ రంగంలో వేగంగా విస్తరిస్తున్న సంస్థల్లో.. ఒకటైన రిలయన్స్ రిటైల్ FY26లో కూడా తన వృద్ధిని కొనసాగించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 49వ వార్షిక సర్వసభ్య సమావేశంలో 'ఇషా అంబానీ' దీనికి సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు.

కంపెనీ FY26లో రూ.3,70,026 కోట్ల గ్రాస్ రెవెన్యూ నమోదు చేసింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 11.8 శాతం ఎక్కువ. లాభాల పరంగా కూడా కంపెనీ బలమైన ప్రదర్శన కనబరిచింది. నికర లాభం 12 శాతం పెరిగి రూ.13,838 కోట్లకు చేరింది. ఈ గణాంకాలు కంపెనీ స్థిరమైన వృద్ధిని కొనసాగిస్తున్నట్లు సూచిస్తున్నాయని ఇషా అంబానీ వెల్లడించించారు.

ప్రస్తుతం రిలయన్స్ రిటైల్‌కు 38.7 కోట్ల రిజిస్టర్డ్ కస్టమర్లు ఉన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 11 శాతం ఎక్కువ. అంతే కాకుండా.. కంపెనీ ఈ ఏడాది సుమారు 1.93 బిలియన్ ట్రాన్సాక్షన్లను ప్రాసెస్ చేసింది, ఇది 39 శాతం వృద్ధిని సూచిస్తుంది. వినియోగదారుల నమ్మకం, వినియోగం రెండూ పెరుగుతున్నాయని ఇది స్పష్టం చేస్తోంది.

రిలయన్స్ రిటైల్‌లో భాగమైన స్మార్ట్ బజార్ కూడా వేగంగా విస్తరిస్తోంది. ఇది దేశవ్యాప్తంగా 1,000 స్టోర్ల మైలురాయిని దాటింది. ముఖ్యంగా టైర్-2, చిన్న పట్టణాలపై దృష్టి పెట్టడం ద్వారా కంపెనీ తన మార్కెట్‌ను గ్రామీణ, అర్బన్ ప్రాంతాలకు కూడా విస్తరిస్తోంది.

వ్యవసాయ రంగంలో కూడా రిలయన్స్ రిటైల్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ ఏడాది కంపెనీ సుమారు 5.7 లక్షల మెట్రిక్ టన్నుల తాజా పండ్లు, కూరగాయలను 40,000కు పైగా రైతుల నుంచి సేకరించింది. ఇది 110 సేకరణ కేంద్రాల ద్వారా జరిగింది. ఈ వ్యవస్థ వల్ల రైతులకు మెరుగైన ధరలు లభించడమే కాకుండా.. వినియోగదారులకు కూడా తక్కువ ధరల్లో ఉత్పత్తులు అందుతున్నాయి.

ఇక డిజిటల్ కామర్స్ రంగంలో జియోమార్ట్ వేగంగా ఎదుగుతోంది. ఇది ప్రస్తుతం 3,100కు పైగా స్టోర్ల ద్వారా సేవలు అందిస్తోంది. 1,200కు పైగా నగరాలు, 5,100 పిన్‌కోడ్‌లకు విస్తరించడం ద్వారా దేశవ్యాప్తంగా తన పరిధిని పెంచుకుంది. రోజువారీ ఆర్డర్లు 3.6 రెట్లు పెరగగా, రిపీట్ ఆర్డర్లు 6 రెట్లు పెరగడం వినియోగదారుల నమ్మకాన్ని సూచిస్తోంది.

కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో కూడా రిలయన్స్ రిటైల్ బలమైన స్థానం సంపాదించింది. రోజుకు సగటున 2,500 మొబైల్ ఫోన్లు, 4,000 టీవీలు, 8,000 గృహోపకరణాలు, 1,600 ల్యాప్‌టాప్‌లు విక్రయిస్తున్నట్లు ఇషా అంబానీ తెలిపారు.

రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL) FY26లో రూ.22,000 కోట్ల రెవెన్యూ సాధించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే రెండింతల వృద్ధిని సూచిస్తుంది. ప్రస్తుతం ఈ ఉత్పత్తులు 40కుపైగా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. దీని ద్వారా రిలయన్స్ రిటైల్ కేవలం దేశీయ మార్కెట్‌కే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా తన ఉనికిని పెంచుతోంది. మొత్తం మీద.. రిలయన్స్ రిటైల్ FY26లో అన్ని విభాగాల్లో బలమైన వృద్ధిని నమోదు చేసిందని తెలుస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement