భారతీయ రిజర్వ్ బ్యాంకు(ఆర్‌బీఐ) మూడేళ్లకుపైగా స్థిరంగా ఉంచుతూ వచ్చిన రెపోరేటును పెంచుతూ ఈరోజు నిర్ణయం తీసుకుంది. దాంతో 5.25 శాతంగా ఉన్న రెపోను 25 బేసిస్ పాయింట్లకు పెంచి 5.5 శాతంగా చేసింది. ఈ సందర్భంగా ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా రేట్ల పెంపునకుగల కారణాలు తెలియజేశారు. దాంతోపాటు ఇతర ఆర్థిక అంశాలు ప్రస్తావించారు. ఆ విషయాలు చూద్దాం.
ఆర్‌బీఐ పాలసీ సమావేశం.. ముఖ్యాంశాలు
పశ్చిమాసియా యుద్ధం, ముడి చమురు ధరల పెరుగుదల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ప్రతికూల అంశాలుగా మారాయని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. సెప్టెంబర్‌లో పశ్చిమాసియా వివాదం అనూహ్యంగా మళ్లీ ప్రారంభం కావడంతో ముడి చమురు ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు చోటుచేసుకున్నాయి. చమురు ధరల అస్థిరతతో ప్రపంచ మార్కెట్లలో ఆందోళన పెరిగి ఆర్థిక మార్కెట్లలో ఒడిదుడుకులు ఎక్కువయ్యాయి. ప్రపంచ ఆర్థిక వృద్ధి కొంతమేర స్థిరంగా ఉన్నప్పటికీ 2026లో వృద్ధి గత ఏడాదితో పోలిస్తే తగ్గే అవకాశం ఉందని అంచనా.
ద్రవ్యోల్బణం పెరిగితే ప్రధాన దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను మరింత కఠినతరం చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. దీర్ఘకాలంగా కొనసాగుతున్న వాణిజ్య అనిశ్చితి, అభివృద్ధి చెందిన దేశాల్లో పెరుగుతున్న బాండ్ రాబడులు, బలపడుతున్న డాలర్ ప్రపంచ ఆర్థిక మార్కెట్లపై ఒత్తిడి పెంచుతున్నాయి.
ప్రపంచ ఆర్థిక పరిస్థితులు మరింత కఠినంగా మారే అవకాశం ఉంది. ఏఐ కంపెనీల షేర్ల విలువలపై అనిశ్చితి, పశ్చిమాసియా వివాదానికి పరిష్కారం కనిపించకపోవడం వంటి అంశాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరం. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఇంధన ధరలు, సరఫరా వ్యవస్థపై ఒత్తిళ్లు కొనసాగుతున్నాయి. అయితే ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలను పెంచడం వల్ల ప్రతికూల ప్రభావం కొంతమేర తగ్గుతోంది.
నైరుతి రుతుపవనాల లోటు, బలమైన ఎల్‌నినో పరిస్థితులు వ్యవసాయ రంగానికి, గ్రామీణ డిమాండ్‌కు ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది. అయితే దేశంలో ఆహార ధాన్యాల నిల్వలు సమృద్ధిగా ఉండటం, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఈ ప్రభావాన్ని తగ్గించగలవు. సేవల రంగంలో కొనసాగుతున్న వృద్ధి, స్థిరంగా ఉన్న ఉపాధి పరిస్థితులు పట్టణ ప్రాంతాల్లో వినియోగ డిమాండ్‌కు మద్దతు ఇస్తాయి.
అధిక సామర్థ్య వినియోగం, రుణాల లభ్యత పెరగడం, మౌలిక సదుపాయాలపై ప్రభుత్వ దృష్టి కారణంగా పెట్టుబడుల కార్యకలాపాలు కొనసాగుతాయని సంజయ్ చెప్పారు. సేవల ఎగుమతులు బలంగా కొనసాగుతాయని, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల ద్వారా వస్తువుల ఎగుమతులు కూడా పెరిగే అవకాశం ఉందని తెలిపారు.
ఆహారం, ఇంధన ధరల పెరుగుదల కారణంగా ద్రవ్యోల్బణం పెరిగిందని మల్హోత్రా పేర్కొన్నారు. ధరల ఒత్తిడి ఇతర రంగాలకు కూడా విస్తరిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయని చెప్పారు. చక్కెర, ఉల్లి వంటి కొన్ని ఆహార వస్తువుల ధరలు గణనీయంగా పెరిగాయని తెలిపారు.
ఆగస్టులో ఇంధన ద్రవ్యోల్బణం పెరగడానికి ప్రతికూల బేస్ ఎఫెక్ట్ కూడా ఒక కారణమని వివరించారు. ఆగస్టులో ప్రధాన ద్రవ్యోల్బణం 4.2 శాతానికి పెరిగింది. విలువైన లోహాలను మినహాయించిన ప్రధాన ద్రవ్యోల్బణం 2.9 శాతానికి చేరిందని తెలిపారు.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వ్యాఖ్యలు, ప్రపంచంలోని కీలక కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను కఠినతరం చేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా అధిక వడ్డీ రేట్లు కొనసాగుతాయనే అంచనాలు బలపడ్డాయని మల్హోత్రా చెప్పారు. అయినప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని, దేశ ఆర్థిక వృద్ధి అన్ని రంగాల్లో విస్తృతంగా కొనసాగుతోందని ఆర్‌బీఐ గవర్నర్ తెలిపారు.
ఇదీ చదవండి: దిగొచ్చిన బంగారం ధరలు.. ఇదే మంచి సమయం!


