కరెన్సీ కొత్త అవతార్‌! | Is RBI To Replace Indian Paper Currency Notes With Plastic Currency From June 2026? Read Full Story For More Details | Sakshi
Sakshi News home page

కరెన్సీ కొత్త అవతార్‌!

Jun 11 2026 5:03 AM | Updated on Jun 11 2026 11:03 AM

RBI to replace Indian paper currency notes with plastic currency june 2026

నోటు ప్లాస్టిక్‌ రూటు?

పాలిమర్‌ నోట్లపై ఆర్బీఐ బిగ్‌ ప్లాన్‌ 

భారీ ముద్రణ వ్యయానికి అడ్డుకట్టే లక్ష్యం

ప్రతిపాదనలపై త్వరలో నిర్ణయం! 

నకిలీలకు ఇక నో ఎంట్రీ.. పేపర్‌ కరెన్సీ సమస్యలకు చెక్‌..

భారత్‌లో ఇక ప్లాస్టిక్‌ నోట్లు రెపరెపలాడనున్నాయా? కాగితపు కరెన్సీ నోట్లకు బదులుగా ఎక్కువ కాలం మన్నే ప్లాస్టిక్‌ నోట్లను ప్రవేశపెట్టడంపై రిజర్వు బ్యాంక్‌ (ఆర్‌బీఐ) మళ్లీ కసరత్తు చేస్తుండటంతో ఇప్పుడు అందరినోటా ఇదే టాక్‌ నడుస్తోంది. పదేళ్ల క్రితం పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటల్‌ లావాదేవీలు భారీగా పెరిగినప్పటికీ.. కరెన్సీ వాడకం కూడా అంతకంతకూ ఎగబాకుతోంది. దీంతో ముద్రణ, నిర్వహణ ఖర్చు తడిసిమోపెడవుతోంది. ఏటా సుమారు రూ.5,000–6,000 కోట్లు వెచి్చంచాల్సి వస్తోంది. దీనికితోడు పేపర్‌ నోట్లు త్వరగా పాడైపోతుండటం, ఏటీఎంలలో వాడకం సమస్యలు, నకిలీ నోట్ల బెడదకు చెక్‌ చెప్పేందుకు పాలిమర్‌ నోట్లే ప్రత్యామ్నాయంగా కనబడుతున్నాయి.  

దేశంలో కరెన్సీ నోట్ల రూపురేఖలు మారిపోయే అవకాశం కనిపిస్తోంది. ఆర్‌బీఐ తాజా పాలసీ సమీక్షలో గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా వ్యాఖ్యలతో ప్లాస్టిక్‌ నోట్లపై మరోసారి తీవ్ర చర్చకు తెరలేచింది. ఈ ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామని,  తుది నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే, పాలిమర్‌ నోట్ల అమలుపై సాధ్యాసాధ్యాలు, లాభనష్టాలను బేరీజు వేయడానికి త్వరలో ఆర్‌బీఐ పైలట్‌ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు సమా చారం. ఇది సక్సెస్‌ అయితే, భారత్‌ కూడా పాలిమర్‌ నోట్ల యుగంలోకి అడుగుపెట్టేందుకు లైన్‌క్లియర్‌ అవుతుంది. 

పాలిమర్‌ నోట్లు అంటే... 
కాగితంతో కాకుండా ప్రత్యేకమైన పాలీప్రొపిలీన్‌ మెటీరియల్‌తో తయారు చేసే కరెన్సీని పాలిమర్‌ (ప్లాస్టిక్‌) నోట్లుగా వ్యవహరిస్తారు. ఇవి పేపర్‌ నోట్లతో పోలిస్తే ఎక్కువకాలం మన్నుతాయి. తడి, దుమ్మూ ధూళి వంటి వాతావరణ పరిస్థితుల్లోనూ త్వరగా పాడైపోకుండా ఉంటాయి. దీనివల్ల తరచుగా కరెన్సీ నోట్లను మార్చాల్సిన అవసరం తగ్గుతుంది. నగదు వాడకం అధికంగా ఉండటం, రకరకాల భౌగోళిక, వాతావరణ పరిస్థితులున్న మన దేశంలో ఇవి బాగా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. తొలుత ప్లాస్టిక్‌ నోట్ల ముద్రణ ఖర్చు కాస్త ఎక్కువగానే ఉన్నా.. వాడుకలో కరెన్సీ నిర్వహణ వ్యయం భారీగా దిగొస్తుందని పేర్కొంటున్నారు. అలాగే, బ్యాంకులు, ఏటీఎంలలో కరెన్సీ నిర్వహణ కూడా సులువవుతుంది. మరోపక్క, పాలిమర్‌ నోట్లతో నకిలీ కరెన్సీకి చెక్‌ చెప్పవచ్చని భావిస్తున్నారు. హోలోగ్రాఫిక్‌ అంశాలు, పలు రక్షణ పొరల వంటి అధునాతన భద్రతా ఫీచర్లను పకడ్బందీగా జోడించడం వల్ల నకిలీ ప్లాస్టిక్‌ నోట్ల తయారీ దాదాపు అసాధ్యమనేది బ్యాంకింగ్‌ వర్గాల మాట. 

క్యాష్‌ ఈజ్‌ కింగ్‌... 
యూపీఐ, డిజిటల్‌ పేమెంట్స్‌ రోజుకో కొత్త రికార్డులు సృష్టిస్తున్నప్పటికీ.. ప్రజలు క్యాష్‌ వాడకంలోనూ తగ్గేదేలే అంటున్నారు. ఈ ఏడాది మార్చి నాటికి మొత్తం చెలామణిలో ఉన్న కరెన్సీ (నోట్లు, కాయిన్లు).. అంటే సీఐసీ (కరెన్సీ ఇన్‌ సర్క్యులేషన్‌) రూ.41.68 లక్షల కోట్లకు చేరింది. 2024–25తో పోలిస్తే 12% దూసుకెళ్లింది.  మరోపక్క, ప్రజల వద్దనున్న కరెన్సీ విలువ (క్యాష్‌ విత్‌ పబ్లిక్‌–సీడబ్ల్యూపీ) ఈ ఏడాది మార్చి నాటికి రూ.40.52 లక్షల కోట్లకు పెరిగింది. అంటే మొత్తం చెలామణిలో ఉన్న కరెన్సీలో ప్రజల చేతిలో ఉన్నది 97 శాతమన్నమాట! 

గతంలోనే ప్రయోగం, కానీ... 
భారత్‌లో పాలిమర్‌ నోట్ల ఆలోచన కొత్తదేమీ కాదు. 2012లోనే వీటిపై ప్రయోగం జరిగింది. 2014 ఫిబ్రవరిలో ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపిన వివరాల ప్రకారం.. భౌగోళికంగా, వాతావరణపరంగా అయిదు విభిన్న నగరాల్లో (కొచి్చ, మైసూరు, జైపూర్, సిమ్లా, భువనేశ్వర్‌) రూ.10 విలువైన వంద కోట్ల ప్లాస్టిక్‌ నోట్లను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. అయితే సాంకేతిక, నిర్వహణ సమస్యల కారణంగా ఆ ప్రయత్నం ముందుకు సాగలేదు. ఇప్పుడు మళ్లీ పాలిమర్‌ నోట్ల ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు. అయితే ఇది అమలులోకి వస్తుందా? ఎప్పుడు వస్తుంది? అన్నది ఆర్‌బీఐ తుది నిర్ణయం తర్వాతే తేలుతుంది.

ఎగబాకుతున్న ఖర్చు... 
పాలిమర్‌ నోట్లపై ఫోకస్‌ చేయడానికి ప్రధాన కారణం మన్నిక ఒక్కటే కాదు, ఖర్చు తగ్గించుకోవడం కూడా. దేశంలో కరెన్సీ నోట్ల ముద్రణ, రవాణా, పదేపదే చేతులు మారడం, మడత పెట్టడం వల్ల చిరిగిపోయి, పాడైన నోట్లను తొలగించి కొత్త వాటితో భర్తీ చేయడం వంటి పనులకు ఖజానాపై భారీగా భారం పడుతోంది. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం 2024–25లో 2,380 కోట్ల పాడైన నోట్లను చెలామణి నుంచి తొలగించి ధ్వంసం చేయాల్సి వచి్చంది. 2024–25లో నోట్ల ప్రింటింగ్‌ వ్యయం రూ.6,373 కోట్లకు ఎగబాకింది.

ఖర్చెంత? 
ఇప్పుడున్న రూ.500 పేపర్‌ నోట్ల విషయానికొస్తే, ఒక్కో నోటు తయారీ ఖర్చు సుమారుగా రూ.2.29 అవుతోంది. అత్యధికంగా రూ. 200 నోటు తయారీకి రూ.2.93 చొప్పున వెచి్చంచాల్సి వస్తోంది. రూ.10 నోటుకు రూ.1.01 పడుతోంది. అదే ప్లాస్టిక్‌ కరెన్సీకి 2–3 రెట్లు ఎక్కువ ఖర్చవుతుందని అంచనా. ఇక మన్నిక సంగతి చూస్తే, పేపర్‌ నోటుతో పోలిస్తే (డినామినేషన్‌ను బట్టి సాధారణంగా 2 నుంచి 7 ఏళ్లు)... పాలిమర్‌ నోటు జీవితకాలం 4–5 రెట్లు ఎక్కువగా ఉంటుందని అంచనా.

   – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement