మూడేళ్లలో మెదటిసారి వడ్డీ రేట్లను పెంచిన ఆర్‌బీఐ | RBI Hikes Repo Rate by 25 bps Governor Sanjay Malhotra announce | Sakshi
Sakshi News home page

కీలక వడ్డీ రేట్లను పెంచిన ఆర్‌బీఐ

Oct 7 2026 10:04 AM | Updated on Oct 7 2026 10:41 AM

RBI Hikes Repo Rate by 25 bps Governor Sanjay Malhotra announce

ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత బెంచ్‌మార్క్ వడ్డీ రేటైన రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం అధికారికంగా ప్రకటించారు. దాంతో రెపోరేటు 5.25 నుంచి 5.5కు చేరింది. ఈ నిర్ణయంతో కీలక రేట్లు పెరిగి, గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై ఈఎంఐల భారం మరింత పడనుంది.

ముంబైలోని ఆర్‌బీఐ ప్రధాన కార్యాలయంలో ముగిసిన మూడ్రోజుల ఎంపీసీ ద్వైమాసిక సమావేశ నిర్ణయాలను గవర్నర్ ఉదయం వెల్లడించారు. ఫిబ్రవరి 2023 తర్వాత ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచడం మళ్లీ ఇదే తొలిసారి. తాజా పెంపుతో బ్యాంకింగ్ వ్యవస్థలో వడ్డీ రేట్ల సరళి మారనుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఆర్‌బీఐ నిర్ణయం వెనుక ఆర్థిక కారణాలు

ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం

ఆర్‌బీఐకి ఉన్న అత్యంత ముఖ్యమైన బాధ్యతల్లో ధరల స్థిరత్వాన్ని కాపాడటం ఒకటి. నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాలు, ఇంధన ధరలు పెరిగినప్పుడు ద్రవ్యోల్బణం హెచ్చుతగ్గులకు లోనవుతుంది. రెపో రేటు పెంచినప్పుడు వాణిజ్య బ్యాంకులు ఆర్‌బీఐ వద్ద తీసుకునే రుణాలపై ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. దీంతో బ్యాంకులు సాధారణ ప్రజలకు, వ్యాపారవేత్తలకు ఇచ్చే రుణాల వడ్డీ రేట్లను పెంచుతాయి.

రుణాల వడ్డీలు ప్రియం కావడంతో ప్రజలు కార్లు, ఇళ్లు, ఇతర వస్తువుల కొనుగోళ్లను కొంతకాలం వాయిదా వేసుకుంటారు లేదా రుణాలు తీసుకోవడం తగ్గిస్తారు. మార్కెట్లో కొనుగోలు శక్తి తగ్గడంతో వస్తువులకు డిమాండ్ తగ్గి, ధరలు అదుపులోకి వస్తాయి.

అంతర్జాతీయ అనిశ్చితులు.. క్రూడాయిల్‌ ధరలు

ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఏర్పడినప్పుడు చమురు ధరలు, దిగుమతి వ్యయం పెరుగుతాయి. దీనివల్ల దేశీయంగా రవాణా ఛార్జీలు పెరిగి అన్ని వస్తువుల ధరలూ ఎక్కువవుతాయి. ఈ అంతర్జాతీయ ఒత్తిళ్ల ప్రభావం మన ఆర్థిక వ్యవస్థపై పడకుండా ముందస్తు జాగ్రత్తగా ఆర్‌బీఐ కఠిన ద్రవ్య పరపతి విధానాన్ని ఎంచుకుంటుంది.

రూపాయి విలువ పతనాన్ని అరికట్టడం

అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల కేంద్రీయ బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచినప్పుడు విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ పడిపోతుంది. ఆర్‌బీఐ ఇక్కడ వడ్డీ రేట్లను పెంచడం ద్వారా విదేశీ పెట్టుబడులు బయటకు పోకుండా ఆపి రూపాయి విలువ స్థిరంగా ఉండేలా చూస్తుంది.

ఆర్థిక వ్యవస్థపై ప్రభావం

ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతున్న సమయంలో విపరీతమైన నగదు ప్రవాహం వల్ల మార్కెట్‌లో ఆస్తుల ధరలు అసాధారణంగా పెరిగే ప్రమాదం ఉంటుంది. స్థిరమైన, దీర్ఘకాలిక వృద్ధిని నిర్ధారించడానికి ఆర్‌బీఐ ఈ తరహా రేట్ల పెంపును ఒక బ్రేక్‌లా ఉపయోగిస్తుంది. ఆర్‌బీఐ ఉద్దేశం రుణాలను భారం చేయడం కాకపోయినా, ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచి రూపాయి కొనుగోలు శక్తిని కాపాడటానికి వడ్డీ రేట్ల పెంపును ఒక ఆయుధంగా ఉపయోగిస్తుంది.

ఇదీ చదవండి: 5జీ ప్రియం.. 4జీ పునరుజ్జీవం..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement