
సుంకాలు భరించడం యూఎస్ వల్ల కూడా కాదు
ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్
భారత్, బ్రెజిల్ దేశాలపై యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 50 శాతం సుంకాలు ఆచరణ సాధ్యం కాదని, రాజకీయంగా ప్రమాదకరమని ప్రముఖ ఆర్థికవేత్త రఘురామ్ రాజన్ అమెరికా వాణిజ్య విధానాన్ని తీవ్రంగా విమర్శించారు. బ్రెజిల్ ఫైనాన్షియల్ పబ్లికేషన్ వాలర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజన్ మాట్లాడారు. యూఎస్ అనుసరిస్తున్న ఈ చర్య దీర్ఘకాలిక దౌత్య, ఆర్థిక సంబంధాలను దెబ్బతీసేలా ఉందని చెప్పారు.
అమెరికా వ్యతిరేకిగా ముద్ర
రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులను కొనసాగిస్తున్నందుకు శిక్షగా పేర్కొంటూ ట్రంప్ ఇటీవల భారీ సుంకాలను ప్రకటించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరో బ్రిక్స్ సభ్యదేశమైన బ్రెజిల్‌పై ట్రంప్ ‘అమెరికా వ్యతిరేకి’గా ముద్ర వేసి ఇలాంటి సుంకాలు విధించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్, ప్రస్తుతం చికాగో విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న రఘురామ్ రాజన్ ఈ విధానాన్ని తీవ్రంగా విమర్శించారు.
యూఎస్‌కు భారత్ భయపడితే..
‘తలకు తుపాకీ గురిపెట్టి వాణిజ్య సంప్రదింపులు జరపడం కష్టం. ఇప్పుడు జరుగుతున్నది అదే. ఇవి వాణిజ్య సంప్రదింపులు కావు. అధికార ప్రయోగం. ఇండియా ఈ విషయంలో సుదీర్ఘ చర్చలు కోరుకుంది. అందుకు భిన్నంగా అకస్మాత్తుగా దాడి చేయడం సరికాదు. రష్యా నుంచి భారత్ చేసే చమురు కొనుగోళ్లపై ఒత్తిడి పెంచేందుకు అమెరికా ఇలా సుంకాలతో బయపెట్టాలనుకోవడం తగదు. ఈ తీరు రాజకీయ ప్రతిఘటనను సృష్టిస్తుంది. రష్యా నుంచి కొనుగోళ్లను నిలిపివేయాలని భారత్ నిర్ణయం తీసుకుంటే అమెరికా ఒత్తిడికి తలొగ్గినట్లు అవుతుంది. ఇది ప్రజాస్వామ్యంలో చెడు సంకేతాలకు దారితీస్తుంది’ అన్నారు.
ఇదీ చదవండి: తగ్గి తగ్గనట్లు తగ్గిన బంగారం ధర!
యూఎస్‌కు కూడా నష్టమే..
‘అమెరికా అనుసరిస్తున్న దూకుడు సుంకాల వల్ల ఆర్థిక పతనం ఏకపక్షంగా ఉండదు. అమెరికాకు 80 బిలియన్ డాలర్ల వరకు భారత ఎగుమతులు లాభసాటిగా ఉండవు. ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానం కలిగిన యాపిల్ వంటి సంస్థల ఉత్పత్తులపై అమెరికా ప్రతీకార సుంకాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 50 శాతం సుంకాలు భరించడం భారత్‌కు మాత్రమే కాదు, వ్యూహాత్మక భాగస్వామిగా ఉంటుందని భావిస్తున్న అమెరికాకు కూడా సాధ్యం కాదు. ఈ విషయాలను ప్రజలు చాలా కాలం గుర్తుంచుకుంటారు. యూఎస్ నేడు ఒక దేశంపై, రేపు మరో దేశంపై 50 శాతం సుంకాలు విధిస్తూపోతే అనిశ్చితి వాణిజ్యం, పెట్టుబడులకు విఘాతం కలుగుతుంది’ అని రాజన్ హెచ్చరించారు.