సేల్స్‌లో ప్రైవేట్ లేబుల్స్ వాటా రెట్టింపు
కస్టమర్‌ను నిలబెట్టుకునేందుకు కంపెనీల వ్యూహం
స్టేపుల్స్ నుంచి ప్రీమియం ఫుడ్స్, ఫ్రెష్ ప్రొడక్ట్స్ వరకు విస్తరణ
16 శాతానికి పెరిగిన ప్రైవేట్ లేబుల్స్ వాటా
35 నుంచి 45 శాతం వరకు మార్జిన్లు
థర్డ్ పార్టీ బ్రాండ్లతో పోలిస్తే దాదాపు రెట్టింపు
క్విక్ కామర్స్‌లో పోటీ ఇప్పుడు వేగంగా డెలివరీ చేయడానికే పరిమితం కావడం లేదు. ఎక్కువ మార్జిన్లు, ధరలపై నియంత్రణ, సరుకుల లభ్యత, కస్టమర్‌ను తమ ప్లాట్‌ఫామ్‌లోనే కొనసాగించడం కోసం సంస్థలు సొంత బ్రాండ్లపై దృష్టి పెడుతున్నాయి. దీంతో క్విక్ కామర్స్ విక్రయాల్లో ప్రైవేటు లేబుల్స్ వాటా గణనీయంగా పెరుగుతోంది. 2025లో ప్రారంభంలో 6 శాతం ఉన్న వాటా ప్రస్తుతం 16 శాతానికి చేరినట్లు పరిశ్రమ వర్గాల అంచనా.
స్టేపుల్స్ నుంచే శ్రీకారం
సొంత బ్రాండ్ల విస్తరణకు ముందుగా పప్పులు, బియ్యం, పిండి, నూనెలు వంటి రోజువారీ నిత్యావసరాలనే (స్టేపుల్ ఫుడ్)క్విక్ కామర్స్ కంపెనీలు ఎంచుకుంటున్నాయి. తర్వాత ప్రీమియం స్నాక్స్, కూల్‌డ్రింక్స్, డ్రైఫ్రూట్స్, వెజిటబుల్స్ విభాగాల్లోకి అడుగుపెడుతున్నాయి. టాటా గ్రూప్‌నకు చెందిన బిగ్ బాస్కెట్ ఈవిషయంలో పోటీ కంపెనీలకన్నా ముందుంది. ప్రైవేట్‌లేబుల్స్ మొత్తం ఆదాయంలో దాదాపు 35 శాతం వాటాను బిగ్‌బాస్కెట్ కలిగి ఉంది. బీబీ పాపులర్, బీబీ రాయల్, బీబీ హోమ్, ఫ్రెషో వంటి బ్రాండ్లు విభిన్న విభాగాల్లో దూసుకుపోతున్నాయి.
ఇన్‌స్టామార్ట్ జోరు
క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో స్విగ్గీకి చెందిన ఇన్‌స్టామార్ట్ సొంత బ్రాండ్ల విషయంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. సుప్రీమ్ హార్వెస్ట్ బ్రాండ్‌ను 2022లో ప్రారంభించింది. ప్రస్తుతం ఇన్‌స్టామార్ట్‌లో విక్రయించే స్టేపుల్స్‌లో దీని వాటా 25 శాతం. ఏడాది క్రితం ఇది 18 శాతమే. ఉరద్ దాల్ (మినప్పప్పు) అమ్మకాల్లో సుప్రీమ్ హార్వెస్ట్ వాటా 28 శాతం పైగానే. మైదాలో 51 శాతం, రైస్‌ఫ్లోర్‌లో 58 శాతం వాటా ఉంది.
జెప్టోకు చెందిన డైలీ గుడ్ కూడా స్టేపుల్స్‌లో 14 శాతం వాటా సాధించింది. ఉరద్ దాల్, పల్లీలు, కిస్మిస్ విక్రయాలు ఈ బ్రాండ్ నుంచే వస్తున్నాయి. సోయాబీన్ నూనెల్లో 16 శాతం, సన్‌ఫ్లవర్ ఆయిల్ అమ్మకాల్లో డైలీ గుడ్ 5 శాతం వాటా సాధించింది.
ఆచితూచి వ్యవహరిస్తున్న బ్లింకిట్
ఎటర్నల్ (జొమాటో)కు చెందిన బ్లింకిట్ ప్రైవేట్ లేబుల్ ’హోల్ ఫార్మ్’ మాత్రం కొంత నియంత్రిత విధానాన్ని అనుసరిస్తోంది. వినియోగదారులు బ్రాండ్ గురించి పెద్దగా పట్టించుకోని మిల్లెట్స్, ప్రత్యేక స్టేపుల్స్ వంటి విభాగాలపై మాత్రమే దృష్టి పెట్టింది. బార్లీ, వైట్ మటర్ అమ్మకాల్లో హోల్‌ఫార్మ్ 62 శాతం వాటా సాధించింది. అయితే పప్పులు, డ్రైఫ్రూట్స్ విభాగాల్లో దీని ఉనికి పరిమితంగానే ఉంది. కస్టమర్లకు ఎక్కువ రకాల ఉత్పత్తులను యాప్ ద్వారా అందుబాటులో ఉంచడానికే బ్లింకిట్ ప్రాధాన్యం ఇస్తోంది.
రెట్టింపు మార్జిన్లే కీలకం
సొంత బ్రాండ్లపై క్విక్ కామర్స్ సంస్థలకు ఎందుకు ఆసక్తి అంటే అధిక లాభాలే..కంపెనీలకు స్టేపుల్స్‌లో ప్రైవేట్ లేబుల్స్ ద్వారా 15 నుంచి 25 శాతం మార్జిన్లు వస్తున్నాయి. థర్డ్ పార్టీ బ్రాండ్లతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు. అదే సమయంలో తక్కువ ధరలతో కస్టమర్లను ఆకర్షించి భారీ విక్రయాలు సాధించే వ్యూహాన్ని కూడా ఇవి అనుసరిస్తున్నాయి. సుప్రీమ్ హార్వెస్ట్ చనా దాల్ కేటగిరీ సగటు ధర కంటే దాదాపు 30 శాతం తక్కువగా ఉంటుంది. డైలీగుడ్ మస్టర్డ్ ఆయిల్ థర్డ్ పార్టీ బ్రాండ్ కన్నా 37 శాతం తక్కువ ధరకు, హోల్‌ఫార్మ్ రాగి పిండి 29 శాతం తక్కువ ధరకు కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి.
స్నాక్స్, డ్రింక్స్‌లోనూ ఎంట్రీ
క్విక్ కామర్స్ కంపెనీల సొంత బ్రాండ్ల వ్యూహం అధిక విలువ కలిగిన ప్యాకేజ్డ్ ఫుడ్స్‌కు కూడా చేరింది. ఇన్‌స్టామార్ట్ ప్రీమియం బ్రాండ్ నాయిస్‌కు బెవరేజెస్‌లో 7 శాతం వాటా, స్నాక్స్‌లో 5.5 శాతం వాటా సాధించింది.46కు పైగా కేటగిరీల్లో ఈ బ్రాండ్ విస్తరించింది. ప్రస్తుతం ఇన్‌స్టామార్ట్‌లో వచ్చే ప్రతి 10 కస్టమర్ బాస్కెట్లలో ఒకదానిలో నాయిస్ ఉత్పత్తులు ఉంటున్నాయని స్విగ్గీ తెలిపింది.
ఫ్రెష్ ఫుడ్ మరింత పెద్ద లాభం
ఫ్రెష్ ఫ్రూట్స్, కూరగాయల విభాగం సొంత బ్రాండ్లకు మరింత ఆకర్షణీయంగా మారుతోంది. ఈ విభాగంలో ప్రైవేట్ లేబుల్స్ ద్వారా 45 శాతం వరకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. థర్డ్ పార్టీ విక్రేతలతో పోలిస్తే ఇది నాలుగు రెట్లు అధికం. ఇన్‌స్టామార్ట్ బెంగళూరులోని ఐదు డార్క్ స్టోర్లలో నెక్టార్ ఫ్రూట్స్, వెజిటబుల్ బ్రాండ్‌ను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ఈ పైలట్ ప్రాజెక్ట్‌తో కస్టమర్ల ఖర్చు 10 శాతం పెరిగింది. రీపర్చేజ్ రేటు 12 పాయింట్లు, ప్లాట్‌ఫామ్ రిటెన్షన్ 7 శాతం పాయింట్లు మెరుగయ్యాయి.జెప్టో కూడా ముంబై, బెంగళూరులోని ప్రీమియం ప్రాంతాల్లో హార్వెస్ట్ స్టోర్‌ను కస్టమర్లకు ఓపెన్ చేసింది.
స్టాక్ ఉంటేనే కస్టమర్ ఉంటాడు
ప్రైవేట్ లేబుల్స్ వల్ల అధిక లాభాలే కాదు. ఇన్వెంటరీ, ధర, సరుకుల లభ్యత, ప్లాట్‌ఫామ్‌లకు నియంత్రణ లభిస్తుంది. క్విక్ కామర్స్‌లో ఒక ఉత్పత్తి అందుబాటులో లేకపోతే కస్టమర్ వెంటనే మరో యాప్ కు మారిపోయే అవకాశం ఉంటుంది. అందుకే డి మాండ్‌ను ముందుగానే అంచనా వేసి సొంత బ్రాండ్ల ద్వారా సరుకులను తగినంతగా అందుబాటులో ఉంచడం సంస్థలకు కీలకంగా మారుతోంది.
సాక్షి, బిజినెస్‌డెస్క్


