
ఎల్లలు దాటిన పోతుగల్ స్వీట్లు
హైదరాబాద్, దుబాయ్‌లలో దుకాణాలు
600 మందికి ఉపాధి కల్పిస్తున్న వైనం
యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్న దొంతినేని బాలకృష్ణ
ఉద్యోగం చేయడం కాదు.. పది మందికి ఉపాధి ఇవ్వాలన్న లక్ష్యం.. ఎంత ఎదిగినా పుట్టిన ఊరిని మరువద్దన్న వినయం.. కొత్తగా చేయాలన్న తపన.. ఆ యువకుడిని విజయతీరాలకు చేర్చింది. ఊరి పేరును బ్రాండ్‌గా మార్చుకున్న రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్‌కు చెందిన యువకుడు దొంతినేని బాలకృష్ణ (Donthineni Balakrishna) తన ఊరి పేరుతో స్వీట్ల వ్యాపారాన్ని దేశ, విదేశాల్లో విస్తరించాడు. ఎస్టీడీ బూత్‌బాయ్‌గా పనిచేసిన కుర్రాడు యువ పారిశ్రామికవేత్తగా ఎదిగిన తీరు నేటి యువతరానికి మార్గదర్శకంగా నిలుస్తోంది. కరోనా సంక్షోభంలో వ్యాపారం ప్రారంభించి.. విజయవంతంగా దూసుకెళ్తున్న బాలకృష్ణ సక్సెస్‌స్టోరీ.
పల్లె నుంచి పట్నానికి..
రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్‌కు చెందిన దొంతినేని మాధవరావు, శ్యామల కుమారుడు దొంతినేని బాలకృష్ణ పదో తరగతి వరకు గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదివాడు. ఇంటర్, బీఎస్సీ బయోటెక్నాలజీ హైదరాబాద్‌లో పూర్తి చేశాడు. చదువుకుంటున్న సమయంలో తల్లిదండ్రులకు భారం కావద్దని నల్లకుంటలో ఎస్టీడీ బూత్‌లో పనిచేశాడు. ఢిల్లీ, డెహ్రాడూన్‌లో మెడికల్ యూనివర్సిటీలో పనిచేశారు. ఏది చేసిన అందులో తృప్తి లేదని గ్రహించిన బాలకృష్ణ.. వినూత్నంగా ఆలోచించాడు. 2020లో కరోనాతో ఉద్యోగాలు పోవడం చూసి మనమే ఎందుకు ఉద్యోగాలు ఇవ్వద్దు అని ఆలోచించి హైదరాబాద్‌కు తిరిగొచ్చాడు.
అక్కాచెల్లెళ్లు సునీత, అనిత, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో స్నేహితుల అండతో రూ.20 లక్షల పెట్టుబడితో స్వీట్ వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. ఏదైనా బ్రాండ్ ప్రజల్లోకి సులభంగా వెళ్లేలా ఉండాలని తన ఊరు పేరుతో ‘పోతుగల్ స్వీట్స్’ను 2021లో సరూర్‌నగర్‌లో అప్పటి మంత్రి కేటీఆర్ (KTR) చేతుల మీదుగా బ్రాంచ్ ఓపెన్ చేశారు. హైదరాబాద్‌లోని కొంపల్లి, హైటెక్‌సిటీ, కొత్తపేట్, కర్మాన్‌ఘాట్‌లలో బ్రాంచ్‌లు ప్రారంభించారు. స్వీట్స్ వ్యాపారంతోపాటు తంగెడు పేరుతో రెస్టారెంట్, గునుగు పేరుతో క్యాటరింగ్ నిర్వహిస్తున్నారు. దుబాయ్‌లో నెల రోజుల కిందట పోతుగల్ స్వీ ట్స్ షాప్ ప్రారంభించాడు.
రుచి.. శుచి.. నాణ్యతలే ప్రామాణికం
ఏ వ్యాపారం ప్రారంభించినా నాణ్యత.. రుచి.. శుచితోనే విజయం సాధిస్తామని నమ్మి బాలకృష్ణ పోతుగల్ స్వీట్స్‌ను నడిపిస్తున్నారు. నాణ్యత విషయంలో రాజీపడకుండా కస్టమర్ల నమ్మకాన్ని చూరగొన్నాడు. స్వీట్స్ రంగంలో అప్పటికే మార్కెట్‌లో పేరు గడించిన వ్యాపారులతో పోటీని తట్టుకొని రూ.వంద కోట్ల వ్యాపారం వైపు అడుగులు వేస్తున్నాడు. స్నేహితులు రఘునాథ్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి అండతో స్వీట్స్ వ్యాపారం చేస్తూ 600 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తున్నాడు.
‘పోతుగల్ ట్రెడిషన్ అండ్ హెరిటేజ్ స్వీట్స్’ పేరుతో సంప్రదాయ మిఠాయిలకు కేరాఫ్ అడ్రస్‌గా బాలకృష్ణ బ్రాంచీలు నిలుస్తున్నాయి. తనకు కేటీఆర్ రోల్ మోడల్ అని కష్టపడి పనిచేసి నిజాయితీగా వ్యాపారం చేస్తే అది విజయతీరాలకు చేరుస్తుందని బాలకృష్ణ అంటున్నాడు. వెయ్యి మందికి ఉపాధి కల్పించి.. అమెరికా, బ్రిటన్‌లలో పోతుగల్ స్వీట్స్ (Pothgaal Sweets) ప్రారంభించే లక్ష్యంతో ప్రస్తుతం ఉన్నట్లు పేర్కొన్నాడు.
చదవండి: రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు యమ డిమాండ్.. త్వరపడండి
సంప్రదాయాలకు పెద్దపీట
నాణ్యత, స్వచ్ఛతలకు తోడు కస్టమర్ల నమ్మకానికి ప్రాధాన్యం కల్పిస్తూ పనిచేస్తున్నాం. పండుగలు, వేడుకలకు వినియోగించే స్వీట్లను అంతే పవిత్రతతో అందిస్తున్నాం. ఆ నమ్మకమే వంద కోట్ల వ్యాపారానికి నాంది వేస్తుంది. ఎయిర్‌పోర్టులు, విదేశాల్లో బ్రాంచ్‌లు ఓపెన్ చేస్తాం. వెయ్యి మందికి ఉపాధి కల్పిస్తాం.
– దొంతినేని బాలకృష్ణ, పోతుగల్ స్వీట్స్ యజమాని