breaking news
mustabad
-
ఒకప్పటి ఎస్టీడీ బూత్బాయ్.. నేటి యువ పారిశ్రామికవేత్త
ఉద్యోగం చేయడం కాదు.. పది మందికి ఉపాధి ఇవ్వాలన్న లక్ష్యం.. ఎంత ఎదిగినా పుట్టిన ఊరిని మరువద్దన్న వినయం.. కొత్తగా చేయాలన్న తపన.. ఆ యువకుడిని విజయతీరాలకు చేర్చింది. ఊరి పేరును బ్రాండ్‌గా మార్చుకున్న రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్‌కు చెందిన యువకుడు దొంతినేని బాలకృష్ణ (Donthineni Balakrishna) తన ఊరి పేరుతో స్వీట్ల వ్యాపారాన్ని దేశ, విదేశాల్లో విస్తరించాడు. ఎస్టీడీ బూత్బాయ్గా పనిచేసిన కుర్రాడు యువ పారిశ్రామికవేత్తగా ఎదిగిన తీరు నేటి యువతరానికి మార్గదర్శకంగా నిలుస్తోంది. కరోనా సంక్షోభంలో వ్యాపారం ప్రారంభించి.. విజయవంతంగా దూసుకెళ్తున్న బాలకృష్ణ సక్సెస్‌స్టోరీ.పల్లె నుంచి పట్నానికి.. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్‌కు చెందిన దొంతినేని మాధవరావు, శ్యామల కుమారుడు దొంతినేని బాలకృష్ణ పదో తరగతి వరకు గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదివాడు. ఇంటర్, బీఎస్సీ బయోటెక్నాలజీ హైదరాబాద్‌లో పూర్తి చేశాడు. చదువుకుంటున్న సమయంలో తల్లిదండ్రులకు భారం కావద్దని నల్లకుంటలో ఎస్టీడీ బూత్‌లో పనిచేశాడు. ఢిల్లీ, డెహ్రాడూన్‌లో మెడికల్ యూనివర్సిటీలో పనిచేశారు. ఏది చేసిన అందులో తృప్తి లేదని గ్రహించిన బాలకృష్ణ.. వినూత్నంగా ఆలోచించాడు. 2020లో కరోనాతో ఉద్యోగాలు పోవడం చూసి మనమే ఎందుకు ఉద్యోగాలు ఇవ్వద్దు అని ఆలోచించి హైదరాబాద్‌కు తిరిగొచ్చాడు.అక్కాచెల్లెళ్లు సునీత, అనిత, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో స్నేహితుల అండతో రూ.20 లక్షల పెట్టుబడితో స్వీట్ వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. ఏదైనా బ్రాండ్ ప్రజల్లోకి సులభంగా వెళ్లేలా ఉండాలని తన ఊరు పేరుతో ‘పోతుగల్ స్వీట్స్’ను 2021లో సరూర్‌నగర్‌లో అప్పటి మంత్రి కేటీఆర్ (KTR) చేతుల మీదుగా బ్రాంచ్ ఓపెన్ చేశారు. హైదరాబాద్‌లోని కొంపల్లి, హైటెక్‌సిటీ, కొత్తపేట్, కర్మాన్‌ఘాట్‌లలో బ్రాంచ్‌లు ప్రారంభించారు. స్వీట్స్ వ్యాపారంతోపాటు తంగెడు పేరుతో రెస్టారెంట్, గునుగు పేరుతో క్యాటరింగ్ నిర్వహిస్తున్నారు. దుబాయ్‌లో నెల రోజుల కిందట పోతుగల్ స్వీ ట్స్ షాప్ ప్రారంభించాడు. రుచి.. శుచి.. నాణ్యతలే ప్రామాణికం ఏ వ్యాపారం ప్రారంభించినా నాణ్యత.. రుచి.. శుచితోనే విజయం సాధిస్తామని నమ్మి బాలకృష్ణ పోతుగల్ స్వీట్స్‌ను నడిపిస్తున్నారు. నాణ్యత విషయంలో రాజీపడకుండా కస్టమర్ల నమ్మకాన్ని చూరగొన్నాడు. స్వీట్స్ రంగంలో అప్పటికే మార్కెట్లో పేరు గడించిన వ్యాపారులతో పోటీని తట్టుకొని రూ.వంద కోట్ల వ్యాపారం వైపు అడుగులు వేస్తున్నాడు. స్నేహితులు రఘునాథ్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి అండతో స్వీట్స్ వ్యాపారం చేస్తూ 600 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తున్నాడు. ‘పోతుగల్ ట్రెడిషన్ అండ్ హెరిటేజ్ స్వీట్స్’ పేరుతో సంప్రదాయ మిఠాయిలకు కేరాఫ్ అడ్రస్‌గా బాలకృష్ణ బ్రాంచీలు నిలుస్తున్నాయి. తనకు కేటీఆర్ రోల్ మోడల్ అని కష్టపడి పనిచేసి నిజాయితీగా వ్యాపారం చేస్తే అది విజయతీరాలకు చేరుస్తుందని బాలకృష్ణ అంటున్నాడు. వెయ్యి మందికి ఉపాధి కల్పించి.. అమెరికా, బ్రిటన్లలో పోతుగల్ స్వీట్స్ (Pothgaal Sweets) ప్రారంభించే లక్ష్యంతో ప్రస్తుతం ఉన్నట్లు పేర్కొన్నాడు.చదవండి: రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు యమ డిమాండ్.. త్వరపడండి సంప్రదాయాలకు పెద్దపీట నాణ్యత, స్వచ్ఛతలకు తోడు కస్టమర్ల నమ్మకానికి ప్రాధాన్యం కల్పిస్తూ పనిచేస్తున్నాం. పండుగలు, వేడుకలకు వినియోగించే స్వీట్లను అంతే పవిత్రతతో అందిస్తున్నాం. ఆ నమ్మకమే వంద కోట్ల వ్యాపారానికి నాంది వేస్తుంది. ఎయిర్‌పోర్టులు, విదేశాల్లో బ్రాంచ్‌లు ఓపెన్ చేస్తాం. వెయ్యి మందికి ఉపాధి కల్పిస్తాం. – దొంతినేని బాలకృష్ణ, పోతుగల్ స్వీట్స్ యజమాని -
తల్లిని చిత్రహింసలు చేస్తున్న తండ్రిపై ఫిర్యాదు చేసిన బాలుడు
-
సార్.. మా నాన్న తాగొచ్చి అమ్మను కొడుతున్నడు..
సాక్షి, ముస్తాబాద్ (సిరిసిల్ల):‘సార్ మా నాన్న రోజూ తాగొచ్చి అమ్మను, నన్ను, చెల్లిని కొడుతున్నడు.ఎందుకు కొడుతున్నడో ఏమో..’ అమ్మే పనికి పోతది.. మాకు బువ్వ పెడుతది. అమ్మ దగ్గరున్న పైసలు గుంజుకుని రోజూ పొద్దున్నే తాగుతున్నడు.. ఇంటికొచ్చి కొడుతున్నడు..’ అంటూ ఎనిమిదేళ్ల బాలుడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన జంగం భరత్ (8) అంబేడ్కర్‌నగర్ ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. తన తండ్రి తీరుకు విసిగిపోయి గురువారం ఉదయం ఒక్కడే స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వచ్చాడు. బాలుడి ఫిర్యాదుపై స్పందించిన ఎస్ఐ భరత్ తల్లిదండ్రులు దీపిక, బాలకిషన్‌ను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. బాలకిషన్‌కు తెలిసిన డ్రైవింగ్ పని చేసుకుని కుటుంబాన్ని పోషించుకోవాలని కౌన్సెలింగ్ ఇచ్చారు. బాలకిషన్ వేధింపులను భార్య దీపిక కూడా కన్నీటిపర్యంతమవుతూ ఎస్ఐకి వివరించింది. పిల్లలను బాగా చదివించాలని, తాము అండగా ఉంటామని ఎస్ఐ భరోసా ఇచ్చారు. భరత్‌ను హాస్టల్లో చేర్పిస్తాననగా.. తాను గురుకులంలో సీటు సాధిస్తానని.. పోలీస్ కావడమే తన లక్ష్యమని చెప్పడం విశేషం. చిన్న వయస్సులోనే సమస్య పరిష్కారానికి వచ్చిన బాలుడిని ఎస్సైతో పాటు అక్కడున్న సిబ్బంది అభినందించారు. చదవండి: హయత్ నగర్లో దారుణం.. టీచర్ మందలించిందని విద్యార్థిని ఆత్మహత్య -
ఎస్బీఐ డిప్యూటీ మేనేజర్ ఆత్మహత్య
సాక్షి, ముస్తాబాద్(సిరిసిల్ల): ఎస్బీఐ డిప్యూటీ మేనేజర్ ఆత్మహత్య చేసుకున్నారు. ముస్తాబాద్ ఎస్సై లక్ష్మారెడ్డి కథనం ప్రకారం.. కమలాపూర్ మండలంలోని మాదన్నపేటకు చెందిన మాచర్ల వెంకన్న(37) ముస్తాబాద్‌లోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా పోత్గల్ బ్రాంచిలో డిప్యూటీ మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడే ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. 15 రోజులు సెలవులో వెళ్లిన ఆయన శనివారం తిరిగి విధుల్లో చేరారు. సోమవారం ఉదయం బ్యాంకు సమయం దాటినా రాకపోవడంతో అధికారులు, సిబ్బంది వెంకన్న అద్దెకు ఉంటున్న ఇంటికి వెళ్లగా అచేతనంగా పడివున్నారు. పురుగుల మందు తాగినట్లు గుర్తించి, స్థానిక ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలపడంతో సిద్దిపేటకు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతిచెందారు. సంఘటన స్థలాన్ని ఎస్సై లక్ష్మారెడ్డి పరిశీలించారు. అయితే బ్యాంక్ అధికారుల వేధింపుల వల్లే తన భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని వెంకన్న భార్య పద్మ ఆరోపించారు. దీనికి కారణమైన వారిని చట్టరీత్యా శిక్షించాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతుడికి కుమారుడు సాయితేజ, కూతురు దీక్షిత ఉన్నారు. వెంకన్న మృతితో బాధిత కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. చదవండి: ప్రాణం తీసిన పంచాయితీ తీర్పు -
భర్తను హతమార్చిన భార్య
ముస్తాబాద్(సిరిసిల్ల): పిల్లలు లేని తనకుకాకుండా.. రెండో భార్యకు ఆస్తి దక్కుతుందని భావించిన మొదటి భార్య బంధువులతో కలిసి భర్తను హతమార్చింది. సిరిసిల్ల టౌన్ సీఐ వెంకటనర్సయ్య, మృతుడి బంధువుల కథనం మేరకు వివరాలు ఇలా..ముస్తాబాద్ మండలం సేవాలాల్‌తండాకు చెందిన ధరమ్‌సోత్ శంకర్‌నాయక్(49)పై అతడి మొదటి భార్య సరోజన, మరో ఇద్దరు బంధువులు కలిసి శనివారం రాత్రి దాడి చేశారు. తీవ్రగాయాలకు గురైన శంకర్‌నాయక్‌ను సిరిసిల్ల ఆసుపత్రికి తరలించారు. శంకర్‌నాయక్ పరిస్థితి విషమంగా ఉండడంతో ముస్తాబాద్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతిచెందిన శంకర్‌నాయక్ కాగా శంకర్‌నాయక్‌కు గతంలో సరోజనతో వివాహం జరిగింది. వీరికి సంతానం కలగలేదు. దీంతో సేవాలాల్ తండాకే చెందిన రాజవ్వను శంకర్‌నాయక్ రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి కూతురు జన్మించింది. అయితే వ్యవసాయ భూమిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని శంకర్‌నాయక్‌పై మొదటి భార్య సరోజన కొంతకాలంగా ఒత్తిడి తెస్తోంది. ఇద్దరి మధ్య ఆస్తిపై గొడవలు జరుగుతున్నాయి. పిల్లలు లేని తనను ఎవరూ పట్టించుకోరని ఆస్తి రాసివ్వాలని పంచాయితీలు పెట్టింది.(చదవండి: పథకం ప్రకారమే సాఫ్ట్వేర్ ఇంజనీర్ హత్య) అయితే అందుకు అతడు నిరాకరించడంతో తన బంధువులైన లక్ష్మీ, శ్రీనివాస్, సరోజన కలిసి శంకర్‌నాయక్‌కు శనివారం రాత్రి ఫుల్‌గా మందు తాగించారు. అనంతరం మద్యం మత్తులో ఉన్న శంకర్‌నాయక్‌పై ముగ్గురు కలిసి దాడి చేసి కొట్టారు. శంకర్‌ను చంపిన ముగ్గురిని శిక్షించాలని రెండో భార్య రాజవ్వ, ఆమె బంధువులు ముస్తాబాద్‌లో ఆందోళన చేపట్టారు. హత్యకు కారణమైన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటనర్సయ్య, ఎస్సై లక్ష్మారెడ్డి తెలిపారు. -
పంచాయితీ ఎన్నికలు: మస్తాబాద్‌లో రీకౌంటింగ్
-
ముస్తాబాద్‌లో ఉద్రిక్తత
సిరిసిల్ల: జిల్లాలోని ముస్తాబాద్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇసుక లారీలను నిలిపివేయాలని, రోడ్డు ప్రమాదానికి సంబంధించి అధికార పార్టే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ధర్నా చేపట్టింది. దీనికి కౌంటర్‌గా టీఆర్ఎస్ పార్టీ నాయకులు మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన గన్నె శంకరయ్య కుటుంబానికి రూ. 50 లక్షలు ఎక్స్‌గ్రేషియా కాంగ్రెస్ పార్టీ చెల్లించాలంటూ రాస్తారోకో నిర్వహించారు. పోటా పోటీ ధర్నాలతో ముస్తాబాద్ అట్టుడుకుతోంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ముస్తాబాద్ చెరువుకు గండి: నిలిచిన రాకపోకలు
కరీంనగర్ : భారీ వర్షాల కారణంగా కరీంనగర్ జిల్లాలోని ముస్తాబాద్ చెరువుకు మంగళవారం తెల్లవారుజామున గండి పడింది. దీంతో పోతుగల్ గ్రామంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఈ వరద ప్రవాహానికి స్థానికంగా ఉన్న గంగమ్మ ఆలయం కొట్టుకుపోయింది. అంతేకాకుండా వందలాది ఎకరాల్లోని పంట నీటమునిగింది. ముస్తాబాద్ - సిద్ధిపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. -
అంబేద్కర్ విగ్రహం ధ్వంసం
ముస్తాబాద్ : కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలం పోత్గల్‌లో అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ విషయం తెలిసిన దళిత సంఘాల నాయకులు విగ్రహం ఎదుట ధర్నాకు దిగారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయం గురించి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. -
బీటెక్ విద్యార్థి బలవన్మరణం
ఆంగ్ల మాధ్యమం చదవలేక అఘాయిత్యం ముస్తాబాద్(కరీంనగర్): ఇంగ్లిష్ మీడియం చదువు ఆ విద్యార్థిపాలిట శాపమైంది. తల్లిదండ్రుల కోరిక కాదనలేక.. ఇటు చదవలేక తీవ్ర మానసిక సంఘర్షణకు లోనైనా ఓ బీటెక్ విద్యార్థి చివరకు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కళాశాలలో ఇమడలేక అందులో చేరిన నాలుగు రోజులకే అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఎస్సై ప్రవీణ్, మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ముస్తాబాద్‌కు చెందిన సూర నరేశ్(18) శుక్రవారం ఇంట్లో ఉరేసుకున్నాడు. గమనించిన చుట్టుపక్కల వారు ఆస్పత్రికి తరలించగా అప్పటికే నరేశ్ మృతి చెందాడని వైద్యులు తెలిపారు. సూర కనుకవ్వ, సాయిలు దంపతులకు ఇద్దరు కుమారులు రాజశేఖర్, నరేశ్. రాజశేఖర్ ఉపాధి నిమిత్తం దుబాయ్‌కు వెళ్లొచ్చాడు. చిన్న కుమారుడు నరేశ్‌ను ఉన్నత చదువులు చదివించాలని తల్లిదండ్రులు భావించారు. గత నెల 27న హైదరాబాద్‌లోని సెయింట్ మేరీ ఇంజనీరింగ్ కళాశాలలో చేర్పించారు. అక్కడే ఓ హాస్టల్‌ను ఉంచారు. క్లాసులు అర్థం కావడంలేదురా.. నరేశ్ హైదరాబాద్‌లో హాస్టల్లో ఉండగా.. అక్కడ తనకు ఇంగ్లిష్‌లో చెప్పే పాఠాలు అర్థం కావడం లేదని, జైలులో ఉన్నట్లు అనిపిస్తోంది అని తన స్నేహితులకు వాట్సాప్ మెసేజ్ పెట్టాడు. కాలేజీకి వెళ్లబుద్ధికావడం పేర్కొన్నాడు. వినాయక చవితి పండుగ కోసమని సెలవు పెట్టి గురువారం స్వగ్రామానికి వచ్చాడు. రాత్రి బాగానే ఉన్న నరేశ్‌ను కాలేజీలో ఎలా ఉందని తల్లి కనుకవ్వ వాకబు చేసింది. అంతా బాగుందని నరేశ్ చెప్పాడు. శుక్రవారం ఉదయం పనులపై తల్లిదండ్రులు, సోదరుడు బయటకు వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న నరేశ్ ఉరేసుకున్నాడు. తమ ఇంట్లో ఎవరూ చదవలేదని, బాగా చదివి ప్రయోజకుడవుతాడని తమ కొడుకును హైదరాబాద్‌లో బీటెక్‌లో చేర్పించామని, కొడుకు మనసు అర్థం చేసుకోలేక పోయామని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా, నరేశ్ కాలేజీకి కూడా ఒక్క రోజే వెళ్లాడని, హాస్టల్లో తనతోపాటు ఉంటున్న నలుగురు స్నేహితులు పేర్కొన్నారు. తనకు క్లాసులు అర్థం కావడం లేదని చెప్పాడని, ఇంతలో ఆత్మహత్య చేసుకోవడం బాధగా ఉందన్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు. -
చెక్‌డ్యాంలో పడి బాలుడి మృతి
ముస్తాబాద్: మండలంలోని గూడూరు గ్రామానికి చెందిన శేక్ సాదిక్(10) ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు చెక్‌డ్యాంలో పడి మృతి చెందాడు. ఎస్సై మారుతి కథనం ప్రకారం.. గూడూరు ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న సాదిక్ సాయంత్రం పాఠశాల నుంచి వచ్చి గ్రామ శివారులోని చెక్‌డ్యామ్‌లోకి ఈతకు వెళ్లాడు. చెక్‌డ్యామ్‌లో నీరు ఎక్కువగా ఉండగా సాదిక్ నీటిలో మునిగి మృతి చెందాడు. సాదిక్ కోసం కుటుంబీకులు రాత్రి వెతకగా.. చెక్‌డ్యామ్ గట్టున సాదిక్ బట్టలు, సైకిల్‌ఉండడంతో అందులో గాలించారు. సాదిక్ మృత దేహం లభ్యకావడంతో వారి రోదనలు మిన్నంటాయి. తండ్రి హైదర్ ఉపాధి కోసం మధ్యప్రదేశ్ వెళ్లగా.. తల్లి జుబెదా గూడూరులో ఉంటూ సాదిక్‌ను చదివిస్తోంది. సంఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
పాముకాటుకు మహిళ మృతి
ముస్తాబాద్ (కరీంనగర్) : పాముకాటుకు గురై ఓ మహిళ మృతిచెందింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా ఆవునూర్ గ్రామంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఈర్ల రేణుక(45) ఆదివారం ఉదయం ఇంట్లో పని చేసుకుంటున్న సమయంలో పాము కాటు వేసింది. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నిస్తుండగా.. మార్గమధ్యంలోనే మృతిచెందింది. -
రైతులపై ఇసుక మాఫియా దాడి
ముస్తాబాద్: కరీంనగర్ జల్లా ముస్తాబాద్ మండలంలో రైతులపై ఇసుక మాఫియా దాడులకు దిగింది. మండలంలోని కొండాపూర్ గ్రామం సమీపంలో మానేరు వాగు నుంచి కొంత కాలంగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. బుధవారం ఉదయం కూడా ఇసుక అక్రమ రవాణా జరుగుతుండగా వాగు వద్ద రైతులు అడ్డుకున్నారు. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని, ఇసుకను తీయటానికి వీల్లేదన్నారు. దీంతో ఇసుక అక్రమ రవాణాదారులు రెచ్చిపోయారు. అడ్డుకున్న రైతులను తీవ్రంగా కొట్టి పరారయ్యారు. ఐదుగురు రైతులు స్పృహ తప్పి పడిపోగా.. స్థానికులు వారిని గుర్తించి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.