breaking news
Sweets shops
-
ఒకప్పటి ఎస్టీడీ బూత్బాయ్.. నేటి యువ పారిశ్రామికవేత్త
ఉద్యోగం చేయడం కాదు.. పది మందికి ఉపాధి ఇవ్వాలన్న లక్ష్యం.. ఎంత ఎదిగినా పుట్టిన ఊరిని మరువద్దన్న వినయం.. కొత్తగా చేయాలన్న తపన.. ఆ యువకుడిని విజయతీరాలకు చేర్చింది. ఊరి పేరును బ్రాండ్‌గా మార్చుకున్న రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్‌కు చెందిన యువకుడు దొంతినేని బాలకృష్ణ (Donthineni Balakrishna) తన ఊరి పేరుతో స్వీట్ల వ్యాపారాన్ని దేశ, విదేశాల్లో విస్తరించాడు. ఎస్టీడీ బూత్బాయ్గా పనిచేసిన కుర్రాడు యువ పారిశ్రామికవేత్తగా ఎదిగిన తీరు నేటి యువతరానికి మార్గదర్శకంగా నిలుస్తోంది. కరోనా సంక్షోభంలో వ్యాపారం ప్రారంభించి.. విజయవంతంగా దూసుకెళ్తున్న బాలకృష్ణ సక్సెస్‌స్టోరీ.పల్లె నుంచి పట్నానికి.. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్‌కు చెందిన దొంతినేని మాధవరావు, శ్యామల కుమారుడు దొంతినేని బాలకృష్ణ పదో తరగతి వరకు గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదివాడు. ఇంటర్, బీఎస్సీ బయోటెక్నాలజీ హైదరాబాద్‌లో పూర్తి చేశాడు. చదువుకుంటున్న సమయంలో తల్లిదండ్రులకు భారం కావద్దని నల్లకుంటలో ఎస్టీడీ బూత్‌లో పనిచేశాడు. ఢిల్లీ, డెహ్రాడూన్‌లో మెడికల్ యూనివర్సిటీలో పనిచేశారు. ఏది చేసిన అందులో తృప్తి లేదని గ్రహించిన బాలకృష్ణ.. వినూత్నంగా ఆలోచించాడు. 2020లో కరోనాతో ఉద్యోగాలు పోవడం చూసి మనమే ఎందుకు ఉద్యోగాలు ఇవ్వద్దు అని ఆలోచించి హైదరాబాద్‌కు తిరిగొచ్చాడు.అక్కాచెల్లెళ్లు సునీత, అనిత, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో స్నేహితుల అండతో రూ.20 లక్షల పెట్టుబడితో స్వీట్ వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. ఏదైనా బ్రాండ్ ప్రజల్లోకి సులభంగా వెళ్లేలా ఉండాలని తన ఊరు పేరుతో ‘పోతుగల్ స్వీట్స్’ను 2021లో సరూర్‌నగర్‌లో అప్పటి మంత్రి కేటీఆర్ (KTR) చేతుల మీదుగా బ్రాంచ్ ఓపెన్ చేశారు. హైదరాబాద్‌లోని కొంపల్లి, హైటెక్‌సిటీ, కొత్తపేట్, కర్మాన్‌ఘాట్‌లలో బ్రాంచ్‌లు ప్రారంభించారు. స్వీట్స్ వ్యాపారంతోపాటు తంగెడు పేరుతో రెస్టారెంట్, గునుగు పేరుతో క్యాటరింగ్ నిర్వహిస్తున్నారు. దుబాయ్‌లో నెల రోజుల కిందట పోతుగల్ స్వీ ట్స్ షాప్ ప్రారంభించాడు. రుచి.. శుచి.. నాణ్యతలే ప్రామాణికం ఏ వ్యాపారం ప్రారంభించినా నాణ్యత.. రుచి.. శుచితోనే విజయం సాధిస్తామని నమ్మి బాలకృష్ణ పోతుగల్ స్వీట్స్‌ను నడిపిస్తున్నారు. నాణ్యత విషయంలో రాజీపడకుండా కస్టమర్ల నమ్మకాన్ని చూరగొన్నాడు. స్వీట్స్ రంగంలో అప్పటికే మార్కెట్లో పేరు గడించిన వ్యాపారులతో పోటీని తట్టుకొని రూ.వంద కోట్ల వ్యాపారం వైపు అడుగులు వేస్తున్నాడు. స్నేహితులు రఘునాథ్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి అండతో స్వీట్స్ వ్యాపారం చేస్తూ 600 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తున్నాడు. ‘పోతుగల్ ట్రెడిషన్ అండ్ హెరిటేజ్ స్వీట్స్’ పేరుతో సంప్రదాయ మిఠాయిలకు కేరాఫ్ అడ్రస్‌గా బాలకృష్ణ బ్రాంచీలు నిలుస్తున్నాయి. తనకు కేటీఆర్ రోల్ మోడల్ అని కష్టపడి పనిచేసి నిజాయితీగా వ్యాపారం చేస్తే అది విజయతీరాలకు చేరుస్తుందని బాలకృష్ణ అంటున్నాడు. వెయ్యి మందికి ఉపాధి కల్పించి.. అమెరికా, బ్రిటన్లలో పోతుగల్ స్వీట్స్ (Pothgaal Sweets) ప్రారంభించే లక్ష్యంతో ప్రస్తుతం ఉన్నట్లు పేర్కొన్నాడు.చదవండి: రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు యమ డిమాండ్.. త్వరపడండి సంప్రదాయాలకు పెద్దపీట నాణ్యత, స్వచ్ఛతలకు తోడు కస్టమర్ల నమ్మకానికి ప్రాధాన్యం కల్పిస్తూ పనిచేస్తున్నాం. పండుగలు, వేడుకలకు వినియోగించే స్వీట్లను అంతే పవిత్రతతో అందిస్తున్నాం. ఆ నమ్మకమే వంద కోట్ల వ్యాపారానికి నాంది వేస్తుంది. ఎయిర్‌పోర్టులు, విదేశాల్లో బ్రాంచ్‌లు ఓపెన్ చేస్తాం. వెయ్యి మందికి ఉపాధి కల్పిస్తాం. – దొంతినేని బాలకృష్ణ, పోతుగల్ స్వీట్స్ యజమాని -
స్వీట్స్ ‘గడువు తేదీ’ ప్రదర్శించాల్సిందే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇప్పటి వరకు ప్యాక్ చేసిన స్వీట్స్‌కు మాత్రమే గడువు తేదీతోపాటు తయారీ తేదీని ఉత్పత్తిదార్లు ముద్రిస్తున్నారు. ఇక నుంచి సాధారణ స్వీట్ షాపుల్లో కూడా విడిగా విక్రయించే తీపి పదార్థాల ముందు ఈ తేదీలను ప్రదర్శించాల్సిందే. 2020 జూన్ 1 నుంచి ఈ నిబంధనను అమలులోకి తీసుకొస్తున్నట్టు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) స్పష్టం చేసింది. గడువు ముగిసిన తీపి పదార్థాలను దుకాణదార్లు విక్రయిస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఎఫ్ఎస్ఎస్ఏఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. నిబంధన అమలు చేయాల్సిందిగా ఫుడ్ సేఫ్టీ కమిషనర్లకు ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశించింది. -
రాజస్తానీ రస్‌గుల్ల..
చిన్నచిన్న పట్టణాల నుంచి హైదరాబాద్ లాంటి పెద్ద నగరాల్లో ఎక్కడ చూసినా మిఠాయి దుకాణాలు రాజస్తానీలవే ఎక్కువగా ఉంటాయి. రకరకాల మిఠాయిలు తయారు చేయడంలో రాజస్తానీలది అందెవేసిన చెయ్యి. రాజస్తాన్‌లో పాటి కులానికి చెందిన అత్యధిక మంది మిఠాయిల వ్యాపారమే చేసుకొని జీవనం సాగిస్తారు. ఇలా మిఠాయి వ్యాపారం చేసుకోవడానికి వచ్చిన వారిలో వికారాబాద్ జిల్లాలో సుమారు 150 కుటుంబాలు ఉంటాయి. వీరంతా దాదాపు 40ఏళ్ల క్రితమే ఇక్కడికి వచ్చి చిన్నపాటిగా మిఠాయిల వ్యాపారం ప్రారంభించారు. వికారాబాద్ అర్బన్ : రాజస్తాని మిఠాయిలు ఈ ప్రాంత ప్రజలకు రుచి చూపించడంతో వ్యాపారం మూడు పూవులు ఆరు కాయలుగా కొనసాగుతోంది. పట్టణాల్లో అక్కడక్కడ స్థానికుల మిఠాయి దుకాణాలున్నా, రజస్తానీ మిఠాయిల రుచిలో పోటీ పడటం లేదు. రాజస్తానీ మిఠాయిల గుమగుమలు అందరిని నోరూరిస్తాయి. శుభకార్యాలకు, 15 ఆగస్టు, 26 జనవరి, ఇతర వేడుకలకు స్థానికులు రాజస్తానీ మిఠాయిల దుకాణాల నుంచే అధికంగా కొనుగోలు చేసి తీసుకవెళుతుంటారు. పట్టణంలోని ఒక్కో రాజస్తానీ మిఠాయి దుకాణాల్లో సుమారు వంద రకాల స్వీట్లు తయారు చేసి అమ్ముతున్నారంటే వారు ఏ స్థాయిలో మిఠాయిలు తయారు చేస్తారో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడు వినని మిఠాయిల పేర్లతో, రంగు రంగులుగా ఆకర్షణీయంగా తయారు చేసి వినియోగదారుల నోరూరింపజేస్తున్నారు. మిఠాయిల రకాలు.. ఈ ప్రాంతంలో అత్యధిక మంది ప్రజలకు జిలేబీ, మైసూర్‌పాక్, పేడా, గులాబ్ జామ్ వంటి కొన్ని పేర్లు మాత్రమే తెలుసు. మిఠాయిలు కొనడానికి రాజస్తానీ మిఠాయి దుకాణాలకు వెళితే అక్కడ రంగురంగులతో ఉన్న మిఠాయిల పేర్లు తెలియక ఇదేమి స్వీటని అడగడం, ఆ పేరు చెబితే కొత్తగా ఉందని అనుకోవడం సర్వసాధారణం అయిపోయింది. ఎందకంటే వందల రకాల స్వీట్లు అక్కడ ఉంచడం, గతంలో మనం ఎప్పుడు పేరు వినకపోవడం, చూడక పోవడంతో ఆ ఆలోచన కలుగుతుంది. మిఠాయి దుకాణాల్లో ఇన్ని రకాల స్వీట్లు చూశాక, ఇన్ని పేర్లతో స్వీట్లు ఉంటాయా అనుకునే వారే అధికం. రాజస్తానీ మిఠాయి దుకాణాల్లో ప్రధానంగా అజ్మీర్ కళాఖన్, గేవర్ సంక్రాంత్రి ప్రత్యేకం, రస్గుల్లా, దూద్ రఫిడి, ఖాజు కత్లా, అంజూర్ కోన్, ఖాజు రోల్, ముందాల్ అల్వా, అంజీర్ కత్తి, ఖాజు కత్తి, కేసర్ కత్తి, ఫిస్తా కత్తి, అంజీర్ కళాఖాన్, రస్ మధురీ, రఫిడి, టమన్ టోక్లా వంటి రకరకాల స్వీట్లు తయారు చేస్తున్నారు. దశాబ్దాలుగా ఈ ప్రాంతంతో అనుబంధం దశాబ్దాల క్రితం మిఠాయి వ్యాపారం కోసం రాజస్తాన్ నుంచి ఈ ప్రాంతానికి వచ్చిన పాటి కులస్తులు ఇక్కడే స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. జిల్లాలో ఉన్న సుమారు 150 కుటుంబాలే కాకుండా ఆ మిఠాయి తయారీ కేంద్రాల్లో పనిచేసే వారిలో కూడా అత్యధిక మంది రాజస్తానీ యువకులే పనిచేస్తున్నారు. సుదూర ప్రాంతం వచ్చి స్థిరపడ్డ ఆ ప్రాంత యువతకు ఉపాధి కల్పిస్తున్నారు. ఈ ప్రాంతంలో జరిగే పండగులను వారు జరుపుకుంటూ, వేడుకల్లో పాల్గొంటున్నారు. రాష్ట్రం వేరైనా ఈ ప్రాంత సంస్కృతి సంప్రదాయాలతో మమేకమైపోయారు. ఇలా రాజస్తానీ మిఠాయి నేడు మారుమూల మండలాలైన మర్పల్లి, మోమిన్ పేట్, నవాబు పేట, బంట్వారం వంటి మండలాల్లో కూడా మంచి ఆదరణ కలిగి ఉంది. 30ఏళ్ల క్రితం వచ్చాం.. మిఠాయి వ్యాపారం చేసేందుకు ఇక్కడికి 30ఏళ్ల క్రితమే వచ్చాం. రాజస్తాన్‌లో వందల రకాల మిఠాయి తయారు చేస్తారు. అక్కడ తయారు చేసే అనేక మిఠాయిలను తయారు చేసి ఈ ప్రాంత ప్రజలకు దగ్గర చేశాం. జిల్లాలో చాలా మంది మా వారు ఉన్నారు. వారందరిని ఈ ప్రాంత ప్రజలు అక్కున చేర్చుకున్నారు. మమ్మల్ని ఈ ప్రాంత వారుగానే, స్థానికులుగానే చూస్తారు. దశాబ్దాలుగా ఉండటంతో ఈ సంస్కృతిలో కలిసి పోయాం. ఇక్కడి పండగులు, వేడుకలు చాలా వరకు ఆచరిస్తాం. – జీత్‌మల్ పాటి, మిఠాయి వ్యాపారి, వికారాబాద్ -
తరాలు మారినా... మిఠాయిదే పైచేయి!
న్యూఢిల్లీ: దీపావళి పండుగ అంటే చెప్పేదేముంటుంది. చాక్లెట్లు, మిఠాయిల షాపులు కస్టమర్లతో కళకళలాడిపోతుంటాయి. రేటెంతయినా ఈ పండుగ రోజు స్వీట్స్‌కు ఉండే డిమాండే వేరు. తమ ఇంట్లోకే కాకుండా బంధువులకు, స్నేహితులకు సైతం స్వీట్స్ పంపే, పంచే ప్రత్యేక పండుగ ఇది. షాపులకు వెళ్లామంటే- పలు రకాల మిఠాయిలు, చాక్లెట్ల ‘రుచులు’ ఊరించేస్తుంటాయి. పలు రకాలు చాక్లెట్లు, వివిధ స్వీట్లు కలర్‌ఫుల్ ప్యాకెట్లలో ఆకర్షిస్తుంటాయి. అయితే ఆకర్షణీయమైన ప్యాకెట్లలో దిగుమతయ్యే చాక్లెట్లు, ఫ్యాన్సీ కుకీలు, కేకులు, ముఫిన్స్ ఎంత పోటీ ఇస్తున్నా... మన భారత సాంప్రదాయక మిఠాయిలతో అవి పోటీ పడలేకపోతుండడమే విశేషం. ఇండస్ట్రీ చాంబర్ అసోచామ్ అంచనా ప్రకారం మొత్తం ఈ మార్కెట్ విలువ దాదాపు రూ.49,000 కోట్లు (8 బిలియన్ డాలర్లలో). సాంప్రదాయక స్వీట్ల హవా! మన సాంప్రదాయక మిఠాయిలు మార్కెట్లో తన పట్టును కాపాడుకోవడమే కాకుండా, విస్తరిస్తున్న మార్కెట్‌కు అనుగుణంగా వీటి విక్రయాలు సైతం పెరుగుతున్నాయి. ఇక్కడ మన మిఠాయిల కొనుగోళ్ల పట్ల కస్టమర్లకు ఉన్న భావోద్వేగ అంశాలు సైతం కీలకంగా మారినట్లు షాపుల యజమానులు తెలుపుతున్నారు. జీడిపప్పు పౌండర్, చక్కెరతో తయారుచేసే స్వీట్ కేక్ కాజు కట్లీసహా మైసూర్‌పాక్, బాదమ్ హల్వా, గులాబ్ జామ్ వంటి స్వీట్స్ మార్కెట్లో తమ హవాను చాటుతున్నాయి. కొన్ని స్వీట్స్ కొనేముందు అవి కనీసం కొన్ని రోజులు అలమరాల్లో మన్నే విషయాన్ని సైతం తమ కొనుగోళ్ల సందర్భంగా కస్టమర్లు పరిగణనలోకి తీసుకుంటారని వర్తకులు పేర్కొంటున్నారు. ఆయా అంశాల్లోసైతం మన సాంప్రదాయ మిఠాయిలకే ప్రాధాన్యత, ప్రత్యేకత ఉంటోందని ఈ రంగంలో నిపుణుల మాట. బ్రాండెడ్ స్వీట్స్ మార్కెట్ గత యేడాదితో పోల్చితే ప్రస్తుత దీపావళికి 30 శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు ఈ రంగంలో నిపుణులు పేర్కొంటున్నారు. మిఠాయివాలా డాట్ ఇన్ వెబ్సైట్ 400 రకాల బ్రాండెడ్ స్వీట్‌ను ఆఫర్ చేస్తోంది. మన స్వీట్స్‌కు డిమాండ్ మరింత పెరిగేదని, అయితే సాంప్రదాయక స్వీట్లలో కల్తీ భయాందోళన కలిగిస్తోందని ఈ రంగంలో నిపుణులు తెలిపారు. దీనితో చాక్లెట్లవైపు కొందరు కస్టమర్లు మొగ్గుచూపుతుండడం గమనార్హం. ప్రస్తుతం భారత చాక్లెట్ పరిశ్రమల పరిమాణం రూ.5,000 కోట్లు. ఇది వచ్చే రెండేళ్లలో రూ.7,500 కోట్లు దాటుతుందని అంచనా.