
సాక్షి, హైదరాబాద్: మధ్యతరగతి ప్రజలకు సొంతింటి వసతిని కల్పించేందుకు లాభాపేక్ష లేకుండా తక్కువ ధరలకు అందుబాటులో తెచ్చిన ఫ్లాట్ల కొనుగోలుకు హైదరాబాద్ నగరవాసుల ఆసక్తి పెరుగుతోందని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ సూపరింటెండింగ్ ఇంజినీర్ సి.భాస్కర్ రెడ్డి తెలిపారు. నగరంలోని బండ్లగూడ, పోచారం ప్రాంతాల్లోని ఫ్లాట్ల మార్కెట్ ధర కంటే దాదాపు 40 శాతం తక్కువకే అందుబాటులో ఉన్నాయన్నారు.
నాగోల్ (Nagole) బండ్లగూడలోని 159 ఫ్లాట్లకు, పోచారంలోని 601 ఫ్లాట్ల విక్రయానికి నోటిఫికేషన్ విడుదలైనట్లు తెలిపారు. నాగోల్ బండ్లగూడలోని ఫ్లాట్ల కోసం సుమారు 12 వందల మంది ఫోన్లు చేయగా, 700 మంది ప్రాజెక్టును సందర్శించినట్లు తెలిపారు. పోచారం (Pocharam) ఫ్లాట్లకు సంబంధించిన 800 మంది వరకు టెలిఫోన్‌లో సంప్రదించగా, సుమారు 300 మంది వరకు ప్రాజెక్టును సందర్శించారన్నారు.
బండ్లగూడ (Bandlaguda) ప్రాజెక్టుకు సంబంధించిన దరఖాస్తులను ఈ నెల 29 వరకు స్వీకరిస్తామని, 30వ తేదీన లాటరీ ద్వారా కేటాయిస్తామని, పోచారం ప్రాజెక్టుకు సంబంధించిన దరఖాస్తులను ఈ నెల 31వ తేదీ వరకు స్వీకరిస్తామని, ఆగస్టు 1వ తేదీన లాటరీ ద్వారా కేటాయిస్తామని ఆయన వివరించారు. అతితక్కువ ధరల్లోనే సొంతింటి కలను నెరవేరేలా ప్రభుత్వం కలి్పంచిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.