హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి వివాదాలు లేని నివాసయోగ్యమైన ఓపెన్ ప్లాట్లను ఈ-వేలం ద్వారా నిర్వహించడానికి తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ మరోసారి నోటిఫికేషన్ ఇచ్చింది. తమ అభిరుచులకు అనుగుణంగా ఇంటిని నిర్మించేందుకు అనువుగా ఉన్న స్థలాలను (ప్లాట్లను) కొనుగోలు చేయడానికి ఇది మరో చక్కటి అవకాశం అని రాజీవ్ స్వగృహ మేనేజింగ్ డైరక్టర్ వి.పి. గౌతం తెలిపారు.
రంగారెడ్డి జిల్లాలోని కుర్మల్ గుడ, తొర్రూర్, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలోని బహదూర్ పల్లి ప్రాంతాల్లోని మొత్తం 167 ప్లాట్లకు అక్టోబర్ 28 నుంచి 30వ తేదీ వరకు 3 రోజుల పాటు ఈ-వేలం ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు గౌతం పేర్కొన్నారు. తొర్రూర్‌లో 200-500 చదరపు గజాల విస్తీర్ణంలోని 120 ప్లాట్లకు, కుర్మల్ గుడలో 200-300 చ. గజాల విస్తీర్ణంలోని 29 ప్లాట్లు, అలాగే బహదూర్ పల్లిలో 200 -1000 చ. గజాల విస్తీర్ణంలోని 18 ప్లాట్లను ఈ-వేలం ద్వారా విక్రయిస్తున్నామన్నారు.
ప్రజలకు చక్కటి వసతులతో కూడిన నివాస భూములను అందుబాటులోకి తెచ్చే ప్రక్రియలో భాగంగా పూర్తి పారదర్శకమైన విధానంలో ఈ-వేలం ద్వారా వీటిని విక్రయిస్తున్నామని గౌతం వివరించారు. ఈ ప్రాంతాల్లోని ప్లాట్లకు గతంలో బహిరంగ వేలం నిర్వహించగా, ప్రస్తుతం ఈ-వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయించారు. ఈ వేలం ద్వారా స్థలాలను కొనుగోలు చేయాలనుకునే వారు ముందుగా ఆన్‌లైన్‌లో MSTC పోర్టల్‌లో రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ వేలం పాటల్లో పాల్గొంటున్న బిడ్డర్ల వివరాలు, బిడ్డింగ్ ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు ఎవరికీ తెలియవని, అందువల్ల కొనుగోలు దారులు స్వేఛ్చగా వేలం ప్రక్రియలో పాల్గొని నచ్చిన ధరకు స్థలాలను కొనుగోలు చేయవచ్చు.
ఈ ప్లాట్లన్నీ కనీస మౌలిక సదుపాయాలు కల్పించబడిన, అభివృద్ధి చెందిన లే అవుట్లలో ఉన్నాయి. తొర్రూర్‌లో సుమారు 100 ఓపెన్ ప్లాట్ల విక్రయానికి గతంలో నిర్వహించిన వేలం ప్రక్రియలో చదరపు గజం భూమి ధర గరిష్టంగా రూ. 67,500 వేల వరకు పలికి ప్లాట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. అయినప్పటికీ ప్రస్తుత నోటిఫికేషన్‌లో చదరపు గజానికి కనీస ధర రూ.25 వేలు ఉండనుంది.
కుర్మల్ గుడలో సైతం గతంలో చదరపు గజానికి సుమారు రూ.29 వేల ధర పలికినప్పటికీ, ప్రస్తుత కనీస ధర రూ.20 వేలుగా నిర్ధారించారు. బహదూర్ పలిల్లో సైతం గతంలో ఆఫ్‌సెట్ ధర కంటే చాలా అధికంగా రూ.47 వేల వరకు చదరపు గజం ధర పలికినా గతంలోని కనీస ధరలకే (కార్నర్ ప్లాట్లు రూ.30 వేలు, ఇతర ప్లాట్లకు రూ.27 వేలు) ప్రస్తుతం కూడా విక్రయిస్తున్నట్లు ప్రకటించారు.
ఈ-వేలం షెడ్యూల్
కుర్మల్ గుడ, బహదూర్ పల్లిలోని ఫ్లాట్లకు MSTC పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆఖరు తేదీ అక్టోబరు 27. కాగా అక్టోబరు 28వ తేదీ ఉదయం కుర్మల్ గుడలోని 29 ప్లాట్లకు, మధ్యాహ్నం బహదూర్ పల్లిలోని 18 ప్లాట్లకు ఈ-వేలం నిర్వహిస్తారు. అలాగే తొర్రూర్‌లోని 120 ప్లాట్ల కొనుగోలు దారులు 28వ తేదీ నాటికి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి 29, 30 తేదీల్లో ఒక్కో సెషన్‌లో30 ప్లాట్లు చొప్పున మొత్తం నాలుగు సెషన్‌లలో వేలం నిర్వహించనున్నారు. పూర్తి వివరాలు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
ఇదీ చదవండి: 2030 నాటికి రూ.2 లక్షల కోట్లు!: అనరాక్ రీసెర్చ్


