సాక్షి, సిటీబ్యూరో: రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్(రీట్స్) పెట్టుబడులలో కార్యాలయ విభాగం అగ్రగామిగా ఉంటుంది. అయితే కొంత కాలంగా రీట్స్ ఇన్వెస్ట్‌మెంట్స్ క్రమంగా రిటైల్ విభాగంలో కూడా వెల్లువెత్తుతున్నాయి. షాపింగ్ మాల్స్, సెంటర్లు, మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్ట్‌లలో రీట్స్ పెట్టుబడులు పెరుగుతున్నాయి. నాణ్యమైన రిటైల్ స్పేస్ అందుబాటులోకి వస్తుండటం, కొనుగోలుదారుల వ్యయం పెరగడం, పట్టణ ప్రాంతాల్లో ఆదాయ వృద్ధి, స్థిరమైన ఆదాయ వనరుగా మారడం వంటివి రిటైల్ రంగంలో రీట్స్ పెట్టుబడులకు ప్రధాన కారణాలని అనరాక్ రీసెర్చ్ నివేదిక తెలిపింది.
దేశీయ రియల్ ఎస్టేట్ రంగంలో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్(రీట్స్) పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. 2030 నాటికి దేశీయ రిట్స్ రూ.2 లక్షల కోట్లకు చేరుతాయని అనరాక్ రీసెర్చ్ అంచనా వేసింది. ఇందులో 30-40 శాతం వాటా రిటైల్ రంగానిదే ఉంటుందని తెలిపింది. 2030 నాటికి రిటైల్ రీట్స్ రూ.60–80 వేల కోట్లుగా ఉంటాయని పేర్కొంది.
ఆదాయ వనరుగా..
గ్రేడ్–ఏ షాపింగ్ మాల్స్ స్థిరమైన ఆదాయ వనరుగా మారడంతో పెట్టుబడిదారులు రిటైల్ విభాగంలో రీట్స్ పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. వచ్చే 3–5 ఏళ్లలో 2–3 రిటైల్ రీట్స్ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయని తెలిపింది. ప్రస్తుతం ఐదు రిటైల్ రీట్స్ నమోదు కాగా.. ఇందులో నెక్సస్ ఒక్కటే రిటైల్ కేంద్రీకృత రీట్స్ కాగా.. మిగిలిన నాలుగు కార్యాలయ కేంద్రీకృత రీట్స్. కొత్త షాపింగ్ మాల్స్‌లో సగానికి పైగా స్థలం రిటైల్ కేంద్రాలే ఉంటున్నాయి. ద్వితీయ శ్రేణి పట్టణాలలో సంస్థాగత పెట్టుబడులు వస్తుండటంతో రీట్స్ పెట్టుబడులకు అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఫీనిక్స్ మైల్స్, ప్రెస్టిజ్ ఎస్టేట్స్, నెక్సస్ మాల్స్ వంటి ప్రధాన సంస్థలు ఇండోర్, కోయంబత్తూరు, సూరత్, భువనేశ్వర్, చంఢీఘడ్ వంటి ద్వితీయ శ్రేణి పట్టణాలలో శరవేగంగా విస్తరిస్తున్నాయి.


