పర్యావరణానికి చేటు చేస్తున్న పారిశ్రామిక వ్యర్థాలు
వ్యర్థాల నిర్వహణ ఖర్చుపై కక్కుర్తి ప్రదర్శిస్తున్న కంపెనీలు
వ్యర్థాలను యథేచ్ఛగా నదీ జలాల్లోకి వదిలేస్తున్న వైనం
కాలుష్యం కాటుకు మరణిస్తున్న జీవరాశి
1,700కి పైగా కాలుష్య పరిశ్రమలపై చర్యలకు ఆదేశించిన గ్రీన్ ట్రిబ్యునల్
పారిశ్రామిక వ్యర్థాలు పర్యావరణానికి, ప్రజారోగ్యానికి, ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన నష్టాలను కలిగిస్తున్నాయి. భారతదేశంలో పరిశ్రమలు ఉత్పత్తి చేస్తున్న రసాయనిక, లోహాలు, ప్లాస్టిక్, బయోమెడికల్ వ్యర్థాలు సరైన శుద్ధి లేకుండా నీటిలో, భూమిలో, గాలిలో కలవడం వల్ల అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి.
దేశంలోని చాలా పరిశ్రమలు వ్యర్థాలను సక్రమంగా నిర్వహించడం లేదని, హానికరమైన రసాయనిక వ్యర్థాలను ఎటువంటి సంస్కరణ లేకుండా అలాగే బయటకు వదిలేస్తున్నాయని, దీంతో నదీ జలాలు కలుషితమవుతున్నాయని ఎప్పటి నుంచో ఫిర్యాదు ఉన్నాయి. ఈ విషయంలో కాలుష్య నియంత్రణ బోర్డులు సైతం చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యాయన్న విమర్శలు ఉన్నాయి.
ఇదే విషయంగా శుద్ధి చేయని పారిశ్రామిక వ్యర్థాలను నీటి వనరులలోకి విడుదల చేస్తున్న పరిశ్రమలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) కొరడా ఝుళిపించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న 1,700 కి పైగా స్థూల కాలుష్య పరిశ్రమలపై (జీపీఐలు) సత్వరమే చర్యలు తీసుకోవాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ)తోపాటు ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, హర్యానా, బీహార్ రాష్ట్రాల కాలుష్య నియంత్రణ బోర్డులకు గట్టి ఆదేశాలు జారీ చేసింది.
వందలాది స్థూల కాలుష్య పరిశ్రమలు వ్యర్థాల విడుదలను పర్యవేక్షించే ఆన్లైన్ కంటిన్యూయస్ ఎఫ్లూయెంట్ మానిటరింగ్ సిస్టమ్స్ (OCEMS)ను ఏర్పాటు చేసుకోవడంలో విఫలమయ్యాయంటూ ధాఖలైన పిటిషన్పై విచారించిన ఎన్జీటీ ఈ ఆదేశాలు ఇచ్చింది. చర్యలు తీసుకుంటున్న ఈ 1700 పరిశ్రమల్లో అత్యధికంగా హర్యానాలో 812, ఉత్తర ప్రదేశ్లో 704, ఢిల్లీలో 149, బిహార్లో 21 ఉన్నాయి.
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం.. రోజుకు 10 కిలో లీటర్ల వ్యర్థాలను విడుదల చేసే పరిశ్రమలు తప్పనిసరిగా ఓసీఈఎంఎస్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. అదే తక్కువ స్థాయిలో వ్యర్థాలను విడుదల చేసే పరిశ్రమలైతే ఫ్లో మీటర్లను, వెబ్ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి.
ఎంత తేడా?
వ్యర్థాల నిర్వహణలో అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారతదేశంలోని పరిశ్రమలు చాలా తక్కువ ఖర్చు చేస్తున్నాయి. సాంకేతికతలను వినియోగించడంలోనూ వెనుకబడ్డాయి. ఖర్చును తగ్గించుకునేందుకు అంతగా శిక్షణలేని శ్రామిక శక్తితో నెట్టుకొస్తున్నాయి. వ్యర్థాల నిర్వహణ, పర్యవేక్షణ కోసం అభివృద్ధి చెందిన దేశాల్లోని పరిశ్రమలు అధునాతన ఆటోమేషన్, ఏఐ-ఆధారిత సెగ్రిగేషన్, జీపీఎస్ ట్రాకింగ్ సాంకేతికతలను వినియోగిస్తుంటే భారత్లోని పరిశ్రమలు పాక్షిక యాంత్రిక వ్యవస్థలతో మానవ శ్రమపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి.
ఇక వ్యర్థాల నిర్వహణకు అభివృద్ధి చెందిన దేశాల్లో చేస్తున్న ఖర్చు, భారత్లో పరిశ్రమలు వెచ్చిస్తున్న మొత్తాన్ని పరిశీలిస్తే గణనీయమైన వ్యత్యాసం కనపడుతుంది. వ్యర్థాల నిర్వహణ, సంస్కరణకు అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు ఒక టన్నుకు రూ.8 వేల నుంచి రూ.25 వేల వరకూ ఖర్చు చేస్తుంటే మన దేశంలో పరిశ్రమలు చేస్తున్న ఖర్చు కేవలం రూ.1,500 నుంచి రూ.3వేలు మాత్రమే.
పారిశ్రామిక వ్యర్థాలతో ప్రధాన నష్టాలు
గంగా, యమునా వంటి నదుల్లో శుద్ధి చేయని వ్యర్థాల కలవడం వల్ల నీటి నాణ్యత తీవ్రంగా తగ్గుతోంది. ఇది తాగునీటి, వ్యవసాయ నీటి వినియోగాన్ని ప్రమాదంలోకి నెట్టుతోంది. పారిశ్రామిక ఘన వ్యర్థాలు (లోహపు స్క్రాప్ లు, నిర్మాణ శిధిలాలు) భూమిలోకి చేరడం వల్ల మట్టిలో విషపదార్థాలు చేరి, వ్యవసాయ ఉత్పాదకత తగ్గుతోంది. పరిశ్రమలు నుండి వెలువడే వాయువులు శ్వాస సంబంధిత వ్యాధులకు దారితీస్తున్నాయి. చర్మ రుగ్మతలు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, నాడీ సంబంధిత రుగ్మతలు వంటి వ్యాధులు పరిశ్రమల చుట్టుపక్కల నివసించే ప్రజల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి.
నదుల్లోని జీవరాశి విషపూరిత రసాయనాల వల్ల మరణిస్తోంది. ఇది ఆహార గొలుసు అసమతుల్యతకు దారితీస్తోంది. పర్యావరణ నాశనం వల్ల పర్యాటకం, వ్యవసాయం, మత్స్య రంగాలు తీవ్రంగా ప్రభావితమై ఆర్థిక వ్యవస్థకూ చేటు కలిగిస్తోంది. భారతదేశంలో ప్రతి సంవత్సరం 62 మిలియన్ టన్నుల ఘన వ్యర్థాల ఉత్పత్తి అవుతోంది. ఇందులో ఎక్కువ భాగం పారిశ్రామిక వ్యర్థాలే.


