
హైదరాబాద్: విదేశాల నుంచి దిగుమతులు తగ్గించుకొని స్వదేశీ వస్తువుల వినియోగం పెంచగలిగినప్పుడే భారతదేశం స్వయం సమృద్ధిని సాధించగలుగుతుందని చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. భారత్ గ్లోబల్ ఇండస్ట్రీస్ ఫోరం రీజినల్ వైస్ ప్రెసిడెంట్ బొల్లంపల్లి ఇంద్రసేన్‌రెడ్డి ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్‌లో ఏర్పాటు చేసిన సదస్సులో స్వదేశీ వస్తువుల వినియోగం పెంపు, జీఎస్టీ సరళీకరణ, ప్రభుత్వంపై పడుతున్న భారం తదితర అంశాలపై వివిధ పారిశ్రామిక, వ్యాపార వర్గాల ప్రతినిధులు చర్చించారు.
ఈ కార్యక్రమంలో చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని జీఎస్టీ కౌన్సిల్ ప్రవేశ పెట్టిన కొత్త జీఎస్టీ విధానంతో తాత్కాలికంగా కేంద్ర ప్రభుత్వానికి రావాల్సిన రాబడి సుమారు 7 లక్షల కోట్లు తగ్గనుందన్నారు. అయితే పారిశ్రామిక వర్గాలు దేశ ప్రజల మీద ప్రభుత్వానికి ఉన్న విశ్వాసం వల్ల రానున్న కాలంలో జీఎస్టీ వల్ల ఎక్కువ మొత్తంలో పన్నులు వచ్చే అవకాశం ఉందన్నారు. విదేశాల నుంచి అనేక కీలకమైన రంగాల్లో దిగుమతులు ఎక్కువగా చేసుకుంటుండటం వల్ల విదేశీ మారక ద్రవ్యం ఖర్చు చేయాల్సి వస్తుందని ఈ సమస్యను అధిగమించేందుకు వ్యూహాత్మకంగా కేంద్ర ప్రభుత్వం చొరవతో ఇతర దేశాల సంస్థలతో వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవాలని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయన్నారు.
ఇటీవల అమెరికా విధిస్తున్న సుంకాల ప్రభావాన్ని తగ్గించుకునేందుకు స్వదేశీ ఉత్పత్తులను ఎక్కువగా వినియోగించాల్సిన అవసరం మరింత పెరిగిందన్నారు. ఈ అంశాలపై పరిశ్రమ పెద్దలు, వ్యాపారస్తులు స్వదేశీ జాగరణ మంచ్ ప్రతినిధులు కలిసి నివేదిక రూపంలో కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలకు అందజేయనున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సదస్సు నిర్వాహకులు బొల్లంపల్లి ఇంద్రసేన్‌రెడ్డి మాట్లాడుతూ అగ్రికల్చర్, డిఫెన్స్, డిఫెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, డ్రోన్, ఇన్సూరెన్స్, నిర్మాణ రంగం, పర్యాటక రంగం, మౌళిక సదుపాయాలు, ఉత్పత్తి రంగంతో సహా అనేక రంగాల్లో స్వదేశీ వస్తువుల వినియోగాన్ని పెంచేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ పెద్దలు ప్రత్యేక ప్రత్యేక చొరవ తీసుకొని ఇటీవల ఈ అంశంపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారన్నారు.
ఈ సదస్సులో వచ్చిన సూచనలన్ని కేంద్ర ప్రభుత్వానికి విన్నవిస్తామన్నారు. తద్వారా రానున్న రోజుల్లో కొత్త సంస్కరణలు, ప్రోత్సాహకాలు రూపొందించే అవకాశం ఉంటుందన్నారు. ఈ సదస్సులో భారత్ గ్లోబల్ ఇండస్ట్రీస్ ఫోరం ఆలిండియా ఆర్గనైజింగ్ సెక్రటరి సిద్దార్థ శర్మ, స్వదేశి జాగరణ మంచ్ నేషనల్ కన్వనీర్ సుందరం, ఆలిండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ కశ్మీర్ లాల్, ఆలిండియా కో–ఆర్గనైజింగ్ సెక్రటరీ సతీష్ కుమార్, నేషనల్ కో–కన్వీనర్ ప్రొఫెసర్ అశ్విని మహాజన్, నేషనల్ కో–కన్వీనర్ భగవంతు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.