
కొప్పర్తి ఈఎంసీలో రెండు సంస్థల ఉత్పత్తి ప్రారంభం
ఆయా యాజమాన్యాలకు శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
కార్యరూపంలో కనిపిస్తున్న గత ప్రభుత్వ విశేష కృషి
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కొప్పర్తిలో ఈఎంసీ ఏర్పాటు
2022–23లో ఈఎంసీకి వచి్చన టెక్నోడోమ్, టెక్సానా సంస్థలు
వెంటనే పనులు మొదలు పెట్టి శరవేగంగా పురోగతి
ఇప్పుడు ఉత్పత్తితో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభం
2019–24లో తయారీ రంగంలో జాతీయ వృద్ధి రేటు 6.9 శాతం
అదే సమయంలో రాష్ట్ర వృద్ధి రేటు 11.12 శాతం
సాక్షి, అమరావతి: కొప్పర్తిలో టెక్నోడోమ్, టెక్సానా సంస్థలు ఏర్పాటు చేసిన పరిశ్రమలు కార్యకలాపాలు ప్రారంభించడంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సంస్థలు 2022–23లో పరిశ్రమల నిర్మాణ పనులు ప్రారంభించి అత్యంత వేగంగా పూర్తి చేసి, వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించిన తరుణంలో వాటి యాజమాన్యాలకు, ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
» రాష్ట్ర సుస్థిర అభివృద్ధి కోసం పరిశ్రమల పురోగతి ఎంతో అవసరమన్న విషయాన్ని గుర్తించిన గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం.. పారిశ్రామిక, ఉత్పత్తి రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచి్చంది. ఆ దిశలోనే పలు చోట్ల మెగా ఇండ్రస్టియల్ హబ్‌లు, ఈఎంసీల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులో భాగంగా కొప్పర్తిలో మెగా ఇండ్రస్టియల్ హబ్‌కు 2019 ఆగస్టులో ప్రతిపాదన చేసింది.
» అక్కడ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ) ఏర్పాటుకు సంబంధించి 2021 మార్చిలో సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్‌టీపీఐ) నుంచి అనుమతి వచి్చంది. దాంతో అదే ఏడాది.. 2021 డిసెంబరులో వైఎస్సార్ కడప జిల్లా కొప్పర్తిలో ఈఎంసీతో కూడిన మెగా ఇండస్ట్రియల్ హబ్ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైంది.
» అక్కడ పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన పూర్తి సదుపాయాలు కల్పించడంతో, పెట్టుబడులకు ఆకర్షణీయంగా మారింది. పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడంతో కొప్పర్తి మెగా ఇండ్రస్టియల్ హబ్ పారిశ్రామిక రంగంలో జిల్లా రూపురేఖలనే మార్చేసింది. ఈ క్రమంలో కొప్పర్తి మెగా ఇండ్రస్టియల్ హబ్‌కు 2022–23లో వచ్చిన టెక్నోడోమ్, టెక్సానా సంస్థలు, వెంటనే తమ పనులు ప్రారంభించాయి. శరవేగంగా నిర్మాణాలు పూర్తి చేసుకుని ఇప్పుడు ఉత్పత్తిని మొదలు పెడుతున్నాయి. ఈ సందర్భంగా టెక్నోడోమ్, టెక్సానా సంస్థల యాజమాన్యాలు, ఉద్యోగులందరికీ అభినందనలు. వాణిజ్య పరంగా రెండు సంస్థలు ఎంతో వేగంగా అభివృద్ధి చెందాలి.
» గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పారిశ్రామిక, ఉత్పత్తి రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల 2019–24 మధ్య రాష్ట్ర జీడీపీలో ఉత్పాదక రంగం వాటా 11.12 శాతం సగటు వృద్ధి (సీఏజీఆర్) సాధించింది. అదే సమయంలో జాతీయ స్థాయిలో ఆ రంగంలో నమోదైన వృద్ధి (సీఏజీఆర్) 6.9 శాతం మాత్రమే.