
తొలి విడతలో 4,061 హైరిస్క్ పరిశ్రమల్లో తనిఖీలు
ఐదు రీజియన్లుగా రాష్ట్రంలోని పరిశ్రమల విభజన.. ఒక్కో రీజియన్‌కు ప్రత్యేక బృందం
నేటి నుంచి యాజమాన్యాలతో కలెక్టర్ల సమావేశాలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సిగాచీ పరిశ్రమలో ప్రమాదం నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పరిశ్రమల్లో భద్రత తనిఖీలకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు కేవలం ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శాఖ మాత్రమే ఈ తనిఖీలు చేసేది. ఈ స్పెషల్ డ్రైవ్‌లో ఈ శాఖ అధికారులతోపాటు కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ), అగ్నిమాపక, కార్మిక, జిల్లా పరిశ్రమలు, బాయిలర్ శాఖ ఇన్‌స్పెక్టర్లతో కూడిన ఏడుగురు సభ్యులుండే ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహిస్తాయి.
ఈ మేరకు కార్మికశాఖ మూడు రోజుల క్రితం జీఓ 331ను జారీ చేసింది. రెండు నెలలపాటు ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగనుంది. పరిశ్రమల్లో కార్మికుల భద్రత, భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యల్లో భాగంగా ఈ తనిఖీలు నిర్వహించనున్నారు. సిగాచీ పరిశ్రమలో శక్తివంతమైన పేలుడు జరిగి 56 మంది మృత్యువాతపడిన విషయం విదితమే.
మొదట హైరిస్క్ పరిశ్రమల్లో..
స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా మొదట హైరిస్క్ ఉన్న పరిశ్రమల్లో తనిఖీలు చేయనున్నారు. పేలుడు స్వభావం ఉన్న వస్తువులను ఉత్పత్తి చేసే పరిశ్రమలు, అగ్ని ప్రమాదాలకు ఆస్కారం ఉన్నవి, ప్రమాదరకమైన గ్యాస్‌లు లీకయ్యే అవకాశాలున్న ఫ్యాక్టరీల్లో తొలుత తనిఖీలు జరుగుతాయి. హైరిస్క్ పరిశ్రమలు రాష్ట్రవ్యాప్తంగా 4,061 ఉన్నాయి. ఫార్మా, కెమికల్ పరిశ్రమల్లో తొలివిడతలో తనిఖీలు చేయాలని భావిస్తున్నారు.
రెండో విడతలో గ్యాస్ బాట్లింగ్, ఆయిల్, పెయింటింగ్, ఫార్ములేషన్, బయోటెక్ ఫ్యాక్టరీలు; మూడో విడతలో థర్మల్ పవర్‌ప్లాంట్లు, సిమెంట్; నాలులో విడతలో ఇతర హైరిస్క్ ఫ్యాక్టరీలను తనిఖీలు చేయనున్నారు.రాష్ట్రాన్ని ఐదు రీజియన్లుగా విభజన: పరిశ్రమల సంఖ్యను బట్టి రాష్ట్రాన్ని ఐదు రీజియన్లుగా విభజించారు. సంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్‌గిరి, మెదక్, ఉమ్మడి నల్లగొండ రీజియన్లతోపాటు మిగిలిన జిల్లాలతో మరో రీజియన్‌ను ఏర్పాటుచేశారు.
ఒక్కో రీజియన్‌కు ఒక్కో ప్రత్యేక బృందాన్ని నియమించారు. డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కన్వినర్‌గా ఉండే ఈ బృందంలో మొత్తం ఏడుగురు సభ్యులు ఉంటారు. తొలుత ఆయా పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మంగళవారం సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సందర్బంగా యాజమాన్యాలు పాటిస్తున్న భద్రత ప్రమాణాలకు సంబంధించి స్వీయ ధ్రువీకరణ పత్రాలను తీసుకుంటారు.