చెల్లింపు సేవల సంస్థ పేటీఎం తాజాగా తమ ఫ్లాగ్‌షిప్ యాప్ సరికొత్త వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. కృత్రిమ మేధ(ఏఐ) సహాయంతో యూజర్ల రోజువారీ లావాదేవీలను క్రమబద్ధీకరించే విధంగా దీన్ని తీర్చిదిద్దారు. దేశీ యూజర్లతో పాటు 12 దేశాల్లోని ప్రవాస భారతీయులు కూడా మరింత వేగవంతంగా, స్మార్ట్‌గా చెల్లింపులు జరిపేందుకు తోడ్పడే 15 కొత్త ఫీచర్లు, వినూత్న ఇంటర్‌ఫేస్ ఇందులో ఉన్నట్లు కంపెనీ తెలిపింది.
తరచుగా జరిపే లావాదేవీలకు పొదుపు కోణాన్ని కూడా జోడించేలా ప్రతి చెల్లింపుపై యూజర్లకు డిజిటల్ గోల్డ్ రూపంలో రివార్డులిచ్చే విధంగా ‘గోల్డ్ కాయిన్స్’ ఫీచరును ప్రవేశపెట్టినట్లు వివరించింది. నెలవారీ ఖర్చుల వర్గీకరణ, యూపీఐతో అనుసంధానించిన బహుళ బ్యాంకు ఖాతాల్లో నిల్వలను ఒకే చోట చూపించడం, ‘హైడ్ పేమెంట్’ ఆప్షన్, వాట్సాప్ మెసేజీలు.. కాంటాక్టుల నుంచి బ్యాంక్..ఐఎఫ్‌ఎస్‌సీ వివరాలను ఆటోమేటిక్‌గా పూరించే మేజిక్ పేస్ట్ టూల్, అంతర్గతంగా కాల్‌క్యులేటర్ మొదలైన కొత్త ఫీచర్లను యాప్‌లో పొందుపర్చినట్లు సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ తెలిపారు.
ఇదీ చదవండి: డిసెంబర్ నాటికి బంగారం ధరలు ఇలా..


