ఎంబీబీఎస్ సీట్ల పెంపునకూ దరఖాస్తులు ఆహ్వానించిన ఎన్‌ఎంసీ
29 నుంచి వచ్చే నెల 28 వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు అవకాశం
10 లక్షల జనాభాకు 100 సీట్ల నిబంధన నిలుపుదల
సాక్షి, అమరావతి: వచ్చే విద్యా సంవత్సరం(2026–27)లో దేశంలో కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు, ఇప్పటికే ఉన్న కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్ల పెంపు కోసం నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసీ) దరఖాస్తులు ఆహ్వానించింది. అనుమతుల కోసం ఈ నెల 29 నుంచి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఎన్‌ఎంసీ కార్యదర్శి డాక్టర్ ఎల్.రాఘవ్ సోమవారం అన్ని వైద్య కళాశాలల ప్రిన్సిపాల్స్, డీఎంఈలకు లేఖ రాశారు. వచ్చే నెల 28వ తేదీ సాయంత్రం 6 గంటల్లోపు దరఖాస్తులు సమర్పించాలని లేఖలో స్పష్టం చేశారు. ఎన్‌ఎంసీ అధికారిక వెబ్‌పోర్టల్ ద్వారా వచ్చిన ఆన్‌లైన్ దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుంటామన్నారు.
దేశంలో కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు, అదనపు సీట్ల పెంపుపై 2023లో ఎన్‌ఎంసీ అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ)– మినిమమ్ స్టాండర్డ్ రిక్వైర్‌మెంట్(ఎంఎస్‌ఆర్) మార్గదర్శకాలను జారీ చేసింది. దీని ప్రకారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 10 లక్షల జనాభాకు 100 ఎంబీబీఎస్ సీట్ల నిష్పత్తి ప్రాతిపదికన అనుమతులు లభిస్తాయి. అదేవిధంగా కళాశాలల్లో గరిష్టంగా 150 సీట్లు దాటకూడదని అప్పట్లో షరతు విధించారు. ఈ నిబంధనలను 2026–27 విద్యా
సంవత్సరానికి నిలుపుదల చేసినట్టు ఎన్‌ఎంసీ స్పష్టం చేసింది.
వచ్చే ఏడాది లేనట్టే
మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన 17 వైద్య కళాశాలల్లో 10 కళాశాలలను చంద్రబాబు సర్కారు ప్రైవేట్‌కు కట్టబెడుతోంది. గత ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం ఇప్పటికే అన్ని కళాశాలల్లో తరగతులు ప్రారంభమై ఉండాలి. అయితే, చంద్రబాబు నిర్ణయాలతో తరగతులు ప్రారంభం కాలేదు. 2026–27 విద్యా సంవత్సరానికి వచ్చే నెల 28తో కళాశాలలు ప్రారంభించేందుకు దరఖాస్తు గడువు ముగియనుంది.
ఇదిలా ఉండగా తొలి దశలో పులివెందుల, మదనపల్లె, మార్కాపురం, ఆదోని వైద్య కళాశాలలకు వైద్య శాఖ టెండర్లు పిలిచింది. ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. దరఖాస్తుల గడువు ముగిసే నాటికి టెండర్ ప్రక్రియ ముగిసే అవకాశం లేదు. ఈ లెక్కన వచ్చే విద్యా సంవత్సరం కూడా వైద్య కళాశాలలు అందుబాటులోకి రావు. ఇప్పటికే చంద్రబాబు చేసిన కుట్రలతో 2024–25లో 700 ఎంబీబీఎస్ సీట్లు, 2025–26లో 1,750 కలిపి మొత్తం 2,450 సీట్లను మన విద్యార్థులు కోల్పోయారు.


