
ఓలాకు చెందిన భవీష్ అగర్వాల్ స్థాపించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ‘కృతిమ్’ రెండో విడత ఉద్యోగాలను తొలగించినట్లు వార్తలొస్తున్నాయి. ఈ విడతలో 100 మందికి పైగా సిబ్బందిని ఇంటికి పంపినట్లు తెలుస్తుంది. ఈ లేఆఫ్స్‌లో ప్రధానంగా ఇటీవలే కంపెనీలో చేరిన లింగ్విస్టిక్స్ బృందంలో పని చేస్తున్న వారిని అధికంగా తొలగించినట్లు కొన్ని మీడియా సంస్థలు తెలిపాయి.
జూన్‌లో కృతిమ్ మొదటి రౌండ్ ఉద్యోగుల తొలగింపు చేపట్టింది. అందులో భాగంగా డజనుకుపైగా సిబ్బందికి లేఆఫ్స్ ప్రకటించింది. తాజాగా 100కుపైగా ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తుంది. ఈ తొలగింపులు కంపెనీ వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణలో భాగమని, ఉన్న వనరులను మెరుగ్గా నిర్వహించడానికి ఇది ఎంతో తోడ్పడుతుందని ఈ విషయం తెలిసిన వ్యక్తులు చెప్పారు.
ఇదీ చదవండి: బంగారు బాతులను చంపేస్తున్నారు.. దేశానికి సిగ్గుచేటు
జూన్‌లో కంపెనీ కృత్రిమ్‌లో ఏఐ అసిస్టెంట్ ‘కృతి’ని ప్రారంభించింది. దీనికి దాదాపు 80 శాతం శిక్షణ ఇచ్చామని, గతంలో మాదిరిగా తమకు ఎక్కువ మంది సిబ్బంది అవసరం లేదని ఒక అదికారి తెలిపారు. కృత్రిమ్ గతంలో కృత్రిమ మేధ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంలో భారీ పెట్టుబడులను ప్రకటించింది. ఈ ఏడాది ప్రారంభంలో భవీష్ అగర్వాల్ కృత్రిమ్ ఏఐ ల్యాబ్స్‌ను ఆవిష్కరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధికి రూ.2,000 కోట్లు కేటాయించారు. వచ్చే ఏడాది ఈ సంఖ్యను రూ.10,000 కోట్లకు పెంచే ప్రణాళికలున్నట్లు తెలిపారు.