మెరుగైన రాబడులకు వేదిక.. ఈ మ్యూచువల్‌ ఫండ్‌.. | Mutual Fund Invesco India Contra Fund Review | Sakshi
Sakshi News home page

మెరుగైన రాబడులకు వేదిక.. ఈ మ్యూచువల్‌ ఫండ్‌..

Jun 23 2025 3:22 PM | Updated on Jun 23 2025 5:12 PM

Mutual Fund Invesco India Contra Fund Review

ఫండ్‌ రివ్యూ

ఇటీవలి కాలంలో మార్కెట్లలో దిద్దుబాటు నెలకొన్నప్పటికీ.. స్మాల్, మిడ్‌క్యాప్‌ విభాగంలో వ్యాల్యూషన్లు (కంపెనీల విలువలు) సౌకర్యంగా లేవని చాలా మంది నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు అంతర్జాతీయంగా ఎన్నో అనిశ్చిత పరిస్థితులను చూస్తున్నాం. ఇరాన్‌–ఇజ్రాయెల్, ఉక్రెయిన్‌–రష్యా మధ్య యుద్ధాలు.. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ టారిఫ్‌ల పెంపు వంటి ఎన్నో ప్రతికూల పరిణామాలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో కాంట్రేరియన్‌ ఇన్వెస్టింగ్‌ అనుకూలమన్నది నిపుణుల సూచన. మెజారిటీ ఇన్వెస్టర్లకు వ్యతిరేకమైన మార్గాన్ని ఎంపిక చేసుకోవడమే కాంట్రేరియన్‌ ఇన్వెస్టింగ్‌. ఎక్కువ మంది అమ్మేస్తుంటే ఈ ఒత్తిడికి కొన్ని స్టాక్స్‌ (ఆర్థిక మూలాలు బలంగానే ఉన్నా కానీ) ధరలు అధికంగా పడిపోతుంటాయి. అలాంటి వాటిల్లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా దీర్ఘకాలానికి మెరుగైన రాబడులు ఇచ్చే విధంగా కాంట్రేరియన్‌ ఫండ్స్‌ పనిచేస్తుంటాయి. ఈ విభాగంలో ఇన్వెస్కో ఇండియా కాంట్రా ఫండ్‌ స్థిరమైన పనితీరు చూపిస్తోంది.  

రాబడులు 
ఈ పథకం రాబడుల పరంగా మెరుగైన పనితీరు చూపిస్తోంది. ఏడాది కాలంలో 17.3 శాతం రాబడులను ఇన్వెస్టర్లకు అందించింది. మూడేళ్ల పనితీరును గమనిస్తే వార్షిక రాబడి 25.4 శాతంగా ఉంది. ఐదేళ్లలో 28.4 శాతం, పదేళ్లలో 17.6 శాతం చొప్పున వార్షిక రాబడుల చరిత్ర ఈ పథకానికి ఉంది. 2013 నుంచి 2025 మధ్య ఐదేళ్ల కాల రోలింగ్‌ రాబడులు బీఎస్‌ఈ 500 టీఆర్‌ఐ కంటే అధికంగా ఉండడాన్ని గమనించొచ్చు. నెలవారీ సిప్‌ రాబడులు పదేళ్ల కాలంలో చూస్తే ఏటా 19.2 శాతంగా ఉన్నాయి.  

పెట్టుబడుల విధానం.. 
ఈ పథకం కాంట్రేరియన్‌ విధానం ఒక్క దానినే పూర్తిగా అనుసరించదు. రంగాల వారీ కేటాయింపుల పరంగా వివేకంతో వ్యహరిస్తుంటుంది. స్టాక్స్‌ ఎంపికకు మల్టీక్యాప్‌ విధానాన్ని అనుసరిస్తుంది. అంటే లార్జ్, మిడ్, స్మాల్‌క్యాప్‌లో ఎక్కడ అవకాశాలున్నా ఇన్వెస్ట్‌ చేస్తుంటుంది. కరోనా క్రాష్‌ తర్వాతి కాలంలో లార్జ్‌క్యాప్‌నకు 70 శాతం వరకు కేటాయింపులు చేసింది. ఆ తర్వాత ఈ కేటాయింపులను తగ్గించుకుంది. తన నిర్వహణలోని పెట్టుబడుల్లో 3–4 శాతం మంచి నగదు నిల్వలను కలిగి ఉండదు. ఎప్పటికప్పుడు రంగాల వారీ వస్తున్న మార్పులను గమనించి, వేగంగా తన పెట్టుబడి వ్యూహాలను మార్చుకుంటుంది. దీంతో మెరుగైన రాబడులు ఇవ్వడం, రిస్క్‌ తగ్గించే విధంగా ఈ పథకం పనిచేస్తుంటుంది. కాంట్రేరియన్‌ విధానం మధ్యలో కొంత కాలం పాటు మెరుగైన రాబడులు ఇవ్వకపోవచ్చు. కనుక ఇన్వెస్టర్లు దీర్ఘకాలం కోసమే (5–7 ఏళ్లకు మించి) కాంట్రా ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవడం సూచనీయం.

పోర్ట్‌ఫోలియో 
ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతం రూ.18,398 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 99.45 శాతం మేర స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసింది. 0.55 శాతం మేర నగదు నిల్వలు ఉన్నాయి. పెట్టుబడులను గమనిస్తే 69.36 శాతం మేర లార్జ్‌క్యాప్‌లోనే ఉన్నాయి. మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌లో 26.90 శాతం ఇన్వెస్ట్‌ చేసింది. స్మాల్‌క్యాప్‌ పెట్టుబడులు 3.74 శాతానికి పరిమితమయ్యాయి. పోర్ట్‌ఫోలియోలో మొత్తం 81 స్టాక్స్‌ ఉన్నాయి. అత్యధికంగా 33 శాతం మేర పెట్టుబడులు బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ రంగ కంపెనీల్లోనే ఉన్నాయి. ఆ తర్వాత టెక్నాలజీ రంగ కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ 16 శాతం మేర పెట్టుబడులు కేటాయించింది. హెల్త్‌ కేర్‌ కంపెనీల్లో 14 శాతం, కన్జ్యూమర్‌ డిస్క్రీషనరీ కంపెనీల్లో 13 శాతం చొప్పున ఇన్వెస్ట్‌ చేసింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement