ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఇటీవల చైనా పాటిస్తున్న 996 రూల్ గురించి మాట్లాడుతూ.. యువత వారానికి 72 గంటలు పనిచేయాలని అన్నారు. దీనిపై ఆరిన్ క్యాపిటల్ చైర్మన్ 'మోహన్‌దాస్ పాయ్' స్పందించారు.
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి యువ భారతీయులను ఎక్కువ గంటలు పనిచేయాలని కోరారు. కానీ మూర్తి వ్యాఖ్యలు కేవలం వ్యవస్థాపకులు, ఆవిష్కర్తలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఈ వ్యాఖ్యలు చేసారని మోహన్‌దాస్ పాయ్ పేర్కొన్నారు. ఇది సాధారణ ఉద్యోగులకు వర్తించదని ఆయన పేర్కొన్నారు.
ఇన్ఫోసిస్ నారాయణమూర్తి వ్యాఖ్యలను చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పోటీతత్వం ఎక్కువైంది. టెక్ కంపెనీలు అభివృద్ధి చెందాలంటే.. ఎక్కువ గంటలు పనిచేయాల్సిన అవసరం ఉంది. సాధారణ ఉద్యోగులను 70 గంటలు పని చేయమని అడగడం లేదు. బ్యాంకు సిబ్బందిని లేదా ఆఫీసుకు వెళ్లేవారిని ఎవరూ ఇలా చేయమని అడగడం లేదని పాయ్ తెలిపారు.
ఏమిటీ 996 రూల్?
చైనాలో పాటిస్తున్న 9-9-6 నియమాన్ని ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 996 ఫార్ములా ప్రకారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పని, వారానికి 6 రోజులను సూచిస్తుంది. అంటే రోజుకు 12 గంటలు.. 6 రోజులు చేయాలన్నమాట. ఇలా మొత్తానికి వారానికి 72 గంటలు పనిచేయాలన్నమాట.
చైనాలోని చాలా కంపెనీలు ఈ నియమాన్ని పాటిస్తున్నాయి. దీనిపై అనేక విమర్శలు వచ్చాయి. కొన్ని సంస్థలు ఈ నియమాన్ని రద్దు చేసినప్పటికీ.. ఇంకొన్ని అమలు చేస్తూనే ఉన్నాయి. కాగా చైనా ప్రభుత్వం కూడా దీనిని క్రమంగా నియంత్రించడానికి తగిన చర్యలను తీసుకుంటోంది. అలాంటి ఈ విధానాన్ని నారాయణమూర్తి ప్రస్తావించడం.. కొంత మందిలో ఆగ్రహాన్ని కలిగిస్తోంది.


