మహీంద్రా నుంచి చిన్న ట్రాక్టర్లు: ఏఆర్‌ రెహమాన్‌ గీతం అదుర్స్‌

 mini tractors from mahindra - Sakshi

ధర రూ. 5,64,500 నుంచి ప్రారంభం

మూడేళ్లలో రెట్టింపు ఎగుమతులపై దృష్టి  

కేప్‌టౌన్‌ (దక్షిణాఫ్రికా): ఆటోమొబైల్‌ దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) కొత్తగా మరిన్ని వాహనాలను ఆవిష్కరించింది. చిన్న ట్రాక్టర్లు, కార్లు వీటిలో ఉన్నాయి. చిన్న కమతాల రైతులు, వ్యక్తిగత ఫామ్‌హౌస్‌లున్న వారు మొదలైన వర్గాలకు ఉపయోగపడేలా తేలికపాటి, చిన్న ట్రాక్టర్లను ఫ్యూచర్‌స్కేప్‌ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో కంపెనీ ప్రవేశపెట్టింది. మహీంద్రా ఓజా పేరిట ఆవిష్కరించిన ఈ ట్రాక్టర్ల శ్రేణిలో ఏడు మోడల్స్‌ ఉంటాయి. వీటి ధర రూ. 5,64,500 నుంచి రూ. 7,35,000 వరకు (పుణె– ఎక్స్‌ షోరూమ్‌) ఉంటుంది.

తెలంగాణలోని జహీరాబాద్‌ ప్లాంటులో తయారు చేసే ఈ ట్రాక్టర్లను దేశీయంగా విక్రయించడంతో పాటు ఉత్తర అమెరికా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, యూరప్‌ తదితర ప్రాంతాలకు కూడా ఎగుమతి చేయనున్నట్లు సంస్థ ఈడీ (ఆటో, ఫార్మ్‌ విభాగాలు) రాజేశ్‌ జెజూరికర్‌ తెలిపారు. వచ్చే మూడేళ్లలో ట్రాక్టర్ల ఎగుమతులను రెట్టింపు చేసుకోవాలని నిర్దేశించుకున్నట్లు చెప్పారు. కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో 18,000 పైచిలుకు ట్రాక్టర్లను ఎగుమతి చేసింది. ఓజా ప్లాట్‌ఫాంపై రూ. 1,200 కోట్లు ఇన్వెస్ట్‌ చేసినట్లు జెజూరికర్‌ వివరించారు.  మహీంద్రా రీసెర్చ్‌ వ్యాలీ, మిత్సుబిషి మహీంద్రా అగ్రికల్చర్‌ మెషినరీ కలిసి దీన్ని తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. (2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌)

థార్‌.ఈ, గ్లోబల్‌ పికప్‌ ఆవిష్కరణ.. 
ఫ్యూచర్‌స్కేప్‌ కార్యక్రమంలో భాగంగా ఎంఅండ్‌ఎం ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ ‘థార్‌.ఈ’ని కూడా ఆవిష్కరించింది. వినూత్నమైన డిజైన్, ఇంటీరియర్స్‌తో పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని దీన్ని రూపొందించినట్లు సంస్థ ఆటోమోటివ్‌ విభాగం ప్రెసిడెంట్‌ వీజే నక్రా తెలిపారు. మరోవైపు, అంతర్జాతీయ మార్కెట్ల కోసం గ్లోబల్‌ పికప్‌ వాహనాన్ని సైతం సంస్థ ఆవిష్కరించింది. రోజువారీ ప్రయాణ అవసరాలతో పాటు సాహస ట్రిప్‌లకు కూడా అనువుగా ఇది ఉంటుందని నక్రా వివరించారు. అటు, విద్యుత్‌ వాహనాల శ్రేణి కోసం నెలకొల్పిన మహీంద్రా ఎలక్ట్రిక్‌ ఆటోమొబైల్స్‌ (ఎంఈఏఎల్‌)కి కొత్త లోగోను కూడా కంపెనీ ఆవిష్కరించింది. దీనికి సంబంధించిన ‘లే ఛలాంగ్‌’ ప్రచార గీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహ్‌మాన్‌ స్వరపర్చారు.  (టెకీలకు గుడ్‌ న్యూస్‌: ఇన్ఫోసిస్‌ మెగా డీల్‌)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top