
ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లకు మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని దాదాపు అన్ని కంపెనీలు తమ ఉత్పత్తులను ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా.. 'విండ్సర్ ఈవీ' పేరుతో ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. ఇది ప్రారంభం నుంచి ఎక్కువమంది కస్టమర్లను ఆకర్షిస్తూ.. గొప్ప అమ్మకాలను పొందుతోంది. గత నెలలో (జులై 2025) కూడా విండ్సర్ సేల్స్ 4308 యూనిట్లుగా నమోదైంది. దీంతో దేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారుగా రికార్డ్ క్రియేట్ చేసింది.
ఎంజీ విండ్సర్ అమ్మకాలు మొత్తం 36,000 యూనిట్లకు చేరుకున్నాయి. దీన్నిబట్టి చూస్తే మార్కెట్లో ఈ కారుకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. కంపెనీ మార్కెట్ వాటా పెరగడానికి కూడా ఈ కారు దోహదపడింది. విండ్సర్ నెలవారీ అమ్మకాలు 17 శాతం పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది.
ఎంజీ విండ్సర్ ఈవీ
ఎంజీ విండ్సర్ ఐదు వేరియంట్లలో లభిస్తుంది. అవి ఎక్సైట్ (38kWh), ఎక్స్‌క్లూజివ్ (38kWh), ఎసెన్స్ (38kWh), ఎక్స్‌క్లూజివ్ ప్రో (52.9kWh), ఎసెన్స్ ప్రో (52.9kWh). కస్టమర్లు ఫిక్స్డ్ బ్యాటరీ ఆప్షన్ లేదా బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) సబ్‌స్క్రిప్షన్లలో ఏదైనా ఎంచుకోవచ్చు. దీని ధరలు రూ. 14.00 లక్షల నుంచి రూ. 18.31 లక్షల (ఎక్స్-షోరూం) మధ్య ఉన్నాయి. ధరలు ఎందుకుని వేరియంట్, బ్యాటరీ ఆప్షన్ల మీద ఆధారపడి ఉంటాయి.
ఇదీ చదవండి: నీతా అంబానీ రూ.100 కోట్ల కారు: దీని స్పెషాలిటీ ఏంటంటే?
విండ్సర్ ఎలక్ట్రిక్ కారులో పర్మినెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటారు ఉంటుంది. ఇది 136 పీఎస్ పవర్ 200 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 37.9 కిలోవాట్ బ్యాటరీ ద్వారా 332 కిమీ రేంజ్, 52.9 కిలోవాట్ బ్యాటరీ ద్వారా 449 కిమీ రేంజ్ అందిస్తుందని ఏఆర్ఏఐ ధ్రువీకరించింది. వాస్తవ ప్రపంచంలో, వివిధ వాతావరణ పరిస్థితుల్లో.. రేంజ్ అనేది కొంత తగ్గే అవకాశం ఉంటుంది.